Share News

Rain Alert: రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రజలకు కీలక అలర్ట్

ABN , Publish Date - Sep 01 , 2024 | 03:58 PM

ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మెరుపు వరదలు జనాలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు చేపడుతోంది.

Rain Alert: రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రజలకు కీలక అలర్ట్
Heavy Rains in AndhraPradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. మెరుపు వరదలు జనాలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విపత్తు నిర్వహణ కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అయితే ఏపీకి వర్షాల ముప్పు తప్పిపోలేదు.


మరో రెండు రోజులు భారీ వర్షాలు..

ఆంధప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరకొస్తా, దక్షిణ ఒరిస్సా ఛత్తీస్‌ఘడ్ ప్రాంతాలను ఆనుకోని కొనసాగుతోందని చెప్పారు. ‘‘ఇది క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఒడిశా మల్కన్‌గిరికి ఈశాన్యంగా 70 కిలోమీటర్లు, విశాఖకు 150 కిలోమీటర్లు, కళింగపట్నంకు190 కిలోమీటర్లు, రామగుండంకు 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది’’ అని వివరించారు.


వాయుగుండం ప్రభావంతో మరో 24 గంటలపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఏలూరు, కృష్ణ, బాపట్ల జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అత్యధికంగా 65 కిలోమీటర్లు గాలులు వీచే అవకాశం ఉందని అధికారి శ్రీనివాస్ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచింది.


మరోవైపు గడచిన 24 గంటల్లో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అమరావతిలో అత్యధికంగా 26 సెంటిమీటర్లు, తిరువూరులో 26 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక గుంటూరు 23 సెంటిమీటర్లు, ఎలూరు జిల్లాలోని కుక్కునూరులో 20 సెంటిమీటర్లు, అచ్చంపేటలో 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయిందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.

Updated Date - Sep 01 , 2024 | 04:00 PM