Share News

అవినీతి దందాకు ఆయనే దాదా

ABN , Publish Date - Sep 15 , 2024 | 05:47 AM

గత జగన్‌ ప్రభుత్వంలో 2021-23(మే) వరకు, 2023 నవంబరు11 నుంచి కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చేవరకు ఇసుక విక్రయాలు జరిగాయి.

అవినీతి దందాకు ఆయనే దాదా

అనంతంగా సాగిన గనుల వెంకటరెడ్డి అక్రమాలు

‘ఆంధ్రజ్యోతి’

వార్తలు అక్షరసత్యాలని తేలిన వైనం

ఆ శాఖను సొంత రాజ్యంగా మలుచుకున్నారు

ఖజానాకు టోకరా ఇచ్చి కంపెనీలకు మేలు

ప్రైవేటు సంస్థ ప్రతినిధి అన్నట్టు ప్రవర్తన

ఇసుక కాంట్రాక్టులో 2,566.82 కోట్ల అవినీతి

ఏసీబీ విచారణలో సంచలన విషయాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి గనుల గుట్టు బయటపడింది. ఇసుక అమ్మకాల కాంట్రాక్టు పేరిట వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రయోజనాల పరిరక్షణ కన్నా ప్రైవే టు కంపెనీలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేశారు. ప్రైవేటు కంపెనీలతో కలిసి నేరపూరిత కుట్రలుచేసి ప్రభుత్వ ధనాన్ని కంపెనీలకు దోచిపెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ సొమ్మును కంపెనీలకు వెళ్లిపోయేలా కుయుక్తులు పన్నారు....ఇవన్నీ ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిన మాటలు కావు. గనుల వెంకరెడ్డి ఇసుక లీలలపై విచారణ జరిపిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తన నివేదికలో పొందుపరిచిన వాస్తవాలివి. గతంలో వెంకటరెడ్డి హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, అరాచకాలపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస వార్తలు ప్రచురించింది.


‘ఆంధ్రజ్యోతి’కి జగన్‌ సర్కారు అంటే గిట్టక తప్పుడు వార్తలు రాస్తోందని వెంకటరెడ్డి సహా జగన్‌ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఖండించారు. కానీ నాడు, నేడు ‘ఆంధ్రజ్యోతి’ రాసిన వార్తలే అక్షరసత్యాలని ఏసీబీ విచారణలో తేలిపోయింది. ఒకటా, రెండా....వెంకటరెడ్డి చేసిన అరాచకాలు, అక్రమాలకు అంతే లేదని ఏసీబీ నివేదిక చెబుతోంది. వెంకటరెడ్డి ఓ ప్రభుత్వ అధికారిని అన్న సంగతి మరచి ప్రైవేటు కంపెనీల ప్రతినిధిగా, వాటి కొమ్ముకాస్తూ పనిచేశారని ఏసీబీ అక్షరాలా నిగ్గుతేల్చింది. మూడున్నరేళ్ల ఇసుక కాంట్రాక్టులో 2,566.82 కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయని వెల్లడించిన ఏసీబీ, ఇందులో తొలి నిందితుడు వెంకటరెడ్డియేనని ప్రకటించింది. ఇసుక అక్రమాలపై జరిపిన విచారణ నివేదికను ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలోని అంశాలు వెంకటరెడ్డి మూడో కంటికి తెలియకుండా చేసిన ఘనకార్యాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. అందులోని కీలకాంశాలు..


ఇసుక దోపిడికి రాచబాటలు..

గత జగన్‌ ప్రభుత్వంలో 2021-23(మే) వరకు, 2023 నవంబరు11 నుంచి కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చేవరకు ఇసుక విక్రయాలు జరిగాయి. తొలుత జేపీ వెంచర్స్‌కు కాంట్రాక్ట ఇచ్చారు. ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి నెల 1, 16 తేదీల్లో బిడ్‌ విలువ చెల్లించాలి. అలాగే, 1,528 కోట్ల కాంట్రాక్టు విలువపై 15 శాతం జీఎస్టీ, ఇసుక అమ్మకంపై వచ్చే 5 శాతం జీఎస్టీ సర్కారుకు చెల్లించాల్సి ఉంది. ఇసుక కాంట్రాక్టుకు సంబంధించి జేపీ వెంచర్స్‌ 120 కోట్ల ఫెర్ఫార్మెన్స్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంది. అయితే, జేపీ వెంచర్స్‌ ఈ ఒప్పందంలోని అంశాలేవీ పాటించలేదు. బిల్లులు చెల్లించలేదు. అయినా వెంకటరెడ్డి ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా, అనేక రకాల ఉల్లంఘనలకు కంపెనీ పాల్పడినా నోరుమెదపలేదు. గనుల శాఖతో కుదిరిన ఒప్పందాన్ని జేపీ వెంచర్స్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలి. అదీ జరగలేదు.


