వైసీపీకి కుదిరిన ముహూర్తం
ABN , Publish Date - Feb 12 , 2024 | 01:56 AM
సత్యవేడు వైసీపీలో అధినాయకత్వానికి, నియోజకవర్గ నాయకులకు మధ్య పెరిగిన గ్యాప్ కవర్ చేసుకునేందుకు ముహూర్తం కుదిరినట్లు కనబడుతోంది.

- ఎట్టకేలకు నియోజకవర్గంలో అడుగు పెట్టిన సత్యవేడు అభ్యర్థి
సత్యవేడు, ఫిబ్రవరి 11: సత్యవేడు వైసీపీలో అధినాయకత్వానికి, నియోజకవర్గ నాయకులకు మధ్య పెరిగిన గ్యాప్ కవర్ చేసుకునేందుకు ముహూర్తం కుదిరినట్లు కనబడుతోంది. పార్టీ ప్రకటించిన అభ్యర్థి నూకతోటి రాజేష్ ఎట్టకేలకు నియోజకవర్గంలో ఆదివారం అడుగుపెట్టారు. వైసీపీ అధిష్ఠానం ఇటీవల నియోజకవర్గంలో చేసిన అభ్యర్థుల మార్పు ప్రయోగం విఫలమై శ్రేణుల్లో అసంతృప్తి పెల్లుబికింది. తమను సంప్రదించకుండా, మాటమాత్రమైనా చెప్పకుండా అభ్యర్థులను మార్చిన అధిష్ఠానం నిర్ణయంపై స్థానిక నాయకులు అలకబూనారు. ఉమ్మడి జిల్లాలోని చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు నూతన ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన విజయానందరెడ్డి, సునీల్ కుమార్ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండగా సత్యవేడు ఇన్‌చార్జ్ రాజేష్ మాత్రం పది రోజులైనా నియోజకవర్గానికి రాకపోవడం, మర్యాదపూర్వకంగానైనా కలవకపోవడం నాయకుల్లో అసంతృప్తి రాజేసింది. ఈ నేపథ్యంలో పార్టీకి, నాయకులకు మద్య చాలా గ్యాప్ ఏర్పడింది.. కొత్త అభ్యర్థి ప్రకటనతో నియోజకవర్గంలో ఏర్పడిన గందరగోళం, క్యాడర్‌లో వచ్చిన వ్యతిరేకత తదితర అంశాలను స్థానిక నాయకులు జిల్లా కీలక నేతకు వివరించి, మళ్ళీ గురుమూర్తి లేదా నారాయణస్వామిలలో ఎవరినైనా ఒకరిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించాలని కోరినట్లు సమాచారం. అయితే రాజేష్ అభ్యర్థిత్వంలో ఇక మార్పు ఉండబోదని ఆయన తేల్చి చెప్పినట్లు వినికిడి.ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం ఓ మంచిమూహూర్తం చూసుకుని నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ భేటీ నిర్వహించి రాజే్‌షను నియోజకవర్గానికి పరిచయం చేయాలనుకుంది.ఈలోగా నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఖంగుతిన్న పార్టీ పెద్దలు రాజే్‌షను హుటాహుటిన నియోజకవర్గ పర్యటనకు పంపించారు. దీంతో బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో కొద్దిమంది నాయకులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. తన గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేసి వైసీపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల దగ్గరకు తీసుకుపోవాలన్నారు.ఈ సమావేశానికి వైసీపీలోని ఓ వర్గం డుమ్మాకొట్టడం చర్చనీయాంశంగా మారింది.