Home Minister Anita : బలవంతంగా రూ.2.2 కోట్లు వసూలు
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:17 AM
మాజీ మంత్రి విడదల రజని... బెదిరించి, భయపెట్టి కోట్లు వసూలు చేశారంటూ హోం మంత్రి అనితకు ఫిర్యాదు అందింది. పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈమేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
రజనిపై ‘బాలాజీ క్రషర్స్’ ఫిర్యాదు
ఆమె పీఏ 5 కోట్లు డిమాండ్ చేశారు మావల్ల కాదన్నందుకు విజిలెన్స్ ఎస్పీ
జాషువా వచ్చారు.. 50 కోట్లు ఫైన్ అన్నారు
తర్వాత ఫోన్ చేసి ఎమ్మెల్యేని కలవమన్నారు
రజని మరిది 2.20 కోట్లు వసూలు చేశారు
వారి నుంచి మాకు రక్షణ కల్పించండి
మా సొమ్ములు మాకు ఇప్పించండి
హోం మంత్రికి లిఖితపూర్వక ఫిర్యాదు
విచారణకు ఆదేశించిన అనిత!
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి విడదల రజని... బెదిరించి, భయపెట్టి కోట్లు వసూలు చేశారంటూ హోం మంత్రి అనితకు ఫిర్యాదు అందింది. పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈమేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దానిని వారి న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హోం మంత్రికి అందచేశారు. ఆ ఫిర్యాదులో తమ ప్రాణాలకు హాని ఉందని, రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన హోం మంత్రి అనిత... విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు... చలపతిరావు, మరో ముగ్గురు భాగస్వాములతో కలసి 2010 నుంచి యడ్లపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యాపార సంస్థను నడుపుతున్నారు.
2020 సెప్టెంబరు 9న నాటి ఎమ్మెల్యే విడదల రజని పీఏ దొడ్డా రామకృష్ణ క్రషర్ వద్దకు వచ్చి ఎమ్మెల్యేని కలవమని చెప్పారు. ఆమేరకు వారు రజనిని ఆమె కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కలవలేదని అంటూనే... వ్యాపారం చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాలని ఆమె చెప్పారు. ‘పీఏని కలిసి ఆయన చెప్పిన విధంగా చేయండి’ అని చెప్పి పంపేశారు. వారు పీఏ రామకృష్ణను కలిశారు. ఆయన రూ.5 కోట్లు చెల్లించమని చెప్పారు. అంత చెల్లించలేమని చెప్పిన క్రషర్ యాజమాన్యాన్ని ఆయన బెదింరించారు. ‘వ్యాపారం ఎలా చేస్తారో చూస్తాం... మీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించారు. సెప్టెంబరు 11న విజిలెన్స్ ఎస్పీ జాషువా సిబ్బందితో సహా క్రషర్‌కు వచ్చారు. తనిఖీల పేరుతో హడావిడి చేశారు. అవకతవకలు జరిగాయని, రూ.50 కోట్లు పెనాల్టీ చెల్లించాలని, సీజ్ చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో క్రషర్ యాజమాన్యం విడదల రజని, పీఏని మళ్లీ కలిసింది.
ఆయన రూ.5 కోట్లు చెల్లించి సెటిల్ చేసుకోవాలని సూచించారు. అంత ఇవ్వలేమని చెప్పిన యాజమాన్యం... సంస్థలో వాటా ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే దానికి అంగీకరించని పీఏ... సొమ్ములే చెల్లించాలంటూ బలవంతం చేశారు. క్రషర్ భాగస్వాములు గడువు కోరి, వచ్చేశారు. విజిలెన్స్ ఎస్పీ జాషువా మళ్లీ 2021, మార్చి నెలలో క్రషర్ యజమానులను పిలిపించారు. రజని మరిది గోపీతో సెటిల్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే రూ.50 కోట్లు ఫైన్ వేసి, కేసు ఫైల్ చేయక తప్పదని బెదిరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు విడదల రజని మరిది గోపీని కలిశారు. రజనికి రూ.2 కోట్లు, ఎస్పీ జాషువాకు రూ.10 లక్షలు, తనకు రూ.10 లక్షలు చెల్లించాలని, లేకుంటే కేసు తప్పదని గోపీ తేల్చి చెప్పారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చలపతిరావు, భాగస్వాములు పైకాన్ని సమకూర్చుకున్నారు.
2021, ఏప్రిల్ 4న చిలకలూరిపేట టౌను, పురుషోత్తపట్నంలోని విడదల గోపి నివాసంలో ఆ మొత్తాన్ని ఆయనకు అందజేసినట్లు చలపతిరావు తన ఫిర్యాదులో వివరించారు. ఈ విషయం బయటకు పొక్కినా, ఫిర్యాదు చేసినా వ్యాపారం చేయలేరని, ప్రాణాలతో ఉండరని బెదిరించడంతో ఎవరికీ చెప్పకుండా మిన్నకుండిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విడదల రజని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ, నాటి విజిలెన్స్ ఎస్పీ జాషువా నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో వేడుకున్నారు. బెదరించి, భయపెట్టి వసూలు చేసిన సొమ్ములు వెనక్కి ఇప్పించాలని నల్లపనేని చలపతిరావు విజ్ఞప్తి చేశారు.