AP News: ఈవీఎం ట్యాంపరింగ్ వందశాతం నిజం.. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు..
ABN , Publish Date - Oct 23 , 2024 | 01:31 PM
ఈవీఎంల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ వందశాతం జరుగుతుందన్నారు ఎలన్ మస్క్ వంటి టెక్ నిపుణులు సైతం ఈ విషయాన్ని అనేకసార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు అధికార పార్టీ చేసే ప్రయోగం..
విజయవాడ, అక్టోబర్ 23: ఈవీఎంల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ వందశాతం జరుగుతుందన్నారు ఎలన్ మస్క్ వంటి టెక్ నిపుణులు సైతం ఈ విషయాన్ని అనేకసార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు అధికార పార్టీ చేసే ప్రయోగం ఇదని వ్యాఖ్యానించారు. భాతదేశ ప్రజాస్వామ్యం నిలబడాలంటే బ్యాలెట్ పోలింగ్ విధానం కావాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనే బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందని గుర్తు చేశారాయన. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. మితిమీరిన విశ్వాసంతోనే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు.
ఇదే సమయంలో ఏపీలోని పరిస్థితులపైనా కీలక వ్యాఖ్యలు చేశారు చింతా మోహన్. తెలంగాణ సెక్రటేరియట్ రాజభోగంలా ఉంటే.. ఆంధ్రాలో ఐదు షెడ్‌లు వేసి సెక్రటేరియట్ అంటున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి.. ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారని విమర్శించారాయన. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ఏ ఒక్క పథకం అమలు చేయలేకపోయిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు తప్ప ఇప్పటి వరకు ఏమీ అమలు కాలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంశంపైనా చింత మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నలుగురు ముఖ్యమంత్రులతో పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. ప్రపంచంలో మూడు కంపెనీలు తప్ప.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎవరి వల్లా కాదన్నారు. 4,000 వేల మంది గిరిజనులను ఖాళీ చేయిస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంక తొలగదన్నారు. అమరావతి పూర్తి కాలేదు కానీ.. చెన్నై నుంచి రియల్టర్లు వచ్చి అమరావతిలో భూముల ధరలను పెంచేస్తున్నారని చింతా మోహన్ ఆరోపించారు. అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా 100 పైనే పడుతుందన్నారు.
అమరావతిలో డ్రోన్స్ ఎగువరేయడం ఏం లాభం కలిగిందని ప్రభుత్వాన్ని చింతా మోహన్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. తిరుపతి లడ్డూపై అవాస్తవాలను ప్రచారం చేసి చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు చంద్రబాబు నాంది పలుకుతున్నారని ఆరోపించారు. పేదలకు కావలసింది తక్కువ ధరలో నిత్యావసర సరుకులు, ఉపాధి కల్పన అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే సిద్ధాంతాలు కలిగిన పార్టీ అని అన్నారు. జగన్, షర్మిల మధ్య వ్యవహారం వ్యక్తిగతం అన్నారు. గత చంద్రబాబుకు ఇప్పటికీ బాబుకు చాలా తేడా ఉందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దల వద్ద సాగిల పడుతున్నారని విమర్శించారు.
Also Read:
ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్..
ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారంటే
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
For More Andhra Pradesh News and Telugu News..