Share News

AP Capital: రాజధాని నిర్మాణంపై చిగురిస్తున్న ఆశలు.. వేగం పుంజుకుంటున్న పనులు..

ABN , Publish Date - Aug 03 , 2024 | 02:30 PM

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తైనా.. ఇప్పటివరకు రాష్ట్రానికి సరైన రాజధాని లేదు. 2015 అక్టోబర్‌లో అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది పడింది.

AP Capital: రాజధాని నిర్మాణంపై చిగురిస్తున్న ఆశలు.. వేగం పుంజుకుంటున్న పనులు..
Amaravati Capital

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తైనా.. ఇప్పటివరకు రాష్ట్రానికి సరైన రాజధాని లేదు. 2015 అక్టోబర్‌లో అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది పడింది. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం, భవనాల నిర్మాణం చేపట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అభ్యంతరం చెప్పకపోవడంతో అమరావతి నిర్మాణం పనులు మరింత వేగం పుంజుకుంటాయని అంతా భావించారు. కానీ మూడు రాజధానుల పేరిట జగన్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఏపీకి నిర్ధిష్ట రాజధాని లేకుండా పోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో రాజధాని నిర్మాణంపై ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అమరావతి ప్రాంతంలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

Chandrababu: వినతులు ఎన్ని ఉన్నా.. పరిష్కారమే లక్ష్యం!


వేగంగా అడుగులు..

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఐదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్న రాజధాని అమరావతి నిర్మాణం పనుల్లో వేగం కనిపిస్తోంది. త్వరితగతిన ఏపీకి ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలన్న ఆంధ్రుల కళ సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం తొలి ప్రాధాన్యతగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా.. భవిష్యత్తులో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భవన నిర్మాణాల నాణ్యతను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా సచివాలయం హెచ్ఓడి టవర్ల ప్రాంతంలో రాఫ్ట్ ఫౌండేషన్‌ను, హైకోర్టు భవన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చే పనిని చెన్నై ఐఐటీ బృందానికి అప్పగించగా.. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించి నివేదిక ఇచ్చే పనిని హైదరాబాద్ ఐఐటి బృందానికి అప్పగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణాలు అన్నీ మధ్యలోనే నిలిచిపోయాయి. 2019లో అధికారం చేపట్టిన వైసీపీ మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేయడంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది.

Purandeswari: చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పని చేస్తోంది


చంద్రబాబుపై నమ్మకంతో..

అమరావతి రాజధాని నిర్మాణం కోసం అక్కడి రైతులు వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అయితే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని.. తమ ప్రాంతం ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతుందనే ఆశతో రైతులంతా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా భూములు అప్పగించారు. అన్నదాతల ఆశలు వమ్ము కాకుండా టీడీపీ ప్రభుత్వం అద్భుతమైన రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేసింది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆశలు అడియాశలయ్యాయి. కర్షకులను పట్టించుకోవడం మానేసింది. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేసింది. దీంతో రైతులంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రజల్లో ఆశలు చిగురించాయనే చర్చ నడుస్తోంది.


Minister RamPrasad Reddy: ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest News Telugu

Updated Date - Aug 03 , 2024 | 02:30 PM