AP NEWS: ఆ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసే దళారులపై చర్యలు: జే.నివాస్
ABN , Publish Date - Jan 12 , 2024 | 05:55 PM
వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం దళారులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని.. వారిని నమ్మెద్దని.. ఈ విషయంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జే.నివాస్ ( Niwas ) ప్రకటించారు.

విజయవాడ: వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం దళారులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని.. వారిని నమ్మెద్దని.. ఈ విషయంపై వస్తున్న వదంతులను కూడా నమ్మొద్దని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జే.నివాస్ ( Niwas ) ప్రకటించారు. శుక్రవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒప్పంద ఉద్యోగుల నుంచి దళారీలు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలాంటి వదంతులను ఒప్పంద ఉద్యోగులు నమ్మొద్దని, ఎవరికైనా లంచం ఇచ్చినా, తీసుకున్నా ఇరువురూ శిక్షార్హులే అవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 21వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. అనంతరం సంబంధిత ఒప్పంద సిబ్బందికి చెందిన వివరాలను ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా కొంతమంది దళారులు ఒప్పంద ఉద్యోగులను ప్రలోభ పరుస్తున్నారని వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సజావుగా, సక్రమంగా కొనసాగుతోందని జే.నివాస్ తెలిపారు.