Share News

Chandrababu : కొత్త విజయవాడను చూపిస్తా

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:35 AM

వరద ముంపు ఉండని కొత్త విజయవాడను చూపిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘హుద్‌హుద్‌ తుఫాన్‌లో చిన్నాభిన్నమైన విశాఖను తర్వాత ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాం.

Chandrababu : కొత్త విజయవాడను చూపిస్తా

  • హుద్‌హుద్‌లో విశాఖను తీర్చిదిద్దినట్టే

  • వరద తాకని నగరంగా మారుస్తా

  • నష్టపోయిన వారిని నిలబెట్టడం పెద్ద సవాల్‌

  • కేంద్రం ఉదారంగా ఆదుకుంటుందని ఆశిస్తున్నా

  • వేగంగా సాయం పంపిణీకి ఏర్పాట్లు

  • కేంద్ర సాయంపై వస్తున్న వార్తలు వదంతులే

  • మేం ఇంకా నివేదికే పంపలేదు: చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): వరద ముంపు ఉండని కొత్త విజయవాడను చూపిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘హుద్‌హుద్‌ తుఫాన్‌లో చిన్నాభిన్నమైన విశాఖను తర్వాత ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దాం. అలాగే విజయవాడ రూపురేఖలు మారుస్తాం’’ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ కలెక్టరేట్‌లో మాట్లాడారు. ‘‘మానవ తప్పిదాలతో విజయవాడ మునిగింది. బుడమేరు ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి, గట్లను గత ప్రభుత్వం పటిష్ఠం చేసి ఉంటే ఇవాళ ఈ వరద ఉండదు.

11 copy.jpg

లక్షల మందికి ఇంత శోకం ఉండదు. బుడమేరు గట్టుకు పడిన గండ్లలో ఇంకా ఒకటి పూడ్చాల్సి ఉంది. ఆర్మీ నిపుణులను కూడా తీసుకువచ్చాం. వరద నడుస్తుండగా గండిని పూడ్చడం క్లిష్టంగా ఉందని వాళ్లు కూడా చెబుతున్నారు. అయినా పెద్ద పోరాటం చేస్తున్నాం. రేపటికి గండి పూడ్చే అవకాశం ఉంది. ఈ వాగుకు నిన్న తొమ్మిది వేల క్యూసెక్కుల వరద రావడంతో అందులో కొంత విజయవాడలోకి మళ్లీ ప్రవహించి కొన్నిచోట్ల ముంపు పెరిగింది. ఈ రోజు రాత్రికి వాన పడకపోతే రేపటికి గండి పూడు స్తాం. కాబట్టి ఇబ్బంది ఉండదని అనుకొంటున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు.


  • ఇవ్వగలిగినంత చేయూత అందిస్తా...

వరదల్లో నష్టపోయిన వారిని నిలబెట్టాలన్నది తన తపనని, దానిపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ‘‘వ్యాపారాలు చేసుకొనేవారు బాగా దెబ్బతిన్నారు. ఇళ్లలో సామాన్లు నాశనం అయ్యాయి. వాహనాలు దెబ్బతిని నష్టపోయారు. ఇవన్నీ నేను నాకళ్లతో చూశాను. వీరిని ఎలా ఆదుకోవాలన్నది సమస్య. బీమా కంపెనీలు కొర్రీలు వేయకుండా త్వరగా పరిహా రం ఇచ్చేలా చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఏవైనా సర్టిఫికెట్లు కావాలంటే ఇస్తామని చెప్పాం. వ్యాపారా లు, వాహనాలు, ఇళ్ల రుణాలు రీ షెడ్యూల్‌ చేసి వారికి కొంత వ్యవధి దొరికేలా చూడాలని అనుకొంటున్నాం. కొత్త రుణాలు ఇప్పించడంపై బ్యాంకులతో మాట్లాడుతున్నాం. మేం సొంతంగా ఇవ్వడానికి రాష్ట్రం ఇప్పటికే బాగా లోటులో ఉంది. ఈ పరిస్ధితులన్నీ కేంద్రానికి వివరించాం.

వాళ్లు కూడా ఉదారంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. అవసరం అయితే ఢిల్లీ వెళ్ళే విషయం ఆలోచిస్తానని చెప్పారు. కాగా, వరద ముంపునకు గురై న ప్రాంతాల్లో దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లలో పరికరా లు, సామాన ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నామని వెల్లడించారు. బయటి ప్రాంతాల నుంచి మెకానిక్‌లను తెప్పించి, ప్రభుత్వం నుంచి కొంత ఖర్చుకూడా పెట్టి వాటిని మరమ్మతులు చేయించే ఆలోచన చేస్తున్నామన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించే పని వేగంగా సాగుతోందని ఆయన చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..


  • సరుకులతోపాటు యాపిల్స్‌, నూడుల్స్‌..

