Share News

Human Rights Violations : వివాదాల జైళ్లు

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:43 AM

క్షణికావేశంలోనో, తెలిసీ తెలియకో తప్పులు చేసి జైలుపాలైన ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాలు వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి.

Human Rights Violations : వివాదాల జైళ్లు
Jail

  • ఖైదీలకు లాఠీ దెబ్బలు.. సిబ్బందికి వేధింపులు

  • శాఖలో అవినీతి‘కిరణం’పై తీవ్ర ఆరోపణలు

  • రాజమండ్రి జైలులో ఖైదీ పట్ల రాక్షసత్వం

  • విశాఖ జైలులో ఇద్దరు వార్డర్ల దుస్తులు విప్పించి ఖైదీల ముందే అవమానించిన ఓ అధికారి

  • సిబ్బంది ఆందోళన.. మద్దతుగా కుటుంబ సభ్యులు

  • ఆదివారం 66 మంది వార్డర్లకు అటాచ్‌మెంట్లు

  • రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో సిబ్బంది నిరసనలు

  • సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు మీనమేషాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

క్షణికావేశంలోనో, తెలిసీ తెలియకో తప్పులు చేసి జైలుపాలైన ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాలు వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన అధికారుల్లో కొందరు వారికి చిత్రహింసలు పెడుతూ జీవితంపైనే విరక్తి కలిగేలా చేస్తున్నారు. జైళ్లలో కొందరు అధికారుల పైశాచికత్వం ఇలా ఉండగా... ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల గ్రూపు తగాదాలు, భారీగా సిబ్బంది కొరతతో పాటు పూర్తిస్థాయి డీజీ లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో జైళ్ల బాగోగుల గురించి హోంశాఖ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా విశాఖపట్నం, విజయవాడ, కడప, రాజమహేంద్రవరం జైళ్లలో జరిగిన ఘటనలు ఆ శాఖ పనితీరుపై చర్చకు దారితీశాయి. గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఓ అధికారిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఓ అధికారి మామూళ్ల దాహానికి తాము బలయ్యామని విశాఖ సెంట్రల్‌ జైలులో వార్డర్లు గగ్గోలు పెడుతున్నారు. తమ వాళ్లు ఏ తప్పు చేశారని ఇంతలా వేధిస్తున్నారంటూ వార్డర్ల కుటుంబాల్లోని మహిళలు, పిల్లలు రాత్రి పొద్దు పోయేదాకా ధర్నాకు దిగడం జైళ్ల శాఖ గుట్టు రోడ్డున పడేసింది. ఈ తప్పును సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు ఆదివారం ఇచ్చిన అటాచ్‌మెంట్‌ ఆదేశాలు ఒక్కసారిగా రాష్ట్రంలోని జైళ్లలో సిబ్బంది నిరసన జ్వాలలకు కారణమయ్యాయి.


  • మామూళ్లు ఇవ్వలేదని...

రాష్ట్రంలో నాలుగు సెంట్రల్‌ జైళ్లు, 8 జిల్లా జైళ్లు, ఇతర సబ్‌ జైళ్లు కలిపి మొత్తం 129కి గానూ 79 జైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో 8 వేలమంది వరకూ రిమాండ్‌, శిక్షపడ్డ ఖైదీలు ఉన్నారు. వివిధ నేరాల్లో శిక్షలు పడిన ఖైదీలను సంస్కరించి సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేలా చేయడమే జైళ్ల శాఖ పని. రాష్ట్రంలోని పెద్ద జైళ్లలో ఒకటైన విశాఖ సెంట్రల్‌ జైలులో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారు. అక్కడి ఖైదీల పొట్టకొట్టి జైలు నిర్వహణలో భారీగా డబ్బులు మిగిలించి, ప్రతి నెలా మామూళ్ల కోసం ఇండెంట్‌ పెట్టిన ఓ ఉన్నతాధికారి అంచనాలను అందుకోలేకపోయిన అధికారిపై అభియోగాలు సృష్టించి తప్పించారు. జైళ్ల శాఖలో జూనియర్‌ అయిన ఒక అధికారిని తెచ్చి అక్కడ నియమించారు. అనంతపురం, కడప, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖలో సీనియర్‌ అడిషనల్‌ ఎస్పీలుండగా జూనియర్‌ను తీసుకురావడం వెనుక ఉద్దేశం ఇదేనని జైళ్ల శాఖలో చర్చ జరుగుతోంది.

  • ఇంట్లో సరిగా పనిచేయలేదని..

ఖైదీలను అత్యంత దారుణంగా హింసించి జీవితాంతం జీవచ్ఛవాలుగా మార్చే అలవాటున్న ఒక అధికారి ఇటీవల రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఓ ఖైదీ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఓపెన్‌ ఎయిర్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీని సార్‌ తన ఇంట్లో పనికి వాడుకొంటున్నారు. ఆ ఖైదీ పనులు సరిగా చేయడం లేదంటూ లాఠీ తీసుకుని చితకబాదారు. గతంలో నెల్లూరు జైలు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సమయంలో తన ఇంట్లో పనిచేస్తున్న ఒక ఖైదీ సరిగా చేయడం లేదంటూ చిత్రహింసలు పెట్టారు. లాక్‌పలోకి లాక్కొచ్చి దుస్తులు విప్పేసి మల ద్వారంలోకి కర్ర చొప్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి. రాయలసీమకు చెందిన ఈ అధికారి వైసీపీ ప్రభుత్వంలో ఒక మంత్రికి సమీప బంధువు. అప్పట్లో వివేకా హత్యకేసు నిందితులు కడప జైలులో ఉండటంతో వైసీపీ ప్రభుత్వం ఆయన్ను వాడుకుంది. నిందితులను తెలంగాణ జైలుకు తరలించాక ఎన్నికల ముందు రాజమండ్రికి బదిలీ చేసింది. ఆ వార్త తెలిసిన వెంటనే సిబ్బంది యూనిఫామ్‌తోనే కడప జైలు ముందు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుని, స్వీట్లు తినిపించుకున్నారు.


