TDP: చంద్రబాబు కుప్పంలో నేటి నుంచి రెండు రోజుల పర్యటన
ABN , Publish Date - Mar 25 , 2024 | 10:37 AM
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమ, మంగళవారాల్లో సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సోమవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సోమ, మంగళవారాల్లో సొంత నియోజకవర్గమైన కుప్పం (Kuppam)లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సోమవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం 2 గంటల వరకు నాయకులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కుప్పం ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహం (NTR Statue) ఎదుట జరిగే బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఈ సభ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుంది. అక్కడ్నుంచి ఏవీఆర్ కల్యాణ మండపానికి చేరుకుని 6- 7 గంటల మధ్య ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి చేరుకుని 7.30 నుంచి రాత్రి 8.30 గంటలదాకా నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రి బస చేస్తారు.
మంగళవారం ఉదయం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 11 గంటలకు కేవీఆర్ కల్యాణ మండపానికి చేరుకుంటారు. పార్టీలో చేరే వారిని కండువాలు కప్పి ఆహ్వానిస్తారు. అనంతరం కుప్పంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు టీడీపీ కార్యాలయానికి చేరుకుని 3.30 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత రామకుప్పం మండలం రాజుపేట గ్రామం వద్ద హంద్రీ-నీవా కాలువను సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పరిశీలిస్తారు. 6 గంటలకు తిరిగి కుప్పంలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని 7.45 గంటల వరకు నేతలతో సమావేశమవుతారు. రాత్రికి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.