ఒప్పందం ప్రకారం సబ్‌కాంట్రాక్ట్‌ ఇవ్వడానికి వీల్లేదు. కానీ జేపీ సంస్థ... టర్న్‌కీ అనే కంపెనీకి సబ్‌కాంట్రాక్ట్‌ ఇచ్చింది. ఈ కంపెనీనే 120 కోట్ల ఫెర్ఫార్మెన్స్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ ప్రభుత్వానికి చెల్లించింది. జేపీ సంస్థ 30.58 కోట్ల స్టాంప్‌డ్యూటీ చెల్లించలేదు. అయినా వెంకటరెడ్డి దానిపై ఏ చర్యలూ తీసుకోలేదు. ఇసుక అమ్మకాలకు సంబంధించి ఒప్పందం ప్రకారం ఆన్‌లైన్‌ పర్మిట్లు,ఆన్‌లైన్‌ లావాదేవీలు జరగాలి. కానీ జేపీ సంస్థ మాన్యువల్‌ లావాదేవీలు అంటే క్యాష్‌ అండ్‌క్యారీ నడిపింది. ఇది తీవ్రమైన ఉల్లంఘన. జేపీ సంస్థ ఇసుక మైనింగ్‌ చేసేందుకు ఏపీఎండీసీ నిధులను ఉపయోగించి అనేకరకాల అనుమతులు, లీజు పర్మిట్లు తీసుకున్నారు. అందుకు అవసరమైన ఫీజులను జేపీ వెంచర్స్‌ నుంచి వెంకటరెడ్డి రాబట్టలేకపోయారు. ఇది ఆ సంస్థకు వెంకటరెడ్డి చేసిన ఆర్ధిక మేలు. బిడ్‌ విలువ 1528 కోట్లపై జీఎస్టీ రూ.233 కోట్లు జేపీ సంస్థ చెల్లించలేదు. దీని వసూలుకు వెంకటరెడ్డి ఏ చర్య తీసుకోలేదు. దీని వల్ల ప్రభుత్వం నష్టపోయింది.


పైసా కట్టని కంపెనీకి ఎదురు కట్నాలు..

జేపీ గ్రూప్‌నకు ఇసుక టెండర్‌ ఇచ్చేనాటికి ఏపీఎండీసీ నియంత్రణలో 130.73 కోట్ల విలువైన 14.3 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉంది. దాన్ని కూడా జేపీ వెంచర్స్‌కే అప్పగించారు. దాన్ని ఆ సంస్థ అమ్మేసుకుంది. కానీ రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఉన్న 8.26 లక్షల టన్నుల ఇసుకను జేపీ వెంచర్స్‌ అమ్ముకుంది. దీనిపై 39 కోట్లు ఎండీసీకి చెల్లించనేలేదు. ఈ డబ్బును రాబట్టేందుకు వెంకటరెడ్డి చర్యలు తీసుకోలేదు. ఏపీఎండీసీ ఇసుక అమ్మకాలు చేపట్టినప్పుడు పెద్దఎత్తున వెయింగ్‌ బ్రిడ్జిలు, సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది. జేపీకి టెండర్‌ ఇచ్చినప్పుడు ఆ టెక్నాలజీని అప్పగించింది. కానీ ఆ సంస్థ ఏ ఒక్కదాన్ని వెనక్కి ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం 27.35 కోట్లు నష్టపోయింది. రెండున్నర సంవత్సరాల వ్యవధిలో జేపీ వెంచర్స్‌ సరిగ్గా వాయిదాలు చెల్లించకపోయినా ఏ నాడు పెనాల్టీ విధించలేదు. జేపీ వెంచర్స్‌ ప్రభుత్వానికి భారీగా బకాయిలు చెల్లించాలి.


అయినా, ప్రభుత్వానికి తెలియకుండా, ఎలాంటి ఫైలు నడపకుండానే 120 కోట్ల ఫెర్ఫార్మెన్స్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ను గత మార్చి 28న విడుదల చేయించారు. ఆ సంస్థ తమకు బకాయి లేదని నేరుగా బ్యాంకుకు మెయిల్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ వచ్చాక ఈ సొమ్మును విడుదల చేశారు. జేపీ వెంచర్స్‌ కాంట్రాక్టు గడువు 2023, మే నెలతో ముగిసిపోయింది. అయినా ఆ సంస్థకు ఆ ఏడాది నవంబరు నెలవరకు కొనసాగింపు ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో గనుల శాఖ అధికారులు ఇసుక రీచ్‌లను తనిఖీ చేయగా జేపీ వెంచర్స్‌ అక్రమ తవ్వకాలు చేసినట్లు తేలింది. రీచ్‌ల పరిధి దాటి తవ్వారు. ఒప్పందానికి విరుద్ధంగా, పర్యావరణాన్ని దెబ్బతీసేలా భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు జరిపారు. ఫలితంగా ఆ సంస్థకు 896.47 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ నోటీసులు ఇచ్చారు. జేపీ సంస్థ నుంచి వెంకటరెడ్డి ఆ డబ్బు వసూలు చేయలేకపోయారు.


వెంకటరెడ్డి సర్వంతర్యామి..

ఇసుకలో మూడున్నరేళ్లపాటు నిర్విరామంగా అక్రమాలు సాగడంలో గనుల వెంకటరెడ్డి పాత్రే కీలకమని ఏసీబీ తేల్చింది. ఇన్ని అక్రమాలు, అవినీతి కుట్రలకు ఆయనే ప్రధాన నిందితుడని పేర్కొంది. అనుమానితుల జాబితాలో జేపీ వెంచర్స్‌ కంపెనీ ప్రతినిధి అనిల్‌ ఆత్మారామ్‌ కామత్‌, ప్రతిమ ఇన్‌ఫ్రా ప్రతినిధి పి. అనిల్‌కుమార్‌, జీసీకేసీ ప్రతినిధి ఆర్‌. వెంకటకృష్ణారెడ్డితోపాటు జేపీ వెంచర్స్‌, ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీలను చేర్చింది.


Also Read:

శోభాయాత్రకు రెడీ.. రూట్ మ్యాప్ ఇదే..

సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ..

ధోనీని చూసి ఎవడ్రా బాబూ అనుకున్నా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 15 , 2024 | 09:29 AM