నర్సాపురం పోస్టాఫీ్‌సలో పోస్టుమాస్టర్ చేతివాటం
ABN , Publish Date - Sep 19 , 2024 | 11:47 PM
నర్సాపురం పోస్టాఫీస్‌లో నాయక్ అనే అతను 13 సంవత్సరాలుగా పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో ఇతను పోస్టాఫీసుకు వచ్చేవారితో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. ఖాతాదారులు సైతం ఇతనిపై నమ్మకం పెంచుకున్నారు.
దాదాపు రూ.50 లక్షలు స్వాహా
లబోదిబోమంటున్న ఖాతాదారులు
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్ అంటే పేదలకు, మధ్యతరగతి పొదుపుదారులకు గట్టి నమ్మకం. అలాంటి సంస్థలో పనిచేసే ఓ పోస్టుమాస్టర్ కంచే చేను మేసిన చందాన దాదాపు రూ.50లక్షలు నిధులను స్వాహా చేశాడు. కొద్దిరోజులుగా అతను అదృశ్యమయ్యాడు. దీనిపై బాధితులు గురువారం నర్సాపురం పోస్టాఫీస్ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు..
కాశినాయన సెప్టెంబరు 19: నర్సాపురం పోస్టాఫీస్‌లో నాయక్ అనే అతను 13 సంవత్సరాలుగా పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో ఇతను పోస్టాఫీసుకు వచ్చేవారితో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. ఖాతాదారులు సైతం ఇతనిపై నమ్మకం పెంచుకున్నారు. చాలా మంది ఈ పోస్టాఫీసులో నెలనెలా పొదుపు కడుతూ వస్తున్నారు. తినో తనకో ఆరుగాలం కష్టించి రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొందరు, వచ్చే సామాజిక పింఛనలో కొంత మిగుల్చుకుని మరికొందరు నెలనెలా పోస్టాఫీ్‌సలో కట్టుకుంటూ వస్తున్నారు. ఇక్కడే పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శిస్తూ వచ్చాడు. ఖాతాదారులు పొదుపు కడుతున్న డబ్బును పుస్తకంలో రాసి సీల్ వేసి సంతకం చేసి బుక్ ఇస్తాడు కానీ ఆనలైనలో నమోదు చేయడు. మరికొందరి పుస్తకాలను నమ్మబలికి తనవద్దనే ఉంచుకున్నాడు. నెలనెలా ఇలా వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటూ వచ్చాడు. తాను డబ్బు స్వాహా చేసిన విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా కిందిస్థాయి వారిని మ్యానేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఇలా దాదాపు రూ.50లక్షలు దారిమళ్లించినట్లు తెలిసింది.
పొదుపు గడువు ముగియడంతో..
పలువురు ఖాతాదారులకు పొదుపు సమయం ముగిసినా పోస్టుమాస్టర్ నాయక్ డబ్బు ఇవ్వకుండా సంతకాలు చేయించుకుని ఆ డబ్బును డ్రా చేసుకుని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న పొదుపుదారులు డబ్బుకోసం ఒత్తిడి చేయడంతో సదరు పోస్ట్‌మాస్టర్ విధులకు డుమ్మాకొట్టాడు. విషయం తెలుసుకున్న పైఅధికారులు గత నెల 27వ తేదన పోస్టాఫీసు తాళాలు పగులగొట్టి కార్యాలయం తెరిచి రికార్డులు పరిశీలించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అధికారులు మాత్రం పుస్తకాల్లో నమోదుచేసి ఉంటేనే బాధ్యత వహిస్తాము అంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఖాతాదారులు గురువారం పోలీసులను ఆశ్రయించారు.
ఈ విషయంపై బద్వేల్ డివిజన పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఇనచార్జి అమర్‌నాధ్‌ను వివరణ కోరగా నిధులు గోల్‌మాల్ జరిగినమాట వాస్తవమేనని అన్నారు. నర్సాపురం బ్రాంచలో 5రకాల పొదుపుల్లో దాదాపు 1000 మంది ఖాతాదారులు ఉన్నారని ఇప్పటివరకు దాదాపు 50శాతం పుస్తకాలు పరిశీలించగా రూ.15 లక్షలు దారిమళ్లించినట్లు గుర్తించామన్నారు. పూర్తిస్థాయి విచారణ ముగియగానే ఆధారాలు ఉన్నవారికి తిరిగి వడ్డీతో సహా డబ్బు చెల్లిస్తామన్నారు. చాలామంది ఆధారాలు లేకుండా డబ్బు ఇచ్చినట్లు, ఫోర్జరీ సంతకాలతో డబ్బు తీసుకున్నాడని చెబుతున్నారని వారిని కూడా పిలిపించి విచారించి ఒక లిస్ట్ట్ తయారుచేసి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
ఫోర్జరీ సంతకాలతో డ్రాచేశారు
- విజయలక్ష్మి, నర్సాపురం
నేను ఐదేళ్లుగా నెలకు రూ.4వేలు పొదుపు చేశాను. జూనతో గడువు ముగిసింది రూ.2.90లక్షలు ఇస్తానని ఒక సంతకం చేయించుకున్నాడు. అదో ఇస్తాను అదో ఇస్తానని కాలయాపన చేస్తుంటే కలసపాడు సబ్‌పోస్టాఫీ్‌సకు వెళ్లి విచారించగా నా సంతకం ఫోర్జరీ చేసి రోజుకు రూ.20వేల చొప్పున డ్రాచేశాడని చెప్పారు. ఖాతాలో కేవలం రూ.1,300లు ఉంది. అధికారులే న్యాయం చేయాలి.
మీరే పట్టుకోనిరండి అంటే ఎలా
నేను క్షవరం వృత్తిలో వచ్చే రూపాయ రూపాయని కూడబెట్ట్టి కూతురుకోసం సుకన్య కింద పొదుపు కట్టుకున్నాను. మొదట్ల్లో నెలకు రూ.1000 కట్టాను. 2023 సంవత్సరానికి నెలకు రూ.10వేలకు పెంచుకున్నాను. 12 నెలలుగా పుస్తకంలో రాయకుండా రూ.1.20లక్షలు వాడుకున్నాడు. పుస్తకం కూడా ఇవ్వలేదు. అధికారులను అడిగితే ఆధారాలు లేకుండా ఏమీ చేయలేము.. పోస్టుమాస్టర్ నాయక్‌ను పట్టుకోని రాండి మాట్లాడదాం అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం.