Share News

High Court: రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:18 PM

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు.

High Court: రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

అమరావతి: అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (RaghuramaKrishnam Raju)పై థర్డ్ డిగ్రీ (Third Degree) ప్రయోగించిన కేసు (Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్‌ (Vijay Paul)కు హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును.. సీఐడీ కస్టడీలో విజయ్‌పాల్‌ చిత్రహింసలు పెట్టారు.

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు. విజయ్‌పాల్ తరఫున సుప్రీంకోర్టు కౌన్సిల్‌ సిద్ధార్థ లూథ్రా, పీపీ లక్ష్మీనారాయణ,.. రఘురామ కృష్ణంరాజు తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. న్యాయస్థానం విజయపాల్‌కు బెయిల్ నిరాకరించడంతో మిగతా అధికారుల్లో వణుకు మొదలైంది.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. విజయ్‌పాల్‌ తన ఆరోగ్యం బాగోలేదని ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారని.. ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించడం శుభపరిణామమని అన్నారు. తనను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడానికి అనువైన వాతావరణాన్ని విజయ్‌పాల్‌ సృష్టించారని అన్నారు. ఇలాంటి పనికిమాలిన పనులన్నీ విజయ్‌పాల్‌ చేశారని మండిపడ్డారు. త్వరలో రిటైర్డ్‌ ఎస్పీ మహిపాల్‌ అరెస్ట్‌ అవుతారని, అలాగే సునీల్‌కుమార్‌ కూడా అరెస్ట్‌ అవుతారని.. విచారణ వేగవంతమవుతుందనే ఆశాభావంలో ఉన్నానని రఘురామకృష్ణంరాజు ఏబీఎన్‌తో పేర్కొన్నారు.


కాగా నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కేసులో ఎట్టకేలకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయనపై హత్యాయత్నం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారులు, సిబ్బందిని త్వరలోనే అరెస్టు చేయనున్నారు. అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డిపై రఘురామరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో ఆయనపై దేశద్రోహం కింద కేసు నమోదుచేసిన సీఐడీ అధికారులు.. ఆ ఏడాది మే 14న జన్మదినం రోజున ఆయన్ను హైదరాబాద్‌ నుంచి బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు సేషన్లో కేసు నమోదైంది.

నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌(ఏ-1), అప్పటి నిఘా విభాగం అధిపతి పీఎస్ఆర్‌ ఆంజనేయులు (ఏ-2), మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (ఏ-3), సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌(ఏ-4), అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి (ఏ-5)తదితరులపై ఐపీసీ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 506(34) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే రోజులు గడుస్తున్నా కేసులో ఎటువంటి పురోగతీ లేదంటూ రఘురామరాజు పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్‌ను కలిసి దర్యాప్తు వేగవంతం చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రోత పత్రికలో అవే కట్టు కథలు..

జగన్ హయాంలో.. పేదల భూములతో బంతాట

తిరుమలకు కాలినడకన పవన్ కళ్యాణ్..

మేడిగడ్డ ఇంజనీర్ల పై క్రిమినల్ చర్యలు..

కేడర్‌కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 24 , 2024 | 12:18 PM