చిన్నాపెద్దా తేడా లేకుండా ముంపు ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి సరుకులు ఇస్తున్నారు. దీనితోపాటు డ్రై ప్యాకేజి కింద ఆరు నూడుల్స్‌ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్‌, ఆరు లీటర్ల మంచినీళ్లు, రెండు లీటర్ల పాల ప్యాకెట్లు, ఆరు బిస్కట్‌ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. శనివారం వరకూ ప్రభుత్వ సిబ్బంది.... సుమా రు నలభై వేల కుటుంబాలకు వీటిని పంపిణీ చేస్తారు. ఆదివారం నుంచి రేషన్‌ షాపుల్లో పెట్టి అక్కడ నుంచి అందరూ తీసుకువెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. ఆధార్‌ కార్డు చూపించి వీటిని తీసుకోవచ్చు. ఆకు కూరలు రెండు రూపాయలు, కొన్ని రకాల కూరగాయలు కిలో ఐదు, మరి కొన్ని కిలో రూ.10 రేటు పెట్టి ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం తరపున విక్రయిస్తున్నారు. శుక్రవారం నలభై వేల కిలోల కూరగాయలు తెప్పించారు.

శనివారం నుంచి ఇంకా ఎక్కువ తెప్పిస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే పదకొండున్నర లక్షల మంచినీళ్ల బాటిళ్లు, నాలుగున్నర లక్షల పాల ప్యాకెట్లు, ఆరు లక్షల బిస్కట్‌ ప్యాకెట్లు, డెబ్బై ఐదు వేల కొవ్వొత్తులు, ఏభై వేల అగ్గిపెట్టెలు సరఫరా చేశారు. కాగా, ముంపు ప్రాంతాల్లో ఏడువేల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటికి 12 వేల టన్నుల చెత్తను తీశా రు. 110 ఫైర్‌ ఇంజన్లు రోడ్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు శుభ్రం చేస్తున్నాయి. నీళ్లు ఉన్న ప్రాంతాల్లోని 23 వేల కనెక్షన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరించారు. 15 డ్రోన్లు ఆహారం పంపిణీ చేస్తున్నాయి. విజయవాడ ముంపు ప్రాంతంలో ఉచిత బస్సులు పెట్టామని తెలిపారు.


  • కేంద్ర సాయంపై వదంతులు..

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ. 3300 కోట్లు సాయంగా ప్రకటించిందని వచ్చిన వార్తలు ఒట్టి వదంతేనని చంద్రబాబు స్పష్టం చేశారు. వరద నష్టంపై తాము ఇంకా నివేదిక కూడా పంపకుండానే కేంద్రం ఎలా సాయం ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. నివేదికను శనివారం కేంద్రానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా, బుడమేరు కట్ట తెగిన ప్రాంతంలో హెలికాప్టర్‌లో సీఎం శుక్రవారం ఉదయం ఏరియల్‌ విజిట్‌ చేశారు. బుడమేరు ఏఏ ప్రాంతాలగుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తున్నదీ, అక్కడి గ్రామాల పరిస్థితి ఏమిటనేదీ ఆయన పరిశీలించారు.


  • పండగరోజూ కలెక్టరేట్‌లోనే బాబు

శనివారం వినాయక చవితి పండగ రోజు కూడా విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉండిపోవాల ని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ‘‘శనివారం వినాయక చవితిని కలెక్టరేట్‌లోనే చేసుకొంటున్నా ను. ఇంటికి వెళ్లడం లేద’’ని తెలిపారు. విజయవాడ నగరం గతంలో ఎన్నడూ లేనంత స్థాయి లో వరద ముంపునకు గురి కావడంతో ఆయన కలెక్టరేట్‌లోనే గత వారం రోజులుగా ఉంటున్నా రు.

బాత్రూం సదుపాయం ఉన్న బస్సును కలెక్టరేట్‌ ఆవరణలో పెట్టి ఆయన అందులోనే పడుకొంటున్నారు. పండగ రోజు కూడా అక్కడే ఉండిపోవాలని ఆయన నిశ్చయించారు. వరద సహాయక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో తాను పక్కకు వెళ్తే మళ్లీ అవి గాడితప్పే ప్రమా దం ఉందన్నారు. బాధితులకు లేని పండగ మనకెందుకని ఆయన వ్యాఖ్యానించినట్లు ఒక మంత్రి చెప్పారు. కలెక్టరేట్‌ ఆవరణలోనే ఒక చోట వినాయకుడి విగ్రహం పెట్టి శనివారం అక్కడే పూజ చేయాలని నిర్ణయించారు. పూజ ఏర్పాట్లు చూడటానికి కనకదుర్గ ఆలయానికి చెందిన అర్చకులు కలెక్టరేట్‌కు శుక్రవారం వచ్చారు.

Updated Date - Sep 07 , 2024 | 03:35 AM