Share News

Jagan's Land Scam : పట్టాలున్నా...పత్తాలేరు!

ABN , Publish Date - Dec 04 , 2024 | 03:03 AM

ఇళ్ల స్థలాల పేరుతో జగన్‌ జమానాలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు! అక్కరకు రాని భూములను అడ్డగోలు ధరలకు కొనుగోలు చేసి... పార్టీ నేతలకు కోట్లు దోచి పెట్టారు. ఎకరం పది లక్షలు కూడా పలకని భూములను ఐదారు కోట్లకు కొన్నారు. ఇదో భారీ కుంభకోణం!

Jagan's Land Scam : పట్టాలున్నా...పత్తాలేరు!

  • ఇళ్ల పట్టాల పథకంలో ‘జగన్మాయ’

  • 28 లక్షల మందికి స్థలాలిచ్చినట్లు గొప్పలు

  • ఇప్పటికీ డీడ్‌లు తీసుకోని 9.2 లక్షల మంది

  • వారంతా బినామీలు, వైసీపీ కార్యకర్తలేనా?

  • గుట్టు రట్టవుతుందనే గప్‌చుప్‌ అయ్యారా?

  • అనర్హుల ఎంపికపై భారీగా ఫిర్యాదులు

  • 6.5 లక్షల మంది ఇతర పథకాల లబ్ధిదారులు

  • వారినీ తమ ఖాతాల్లోనే కలుపుకొన్న జగన్‌

  • సీఎంకు రెవెన్యూ మంత్రి నివేదిక

  • సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం

ఇళ్ల పట్టాలు రెడీ! లబ్ధిదారులూ ఉన్నారు! కానీ... వచ్చి పట్టాలు తీసుకొమ్మంటే రావడమే లేదు! ఒకటీ రెండూ కాదు... ఏకంగా 9.2 లక్షల పట్టాలు అలా పక్కన పడి ఉన్నాయి! ఆ లబ్ధిదారులు లేరా? ఉంటే ఎందుకు పట్టాలు తీసుకోవడంలేదు? లేక... వారంతా బినామీలు, అర్హతలేని వైసీపీ కార్యకర్తలా? అసలైన లబ్ధిదారులైతే పట్టాలు ఎందుకు తీసుకోరు? ఇవీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ళ్ల స్థలాల పేరుతో జగన్‌ జమానాలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు! అక్కరకు రాని భూములను అడ్డగోలు ధరలకు కొనుగోలు చేసి... పార్టీ నేతలకు కోట్లు దోచి పెట్టారు. ఎకరం పది లక్షలు కూడా పలకని భూములను ఐదారు కోట్లకు కొన్నారు. ఇదో భారీ కుంభకోణం! ఇప్పుడు ఇందులో మరో కోణం బయటికి వచ్చింది. వైసీపీ కార్యకర్తలు, నేతల బినామీల పేరుతో భారీగా ఇళ్ల పట్టాలు కేటాయించినట్లు తెలుస్తోంది. మళ్లీ జగనే వచ్చి ఉంటే... వారంతా దర్జాగా పట్టాలు తీసుకుని ఉండేవారు. కానీ... సర్కారు మారడంతో గప్‌చు్‌పగా ఉండిపోయారు. 28 లక్షల మంది పేదలకు పట్టాలు (కన్వేయెన్స్‌ డీడ్స్‌) ఇచ్చామని నాటి ప్రభుత్వం చాలా ఘనంగా చెప్పింది. వాటికి సంబంధించిన బిల్లులు కూడా సెటిల్‌ చేసింది.


కానీ... ఈ నాటి వరకు 9.2 లక్షల మంది ప్రభుత్వం వద్దకు వచ్చి తమకు కేటాయించిన కన్వేయెన్స్‌ డీడ్‌లు తీసుకోలేదు. కూటమి సర్కారు వచ్చి ఆరు నెలలు కావొస్తోంది. అయినా... అన్ని లక్షల మంది తమ పట్టాలు ఎందుకు తీసుకోవడంలేదన్నదే ప్రశ్న! దీంతో... జిల్లాల వారీగా ‘లబ్ధిదారుల’ జాబితాలనుప్రాథమికంగా పరిశీలించారు. అందులో ఎక్కువ మంది వైసీపీ నేతల అనుచరులు, వారి సొంత మనుషులే ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు వారు పట్టాలు పుచ్చుకుంటే గుట్టు రట్టవుతుందని, అల్లరైపోతామనే మౌనంగా ఉన్నట్లు భావిస్తున్నారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారు.

