Anganwadi Agitation: అంగన్‌వాడీల ఛలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తత
ABN , Publish Date - Jan 22 , 2024 | 10:35 AM
విజయవాడ: అంగన్‌వాడీల ఛలో విజయవాడ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి అంగన్‌వాడీలు వెళ్తారని తాడేపల్లి సీఎం ఇంటివైపు వెళ్ళే రహదారుల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి మరీ పంపుతున్నారు.

విజయవాడ: అంగన్‌వాడీల ఛలో విజయవాడ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి అంగన్‌వాడీలు వెళ్తారనే ఆలోచనతో తాడేపల్లి సీఎం ఇంటివైపు వెళ్ళే రహదారుల్లో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి మరీ పంపుతున్నారు. ఐరన్ ఫెన్సింగ్ వేశారు. విజయవాడ నగరంలో కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ధర్నా చౌక్, బీఆర్‌టీఎస్ రోడ్‌లో భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా కానిస్టేబుళ్లను విజయవాడకి రప్పించారు.
అంగన్‌వాడీలను అరెస్ట్ చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు మహిళ కానిస్టేబుళ్లను రంగంలోకి దించారు. బీఆర్‌టీఎస్ రోడ్‌లోకి అంగన్‌వాడీలు దశల వారీగా వస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టుగా పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. అంగన్‌వాడీలను తరలించేందుకు బీఆర్‌టీఎస్ రోడ్‌లోకి భారీగా బస్సులను తరలించారు. అరెస్ట్ చేసిన అంగన్‌వాడీలను ఏఆర్ గ్రౌండ్‌కు తరలిస్తున్నారు. అంగన్‌వాడీలకు మద్దతుగా కార్మిక సంఘాలు, సీపీఐ, సీపీఎం, యువజన సంఘాల నేతలు తరలి వస్తున్నారు.
కాగా తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడంతో అంగన్‌వాడీలు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు. సోమవారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఆరువేల మంది అంగన్వాడీలు విజయవాడ రోడ్లమీద బైఠాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు విజయవాడకు చేరుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం విజయవాడకు వస్తున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.
