రాష్ట్రంలో ఏం జరుగుతోంది?
ABN , Publish Date - May 16 , 2024 | 04:35 AM
ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) మండిపడింది. దీనిపై గురువారం ఢిల్లీ వచ్చి స్వయంగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్
’సీఎస్, డీజీపీకి ఈసీ సమన్లు
పోలింగ్ ముగిసినా ఈ హింస ఏమిటి?
కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్
ఎన్నికల రోజునా నిర్లక్ష్యం..
ఆ తర్వాత కూడా ఇంత నిర్లిప్తతా?
ఈ హింసాకాండకు బాధ్యులెవరు?
నేడు ఢిల్లీ వచ్చి వివరణివ్వండి.. ఈసీ శ్రీముఖం
డీజీపీ, నిఘా చీఫ్‌తో జవహర్‌రెడ్డి అత్యవసర భేటీ
కమిషన్‌కు ఏం చెప్పాలనే దానిపై చర్చలు
ఇదంతా సీఎస్ వైఫల్యమేనని ఈసీ గుర్రు?
అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) మండిపడింది. దీనిపై గురువారం ఢిల్లీ వచ్చి స్వయంగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిని, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను బుధవారం ఆదేశించింది. ‘పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు జరగడమేంటి? రాష్ట్రంలో ఈ రెండ్రోజుల్లో జరిగిన పరిణామాలకు బాధ్యులెవరు..? పోలింగ్ రోజు నిర్లక్ష్యం వహించారు.. ఆ తర్వాత కూడా నిర్లిప్తత కనిపిస్తోంది.. ఇంతకూ ఏపీలో ఏం జరుగుతోంది..? మీరిద్దరూ ఢిల్లీకి వచ్చి సమాధానం ఇవ్వండి’ అని నిర్దేశించింది. పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి నుంచి మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో వరుసగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందా.. నిఘా వర్గాల సమాచారం లేదా.. పోలీసు బందోబస్తు చర్యల్లో లోపముందా తదితర అంశాలపై తమకు వివరణ ఇవ్వాలని స్పష్టంచేసింది. హింసాకాండ జరుగుతుందని గతానుభవాలు ఉన్నా.. ఎందుకు నిర్లక్ష్యం వహించారని నిలదీసింది. పోలింగ్ రోజు పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, మాచర్లలో ప్రతిపక్షాల ఏజెంట్లపై దాడులు, ఇళ్లలోకి చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించడం.. నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థిపై దాడులకు దిగడం.. కత్తులు, కర్రలతో రోడ్లపై స్వైరవిహారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూముల వద్దే మారణాయుధాలతో దాడి చేయడాన్ని గట్టిగా నిలదీసింది.
హింస జరుగుతుందని ముందే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా అక్కగకు వెళ్లారని, పరిస్థితులు చూసి అప్రమత్తం చేసినా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను సీఈసీ సీరియ్‌సగా తీసుకున్న నేపథ్యంలో సీఎస్, డీజీపీ గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానంగా మూడు అంశాలపై వివరణ ఇవ్వనున్నారు. ఒకటి.. పోలింగ్ తర్వాత హింసను నియంత్రించడంలో వైఫల్యానికి కారణాలు. రెండోది.. హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోవడానికి బాధ్యులెవరు..? మూడోది.. నియంత్రణ చర్యలు తీసుకుని ఉంటే అవేంటో ఈసీకి సమర్పిస్తారు. దీనిపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, నిఘా చీఫ్ కుమార్ విశ్వజీత్ సమావేశమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే సమస్యాత్మక ప్రాంతాలపై నిఘాపెట్టి ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉండగా.. అలా జరగలేదని.. తాను బాధ్యతలు తీసుకున్న రెండ్రోజుల్లోనే కాకినాడ ప్రాంతంలోని బలగాలను ఇటు తెప్పించానని డీజీపీ వెల్లడించినట్లు తెలిసింది. గతంలో అల్లర్లు సృష్టించిన అభ్యర్థుల వెంట షాడో బృందాలు ఏర్పాటు చేయలేదని, వీటన్నిటిపై దృష్టిపెట్టేందుకు తగినంత సమయం తనకు లభించలేదని అన్నట్లు సమాచారం. ఎన్నికల కోసం రాష్ట్ర పోలీసు శాఖ కేంద్రాన్ని సరిపడా బలగాలను కోరలేదని.. ఉన్న బలగాలతోనే సరిపెడతామనే అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా హింసను అరికట్టలేకపోవడానికి ప్రధాన కారణంగా డీజీపీ పేర్కొన్నట్లు తెలిసింది. నిఘా విభాగం ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చిందని, చర్యలు తీసుకోవలసింది పోలీసు బాస్ మాత్రమేనని కుమార్ విశ్వజీత్ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రధానంగా నాలుగు ఘటనలపై నివేదిక సిద్ధం చేసుకుని ఈసీ ముందుకు వెళ్లాలని సీఎస్, డీజీపీ నిర్ణయించారు. కాగా.. అధికార పక్షానికి ఓట్లు కురిపించే పథకాలకు నిధులు విడుదల చేయించడానికి చూపిన శ్రద్ధ శాంతిభద్రతల సమీక్షలో సీఎస్ జవహర్‌రెడ్డి చూపలేదని ఈసీ దృఢంగా భావిస్తోందని.. ఇదంతా ఆయన వైఫల్యమేనని గుర్రుగా ఉన్నట్లు ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, మాచర్ల దాడుల్లో వైసీపీ గూండాలకు పోలీసులు సహకరించారన్న ఆరోపణలపై డీజీపీని ఈసీ సంజాయుషీ కోరింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని తిరుపతిలోని మహిళా యూనివర్సిటీ ఆవరణలో ఏకంగా చంపడానికి ప్రయత్నించడాన్ని తీవ్రం గా పరిగణించింది. తాడిపత్రిలో జిల్లా ఎస్పీ కారుపైనే దాడికి దిగడం ఈసీ సీరియస్ అవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.