  • విశాఖ జైలులోకి గంజాయి, సెల్‌ఫోన్లు

విశాఖ సెంట్రల్‌ జైలులో 900 మంది ఖైదీలకు మాత్రమే చోటుంది. అయితే అధికారులు 55 శాతం అదనంగా కుక్కేశారు. అక్కడ రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఖైదీలు (2వేలు) ఉన్నారు. ఇతర జైళ్లకు పంపేందుకు కనీస ప్రయత్నాలు చేయట్లేదు. కేంద్ర కారాగారంలోకి సిబ్బంది టిఫిన్‌ క్యారియర్లలో గంజాయి తీసుకెళుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు బ్యారక్‌లలోకి అనధికారికంగా సెల్‌ఫోన్లు చేరుతున్నాయని గుర్తించారు. జైలు సూపరింటెండెంట్‌తో పాటు మరో అధికారిని సస్పెండ్‌ చేశారు. వర్గ పోరు, ఆర్థిక వ్యవహారాలే ఆ ఇద్దరు అధికారుల సస్పెన్షన్‌కు కారణమని జైళ్ల శాఖ సిబ్బంది చర్చించుకొంటున్నారు. ఇదే సమయంలో జైలులోకి వార్డర్లు భోజనం క్యారియర్లు తీసుకెళ్లనివ్వకుండా కొత్తగా వచ్చిన జైలు అధికారి అడ్డు చెప్పారు. ఇద్దరు వార్డర్లను తనిఖీ పేరుతో ఖైదీల ముందు దుస్తులు విప్పించి నగ్నంగా కూర్చోబెట్టారు. రిమాండ్‌ లేదా శిక్షపడ్డ ఖైదీలు మొదటిసారి జైలుకు వచ్చినప్పుడు రహస్యంగా ఏవైనా బ్లేడ్‌ లాంటివి దాచుకున్నారా? అనే అనుమానంతో తనిఖీ చేస్తారు. ఖైదీల మాదిరిగా తమను అవమానకరంగా దుస్తులిప్పించి వారి ముందే నగ్నంగా నిల్చోబెడితే విధులు ఎలా నిర్వర్తించాలని ఆ ఇద్దరు తోటి సిబ్బంది వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల వేధింపులతో విసిగిపోయిన సిబ్బంది శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. వారికి కుటుంబ సభ్యులు, పిల్లలు తోడవడంతో వివాదం ముదిరింది. వెంటనే రంగంలోకి దిగి చాకచక్యంగా సమస్యను పరిష్కరించాల్సిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించారు. కనీసం అటువైపు కూడా వెళ్లలేదు. నిరసనకు దిగిన 35 మంది సిబ్బందిని జైలు సూపరింటెండెంట్‌ విధులకు దూరంగా పెట్టేశారు.


  • రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు..

విశాఖపట్నం సెంట్రల్‌ జైలు వివాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాల లు ఎగిశాయి. ఆదివారం ఉదయం సిబ్బంది నల్లబ్యాడ్జిలతో జైళ్ల ముందు నిరసనకు దిగారు. వేధింపులు భరించలేమని, జైళ్ల మాన్యువల్‌ ప్రకారం డ్యూటీలు చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. అప్పటికైనా మేల్కోవాల్సిన ఉన్నతాధికారులు మరింత మంట రాజేసేలా నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ జిల్లాల్లోని జైళ్లలో పనిచేస్తున్న వార్డర్లలో 35 మందిని ఆదివారం అనూహ్యంగా విశాఖ సెంట్రల్‌ జైలుకు, అదేవిధంగా విశాఖ జైలు నుంచి 31 మందిని రాయలసీమ జిల్లాలకు అటాచ్‌మెంట్‌ ఇచ్చారు. 66 పేర్లతో కూడిన జాబితాను జైళ్ల శాఖ విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలోని జైళ్లలో నిరసనలు మరింత ఊపందుకున్నాయి. విశాఖలో తప్పు జరిగితే అందుకు కారణాలు విశ్లేషించి తప్పు సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు తమను ఎందుకు బలిపశువుల్ని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో విశాఖ జైలులో విధుల్లో ఉన్న వార్డర్లను లోపలే బంధించడం మరో వివాదానికి తెరతీసింది. రెండు రోజుల పాటు విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. సీమలో సిబ్బంది కొరత రాయలసీమ జైళ్లలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. రాష్ట్ర జైళ్ల శాఖ సిబ్బంది మొత్తం మూడు వేలమంది కాగా, యూనిఫామ్‌ సిబ్బంది 1600 మందికి పైగా ఉండాలి. కానీ జైళ్ల శాఖ 900 మందితోనే నెట్టుకొస్తోంది. ఎక్కువ మంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారు ఉండటంతో అటువైపు వెళ్లారు. తాజా నిర్ణయంతో సీమ జైళ్లలో సిబ్బంది కొరత ఏర్పడింది. రాయలసీమ జిల్లాలకు కేంద్రమైన కడప రేంజ్‌కు జైళ్ల శాఖలో డీఐజీ లేరు. కడప జైలు సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు ఇన్‌చార్జిగా ఉన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 08:22 AM