  • మిగిలినవైనా పద్ధతిగా చేశారా?

‘ఇళ్లు కాదు... ఊళ్లు కట్టాం. 28 లక్షల పట్టాలు ఇచ్చాం’ అని జగన్‌ గొప్పగా చెప్పుకొన్నారు. ఇందులో 9.2 లక్షల మంది ‘లబ్ధిదారుల’ ఆచూకీ గల్లంతైనట్లు తేలింది. మరి... మిగిలిన 18.8 లక్షల పట్టాలైనా జగన్‌ ప్రభుత్వం ఇచ్చిందా అంటే అదీ లేదు. అందులో 6.5 లక్షల మంది టిడ్కో, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్‌ల పరిధిలోని లబ్ధిదారులని స్పష్టమైంది. వీరిని కూడా జగన్‌ ‘నవరత్నాల’లో కలిపేశారు. పట్టా తీసుకోకుండా పత్తాలేకుండా పోయిన 9.2 లక్షల మంది... ఇతర పథకాల ద్వారా ఎంపిక చేసిన 6.5 లక్షలమందిని తీసేస్తే... అచ్చంగా జగన్‌ ఇంటిపట్టాలు ఇచ్చింది 12 లక్షల మందికే. వీరిలో ఎంతమంది అనర్హులున్నారు, ఎందరికి నివాస యోగ్యమైన స్థలాలు దక్కాయన్నది మరో పెద్ద ప్రశ్న! ఎందుకంటే... చెరువులు, ఆవ భూములు, కొండల్లోనూ సెంటు స్థలాలు ఇచ్చేశారు!


  • భారీగా ఫిర్యాదులు...

జగనన్న కాలనీల పేరిట... అక్కరకు రాని భూములకూ అడ్డగోలుగా చెల్లింపులు చేసిన వైనంపైనా సీఐడీ దృష్టిసారించింది. 2019-2024 కాలంలో జగన్‌ సర్కారు పేదలకోసం 32 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకోసం 24వేల కోట్ల రూపాయల వ్యయం చేసింది. ఇంత ఖర్చుపెట్టి పేదలకు సగటున సెంటు స్థలమే ఇంటికోసం ఇచ్చింది. అందులోనూ అనర్హులు, వైసీపీ నేతలు, బినామీలకు భారీగా పట్టాలు ఇచ్చేశారనే అనుమానాలను బలపరిచేలా... పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. కూటమి సర్కారుకు ఇప్పటిదాకా 8700 ఫిర్యాదులు అందాయి. అందులో వైసీపీ నేతలు, వారి బినామీలకే జగనన్న కాలనీల్లో అసైన్డ్‌ ఇంటి స్థలాలు ఇచ్చారని 4200 ఫిర్యాదులున్నాయి. విశాఖ, విజయనగరం, కృష్ణా, గుంటూరు, కడప, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల నుంచే ఈ ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. వీటిపై రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయిలో ఆరాతీయగా అనర్హులకు పట్టాలు ఇచ్చారని గుర్తించింది. అంతకుముందే పేదింటి స్ధలాలు పొందిన వారు, అధిక ఆదాయం ఉన్నవారికి పట్టాలు ఇచ్చినట్లు ప్రాథమికంగా తే ల్చారు. ఈ మొత్తం వ్యవహారంపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో భారీగా గోల్‌మాల్‌ జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. విచారణ బాధ్యతను సీఐడీకి అప్పగిస్తారా లేక విజిలెన్స్‌ విభాగంతో చేయిస్తారా అనే అంశంపై రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


  • 3 మండలాల్లో సీఐడీ సోదాలు

జగనన్న ఇంటిస్థలాల పేరిట భారీగా భూములు కొన్న మండలాలపై సీఐడీ దృష్టిసారించినట్లు తెలిసింది. అనకాపల్లి, సబ్బవరం, పరవాడ మండలాల్లోని రెవెన్యూ ఆఫీసుల్లో మంగళవారం సీఐడీ అధికారుల బృందాలు సోదాలు జరిపినట్లు సమాచారం. డీఎస్పీ నాగేంద్ర భూపాల్‌ నేతృత్వంలో రెవెన్యూ ఆఫీసుల్లో రికార్డుల పరిశీలన జరిగినట్లు తెలిసింది.

Updated Date - Dec 04 , 2024 | 03:04 AM