YS Jagan: చంద్రబాబు హామీలను అమలు చేయాలి
ABN , Publish Date - Aug 06 , 2024 | 07:17 PM
రాష్ట్రంలో వ్యవసాయం దుర్భర స్థితిలో ఉందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పిన హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వలేదన్నారు. రైతులు, బడులకు పొయే పిల్లలను మోసం చేశారని జగన్ ధ్వజమెత్తారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దాడులు ప్రోత్సహించడం ఆపి గవర్నెన్స్ మీద ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) దృష్టి సారించాలని మాజీ ముుఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదని ప్రశ్నించారు. గవర్నర్ జోక్యం చేసుకొని దాడులను అరికట్టాలని కోరారు.
ఈ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత
‘‘రాష్ట్రంలో వ్యవసాయం దుర్భర స్థితిలో ఉంది. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వలేదు. రైతులు, బడులకు పొయే పిల్లలని మోసం చేశాడు. ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకుంటున్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఫీజులు కట్టలేని పరిస్థితిని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం’’ అని జగన్ తెలిపారు.
సుప్రీం కోర్టుకు వెళ్తా..
‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. రౌడీయిజం పెరిగి పోయింది. దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రం, దేశం దృష్టికి దాడుల అంశాన్ని తీసుకువెళ్తాను. ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టు తలుపు తడతా. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అన్ని పక్షాల దృష్టికి తీసుకువెళ్తా’’ అని జగన్ వార్నింగ్ ఇచ్చారు.