Share News

Check Power : సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:11 PM

పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల చెక్‌ పవర్‌ రద్దు చేసినట్లు పీలేరు పంచాయతీ ఈవో గురుమోహన్‌ తెలిపారు.

Check Power : సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు
పీలేరు గ్రామ పంచాయతీ కార్యాలయం

ముగ్గురు అధికారులపై శాఖాపరమైన చర్యలు

ఉన్నతాధికారులకు సిఫారసు

నిధుల దుర్వినియోగం ఆరోపణల పర్యవసానం

పీలేరు, సెప్టెంబరు 5: పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల చెక్‌ పవర్‌ రద్దు చేసినట్లు పీలేరు పంచాయతీ ఈవో గురుమోహన్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం తమ కార్యాలయానికి జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత సర్పంచ్‌ డాక్టర్‌ హబీబ్‌ బాషా, గతంలో ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌గా పనిచేసిన ఉపసర్పంచ్‌ జీనత్‌ షఫీలకు ఉన్న చెక్‌పవర్‌ను రద్దు చేయడమే కాకుండా పరిపాలనా సౌలభ్యం కోసం తనకు, పీలేరు ఎంపీడీవోకు చెక్‌పవర్‌ను ఇచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ధనలక్ష్మి నుంచి తనకు అందిన ఉత్తర్వుల్లో ఉన్నట్లు ఆయన వివరించారు. నిధుల దుర్వినియోగం అభియోగాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు సర్పంచుల నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు చెక్‌ పవర్‌ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

సర్పంచులు, అధికారులకు గత నెలలో నోటీసులు

పీలేరు గ్రామ పంచాయతీలో 2021-23 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు జరిగిన నిధుల వినియోగంపై అధికారులు విచారణ జరిపారు. ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి పంచాయతీ నిధులలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయన్న ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు జిల్లా ఉన్నతాధికారులు పంచాయతీలో విచారణకు ఆదేశించారు. మదనపల్లె డీఎల్‌పీవో నాగరాజు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం ఈ ఏడాది జూన్‌ 5వ తేదీ నుంచి 20 రోజులపాటు రికార్డులు పరిశీలించి తమ విచారణ సారాంశాన్ని నివేదిక రూపంలో జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు. వారి విచారణలో రూ.1.40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఆ కాలంలో సర్పంచులుగా పనిచేసిన హబీబ్‌బాషా, జీనత్‌ షఫీ, ఈవోలుగా పనిచేసిన జేఎల్‌ఆర్‌వీ ప్రసాద్‌ (ప్రస్తుతం చిత్తూరు జిల్లా సదుం మండల ఈవోపీఆర్‌ఆర్‌డీ), కేఆర్‌ ప్రసాద్‌ (ప్రస్తుతం వాల్మీకిపురం గ్రామ పంచాయతీలో జూనియర్‌ అసిస్టెంటు), ఎస్‌ఏ గఫూర్‌ (ప్రస్తుతం కేవీపల్లె మండలం ఈవోపీఆర్‌డీ) నిధుల వినియోగానికి సంబంధించిన సరైన రికార్డులతో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, వివరణ ఇవ్వకపోతే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆగస్టు 1వ తేదీ నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ అయిన తరువాత పీలేరు పంచాయతీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సెలవులో ఉన్న సర్పంచ్‌ హబీబ్‌ బాషా హడావిడిగా విధుల్లో చేరగా ఇన్‌చార్జ్‌ సర్పంచ్‌గా ఉన్న జీనత్‌ షఫీ ఉపసర్పంచుగా మిగిలిపోయారు. సర్పంచుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత హబీబ్‌బాషా పలుమార్లు విలేఖరులతో మాట్లాడుతూ తాము ఎటువంటి నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని, తాము ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్కలు చెప్పగలమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఉన్నతాధికారులు జారీ చేసిన నోటీసులకు సర్పంచులిద్దరూ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో వారి చెక్‌ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు డీపీవో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు గురువారం పీలేరు పంచాయతీ కార్యాలయానికి సమాచారం అందించారు.


అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక

సర్పంచులకు చెక్‌ పవర్‌ రద్దు చేసిన జిల్లా ఉన్నతాధికారులు అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనువుగా రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు డీపీవో ధనలక్ష్మి తెలిపారు. ఈవోలుగా పనిచేసిన వరప్రసాద్‌, ఎస్‌.ఎ.గఫూర్‌ ప్రస్తుతం ఈవోపీఆర్‌ఆర్‌డీలుగా పనిచేస్తున్నందున వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు నివేదిక అందజేసినట్లు తెలిపారు. మరో అధికారి కేఆర్‌ ప్రసాద్‌ (ప్రస్తుతం వాల్మీకిపురం గ్రామ పంచాయతీలో జూనియర్‌ అసిస్టెంటు)పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు బుధవారమే నివేదిక అందజేసినట్లు ఆమె తెలిపారు. కేఆర్‌ ప్రసాద్‌పై రెండు, మూడు రోజుల్లో చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.

ఎవరి హయాంలో ఎంతెంత...

- అధికారులు వెల్లడించిన మేరకు సర్పంచు హబీబ్‌బాషా, కార్యదర్శులు జేఎల్‌ఆర్‌వీ ప్రసాద్‌, కేఆర్‌ ప్రసాద్‌ల హయాంలో రూ.80,74,184 దుర్వినియోగం అయినట్లు విచారణలో తేలింది.

- సర్పంచు జీనత్‌ షఫీ, కార్యదర్శులు కేఆర్‌ ప్రసాద్‌, ఎస్‌ఏ గఫూర్‌ల హయాంలో రూ.59,69,530 దుర్వినియోగం అయినట్లు విచారణలో తేలింది.

Updated Date - Sep 05 , 2024 | 11:11 PM