Share News

AP Elections: చిత్తయినా..అదే ఎత్తు..!

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:29 AM

సార్వత్రిక ఎన్నికలకు ముందు హత్యలు, దోపిడీలు, ఇతర చట్టవ్యతిరేక అంశాలు బయటకొస్తే, వాటిని ప్రత్యర్థిపై నెట్టేసి, తన రోత మీడియా ద్వారా ప్రజల్లో దుష్ప్రచారం చేయడానికి వేసిన ఎత్తులు..

AP Elections: చిత్తయినా..అదే ఎత్తు..!

  • నాడు వివేకా హత్య.. ఇప్పుడు విశాఖ డ్రగ్స్‌

  • ఎన్నికలముందు ప్రత్యర్థులపైకి నెట్టే యత్నం

  • సీబీఐ విచారిస్తుండగానే ‘డ్రగ్స్‌’లో లింకులు

  • పురందేశ్వరి, బాబు, లోకేశ్‌, భరత్‌లపై విషం

  • ఎన్నికలముందు మరోసారి జగన్‌ మైండ్‌గేమ్‌

  • వివేకాను బాబు చంపించారని నాడు కథనాలు

  • చివరకు జగన్‌ కుటుంబం మెడకు ఆ కేసు

వివేకా హత్య, కోడి కత్తి.. ఇలా గత ఎన్నికల ముందు జరిగిన ప్రతి ఘటననూ ప్రత్యర్థులపైకి జగన్‌, ఆయన రోత మీడియా నెట్టాయి. ఆనక.. వివేకా కేసు జగన్‌ కుటుంబం మెడకే చుట్టుకోగా, కోడికత్తి ఘటనలో ‘కుట్ర’ను వెతకాలని ప్రయత్నించి భంగపడ్డారు. సరిగ్గా ఎన్నికల ముందు ఇప్పుడు విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంలోనూ ఆ పాచిపోయిన పాత వ్యూహాన్నే తెరపైకి తెచ్చారు. ఒకవైపు దర్యాప్తు సాగుతుండగానే చంద్రబాబును, ఆయన బంధువులకు లింకు పెడుతూ రోత ప్రచారం మొదలుపెట్టారు. అయితే, ఈ ఎత్తూ మళ్లీ చిత్తు కావడం ఖాయమని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి) :

సార్వత్రిక ఎన్నికలకు ముందు హత్యలు, దోపిడీలు, ఇతర చట్టవ్యతిరేక అంశాలు బయటకొస్తే, వాటిని ప్రత్యర్థిపై నెట్టేసి, తన రోత మీడియా ద్వారా ప్రజల్లో దుష్ప్రచారం చేయడానికి వేసిన ఎత్తులు...ఆ తర్వాత ఘోరంగా చిత్తయ్యాయి. గత ఎన్నికల ముందు చంద్రబాబుపైకి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను నెట్టేయాలని చూడగా, ఐదేళ్లు తిరిగేటప్పటికి ఆ కేసు జగన్‌ కుటుంబం మెడకే చుట్టుకోవడం చూశాం. అయినా... పాలక పార్టీకి బుద్ధి రావడం లేదు. తాజాగా విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంలోనూ అదే పాచిపోయిన పాత ఎత్తును తెరపైకి తెచ్చారు. సీబీఐ దర్యాప్తు ప్రాథమిక స్థాయిలో ఉండగానే, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి, చంద్రబాబు, లోకేశ్‌, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్‌కు లింకులు అంటగడుతూ జగన్‌ రోత పత్రిక దుష్ప్రచారం మొదలెట్టేసింది. సత్యం లోకానికి తెలిసేలోగానే అబద్ధాలతో తన పని కానించేసుకోవడం జగన్‌ మనస్తత్వం అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి, ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. అయితే, ఆ విషయమూ మరిచిపోయారా అన్నట్టు వైసీపీ నేతల తీరు ఉంది. విశాఖ పోర్టుకు వచ్చిన డ్రగ్స్‌తో ఎవరెవరికి ప్రమేయం ఉందో సమగ్ర సమచారం రాష్ట్ర దర్యాప్తు సంస్థలు..సీఎం జగన్‌కు అందిస్తాయి. నిఘావర్గాల నివేదికలూ అందుబాటులోనే ఉంటాయి. కానీ .. ఆధారాల్లేకుండా .. ప్రతిపక్షాలపై బురద జల్లేస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకునే వీలున్నా, అధికారిక ట్విట్టర్‌ వేదికగా ప్రత్యర్థిపార్టీల నేతలపై విషప్రచారానికి దిగారు. విశాఖ పోర్టుకు దిగుమతి అయిన డ్రగ్స్‌తో చంద్రబాబు, లోకేశ్‌ల ప్రమేయంపై విచారణ జరపాలంటూ ఎన్నికల కమిషన్‌కు మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసును కేంద్ర దర్యాప్తుసంస్థ సీబీఐ విచారణ చేస్తోంది. పైగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించడంవల్లే దర్యాప్తులో జాప్యం జరిగిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. విశాఖ పోర్టు డ్రగ్స్‌ దిగుమతిపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు వివరాలు బయటకు రాకుండానే .. ప్రత్యర్ధులపై బురద జల్లేయడం ద్వారా 2019 తరహా రాజకీయలబ్ధిని పొందాలని చూస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బూమరాంగ్‌ అవుతుందా?

విశాఖ డ్రగ్స్‌ దిగుమతిపై తొలుత పురందేశ్వరిపైనా, ఆమె కుటుంబ సభ్యులపైనా జగన్‌ రోత పత్రిక, అధికారిక ట్విట్టర్‌ వేదికగా విషం జిమ్మారు. ఆ తర్వాత, పురందేశ్వరితో బంధుత్వం రీత్యా చంద్రబాబుకు, బాలకృష్ణ, ఆయన అల్లుళ్లు భరత్‌, లోకేశ్‌లకూ లంకె పెడుతూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకూ ఈ మకిలి అంటిస్తూ పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం ఎన్నికల ప్రధానాధికారికి ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. రాజకీయంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూ ఉండాలని విశ్లేషకులు చెబుతుంటారు. అన్నింటికీ ఒకే మంత్రం వేస్తే బెడిసికొట్టడం ఖాయం. 2019 నాటి పరిస్థితులకూ .. ప్రస్తుత స్థితిగతులకూ పూర్తి వ్యత్యాసం ఉందని గుర్తు చేస్తున్నారు. 2019లో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య సమయానికి ఎన్నికలు సమీపించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నిర్ణయాలను తీసుకునే వీలు లేని పరిస్థితి ఆయనది. అందువల్ల .. వివేకా హత్య కేసులో ప్రాథమిక దర్యాప్తు వివరాలను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు. ఈ సంధికాలాన్ని జగన్‌ వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు. వివేకా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందనే సందేహాలను కలిగించారని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు విశాఖ డ్రగ్స్‌ కేసు విషయంలోనూ 2019 తరహా వ్యూహాన్నే అమలు చేస్తూ ప్రత్యర్ధులపై జగన్‌ మైండ్‌ గేమ్‌కు ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ ఎలాంటి ఆటలు ఆడినా చెల్లుబాటయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నందున జగన్‌ వేస్తున్న ఎత్తుగడలు బూమరాంగ్‌ అవుతాయని రాజకీయవర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Updated Date - Mar 25 , 2024 | 10:50 AM