Share News

Madanapalle Incident: మదనపల్లి ఘటనలో కీలక అప్డేట్..!

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:23 PM

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు...

Madanapalle Incident: మదనపల్లి ఘటనలో కీలక అప్డేట్..!

అన్నమయ్య జిల్లా : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో (Madanapalle Incident) పోలీసులు మరో ముందడుగు వేశారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని ఆయన ఇంట్లోనే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇతను మదనపల్లిలోని ఓ హోటల్ యజమానిని బెదిరించి 15.7 ఎకరాల ఆస్తులు రాయించుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పాటు వివాదాస్పద భూములకు సంబంధించి పెద్ద ఎత్తున ఇతని ద్వారా లాభం జరిగిన నేపథ్యంలో కడప నుంచి వచ్చిన పోలీస్ ప్రత్యేక బృందం విచారిస్తున్నారు. ఈ ఘటనలో లింక్ దొరికట్టేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.


ఇక్కడే మొదలైందా..?

మరోవైపు.. మదనపల్లి ఘటనలో రాజకీయం కోణం ఉందా..? రాగానిపల్లి భూముల వ్యవహారంతో మదనపల్లి ఘటనకు లింక్ ఉందా..? రికార్డు కాల్చివేయడం వెనక నాయకుల పాత్ర ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాగానిపల్లి భూముల వ్యవహారంలో జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేత పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తే 982 ఎకరాల రాగానిపల్లి భూములను ఏపీఐసీసీకి అమ్మడానికి ప్లాన్ వేసినట్లు సమాచారం. ఏపీఐసీసీకి భూమి విక్రయించడంతో వంద కోట్లు దంచుకోవడానికి నేతలు స్కెచ్‌ వేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వం మారగానే రికార్డులు ‌మార్చడానికి ప్రయత్నించినట్లు అనుమానాలువస్తున్నాయి. రికార్డులు మార్చడం సాద్యం కాకపోవడంతో తమ సన్నిహిత అధికారులతో.. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదానికి కుట్ర చేసినట్లు సమాచారం.


అనుమానం ఇక్కడే..!

రీ-సర్వేలో పలువురి భూములు తమ అనుకూలమైన వారి పేరిట వైసీపీ నాయకులు మార్పులు చేయించినట్లుగా తెలుస్తోంది. ఒరిజనల్ రికార్డులను సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతులు సమర్పించగా.. రాగానిపల్లి భూముల వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణను తప్పుదోవ పట్టించేందుకే ఒరిజనల్ రికార్డులు కాల్చివేశారానే అనుమానాలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కుట్ర కోణం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం నాడు డీజీపీ తిరుమల రావు కూడా మూడు గంటలపాటు నిశితంగా పరిశీలించి.. ఇది యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదని.. కిటికీ బయట అగ్గిపుల్లలు కూడా కనిపించాయన్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు.


కుట్రను తేల్చేందుకు..!

కాగా.. ఈ ఘటనలో రెండోరోజు యథావిధిగా విచారణ కొనసాగుతోంది. డివిజన్‌లోని 11 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేక బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు సబ్ కలెక్టరేట్‌కు తరలిస్తున్నారు. ఘటనపై విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నాగపుర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ సంస్థ నిపుణులను ప్రభుత్వం పిలిపిస్తోంది. దస్త్రాలు దగ్ధంలో కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం చిన్న ఆధారం దొరికినా చాలు నిందితులను పట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశాలు మాత్రం మెండుగానే కనిపిస్తున్నాయి.


ఏమిటీ రాగాని రచ్చ?

74 ఏళ్లుగా వివాదంలోఉన్న రాగానిపల్లెలోని 982 ఎకరాల భూమి అనాధీనంలో ఉండగా.. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి ఒత్తిళ్లతో అధికారులు ఏకపక్షంగా పట్టాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల పుంగనూరు తహసీల్దార్‌ శివయ్య అమరావతిలోని సర్వే సెటిల్‌మెంట్స్‌ ల్యాండ్‌ రికార్డు కమిషన్‌లో రివిజన్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. కాగా.. ఈ భూములకు సంబంధించినవారిలో ఐదుగురు చనిపోయారు. వారు ఎవరనేది విచారించి హక్కుదారులకు నోటీసులు జారీ చేయాలని సీసీఎల్‌ఏ ఆదేశించింది. ఈ కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తోంది. సోమవారం విచారించిన సీసీఎల్‌ఏ కోర్టు కేసు తదుపరి విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Jul 23 , 2024 | 04:23 PM