కడప జిల్లా కోర్టు గీత దాటింది!
ABN , Publish Date - Apr 24 , 2024 | 04:03 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు/సీఎం జగన్మోహన్‌రెడ్డి,
విచారణ పరిధి దాటి ఉత్తర్వులు
హైకోర్టులో సునీత, టీడీపీ నేత బీటెక్ రవి పిటిషన్లు
వివేకా హత్యపై ప్రజా బాహుళ్యంలోని వివరాలనే ప్రస్తావించాం
వ్యాఖ్యలపై అభ్యంతరం ఉంటే ఈసీని ఆశ్రయించాలి
నేరుగా కోర్టులో దావా వేయడం చెల్లదు
ఓ పార్టీకి అనుచిత లబ్ధి చేకూర్చేలా కడప కోర్టు ఆదేశాలు
వాటిని రద్దుచేయాలని అభ్యర్థన.. నేడు విచారణ
అమరావతి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు/సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఏ కేసుల గురించీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్ రవి) హైకోర్టులో సవాల్ చేశారు. వేర్వేరుగా పిటిషన్లు (సివిల్ మిసిలేనియస్ అప్లికేషన్) దాఖలు చేశారు. ఆ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని.. విచారణ పరిధిదాటి కోర్టు ఆదేశాలిచ్చిందని తెలిపారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా దావాలోని ప్రతివాదుల వాదనలు వినకుండానే ఏకపక్షంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులిచ్చిందన్నారు. ‘పరువుకు నష్టం కలిగించినందుకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైఎ్‌సఆర్ కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదు. అలాంటి వ్యాజ్యంలో ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదు. ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలకు విరుద్ధంగా సూట్‌లోని ప్రతివాదులు ఎన్నికల్లో అవినీతి కార్యకలాపాలు, నేరాలకు పాల్పడలేదనే విషయాన్ని కడప కోర్టు గుర్తించి ఉండాల్సింది.
ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే బాధిత వ్యక్తులు వ్యక్తిగతంగా పిటిషన్ (సూట్) వేసుకుని ఉండాల్సింది. పార్టీ తరఫున దాఖలు చేసిన సూట్‌లో కోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఉండాల్సింది కాదు. వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీ వద్ద వారు ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా ఈసీని ఆశ్రయించేందుకు అవకాశం ఉండగా నేరుగా కోర్టులో దావా వేయడం చెల్లుబాటు కాదు. వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేలా కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చేందుకు ఆ కోర్టు పేర్కొన్న కారణాలు సహేతుకుంగా లేవు. దావాలో పిటిషనర్లు కోరని అభ్యర్ధనలను కూడా మంజూరు చేసి పరిధికి మించి వ్యవహరించింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులోని అంశాలు, ప్రజాబాహుళ్యంలో ఉన్న వివరాల ఆధారంగానే దావాలోని ప్రతివాదులు వివేకా హత్యకు సంబంధించి ప్రకటనలు చేశారు. ఈ విషయాన్ని గుర్తించడంలో కడప కోర్టు విఫలమైంది. ఎన్నికల నేపథ్యంలో ఆ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఓ రాజకీయ పార్టీపై అసమ్మతి వ్యక్తం చేయకుండా నిరోధించేలా, దానికి అనుచిత లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి’ అని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు, న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు మంగళవారం జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎన్.విజయ్‌తో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రానున్నాయి.