గలీజు జోగి
ABN , Publish Date - Aug 21 , 2024 | 01:02 AM
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని రకాలుగా సంపాదించవచ్చో అనడానికి నిలువెత్తు నిదర్శనం వైసీపీ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేశ్. ఇప్పటికే సీఐడీ అటాచ్మెంట్లో ఉన్న భూమిని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని అడ్డంగా దొరికిపోయిన జోగి కుటుంబం.. తాజాగా పెడన మండలంలో వందలాది మంది చిన్న రైతుల పొట్టకొట్టి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. అధికారం దూరం కావడంతో అక్రమార్జనే ధ్యేయంగా ఆయన చేసిన అవినీతి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో లెక్కకుమించిన తప్పులు చేసుకుంటూ పోయిన జోగి కుటుంబం ఇప్పుడు ఊచలు లెక్కపెట్టే పరిస్థితికి చేరింది.
వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ మరో కుంభకోణం
కృత్తివెన్ను మండలంలో ఆయన మార్కు దోపిడీ
దాదాపు 300 ఎకరాల చెరువుల్లో అడ్డగోలు అవినీతి
చిన్న రైతుల చెరువులు తక్కువకు లీజుకు తీసుకుని..
బడాబాబులకు ఎక్కువకు సబ్లీజుకు ఇచ్చి..
ఏటా రూ.2 కోట్ల పైచిలుకు ఆదాయం హాంఫట్
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని రకాలుగా సంపాదించవచ్చో అనడానికి నిలువెత్తు నిదర్శనం వైసీపీ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేశ్. ఇప్పటికే సీఐడీ అటాచ్మెంట్లో ఉన్న భూమిని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని అడ్డంగా దొరికిపోయిన జోగి కుటుంబం.. తాజాగా పెడన మండలంలో వందలాది మంది చిన్న రైతుల పొట్టకొట్టి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. అధికారం దూరం కావడంతో అక్రమార్జనే ధ్యేయంగా ఆయన చేసిన అవినీతి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో లెక్కకుమించిన తప్పులు చేసుకుంటూ పోయిన జోగి కుటుంబం ఇప్పుడు ఊచలు లెక్కపెట్టే పరిస్థితికి చేరింది.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి/కృత్తివెన్ను) : అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ పెడన నియోజకవర్గంలో తన అనుచరుల ద్వారా చేసిన అవినీతి పనులన్నీ బయటకు వస్తున్నాయి. చేపల చెరువుల తవ్వకాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, పాస్ పుస్తకాల పంపిణీ.. ఇలా అన్నింటిలోనూ తన అనుచరుల ద్వారా వసూళ్ల దందా సాగించిన జోగి సొంత పార్టీ నేతలనూ వదల్లేదన్న విమర్శలున్నాయి. కానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన ఉదంతం మాత్రం వసూళ్ల దందాలో జోగిలోని కొత్తకోణాన్ని తెలియజేస్తుంది. కేవలం మాట అడ్డంపెట్టి చిన్న, సన్నకారు రైతులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలు జేబులో వేసుకున్న తీరును చూసి ‘అమ్మ జోగి’ అంటూ సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.
చిన్న చెరువులపై పెద్ద కన్ను
కృత్తివెన్ను మండలం గరిశపూడి, నిడమర్రు రెవెన్యూ గ్రామాల పరిధిలో తణేలు వంతెన సమీపంలోని ఆర్ఎస్ నెంబరు 66, 75, 76, 77లో సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో చిన్నచిన్న చెరువులు ఉన్నాయి. వీటిలో అత్యధికం ప్రభుత్వ భూములు కాగా, అవి స్థానికుల ఆక్రమణలో ఉండేవి. కొంతమేర పట్టా భూములు కూడా ఉన్నాయి. ఈ భూములన్నింటినీ స్థానికులు వాటాలుగా పంచుకుని పీతలు, రొయ్యల చెరువులుగా సాగు చేసుకుంటున్నారు. ఈ విధానం కొన్నేళ్లుగా అమల్లో ఉంది. పెదలంక డ్రెయిన్‌ను ఆనుకుని ఉండటంతో ఆటుపోట్లకు ముంపునకు గురయ్యే ఈ భూములనుంచి అంతంతమాత్రంగానే ఆదాయం ఉండేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెడన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జోగి రమేశ్ కన్ను ఈ భూములపై పడింది. మంత్రి అయ్యే వరకు ఓపిక పట్టిన ఆయన ఆ తర్వాత వాటిని చెరబట్టాడు.
లీజు పేరిట రెట్టింపు దోపిడీ
ఆదాయం రాని ఆ భూములను తనకు ఏడేళ్ల పాటు అగ్రిమెంటు రాసి, లీజుకు ఇవ్వాలని రైతులను జోగి రమేశ్ కోరారు. లీజు పూర్తయ్యేలోపు భూములకు పట్టాలు ఇప్పిస్తానని ఆశ చూపారు. దీంతో చిన్న సన్నకారు రైతులంతా పట్టాల కోసం ఆశపడి, తమ భూములను సంవత్సరానికి ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు లీజుకు ఇచ్చారు. ఇవ్వని వారిని భయ పెట్టి, బెదిరించి మరీ భూములను లీజుకు తీసుకున్నా రన్న ఆరోపణలున్నాయి. లీజుకు తీసుకున్న భూముల్లో కొంతభాగం తక్షణమే గోదావరి జిల్లాకు చెందిన బడా రైతులకు సబ్ లీజుకు ఇచ్చేశారు. రైతుల నుంచి లీజుకు తీసుకున్న మొత్తానికి పది రెట్లు బడా రైతులకు సబ్లీజుకు ఇవ్వడం గమనార్హం. ఎకరా రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు లీజుకు ఇచ్చేశారు. అంటే మధ్యవర్తిగా మాట అడ్డంపెట్టి ఏడాదికి ఎకరం చెరువు ద్వారా రూ.50 వేల వరకు లబ్ధి పొందారన్న మాట. పైగా వాటిని పెద్దపెద్ద చెరువులుగా తవ్వేందుకు సదరు బడా రైతు నుంచే ఎకరాకు రూ.5 వేల చొప్పున ఖర్చుల నిమిత్తం పిండేయడం గమనార్హం. ఈ చెరువుల ద్వారా ఏటా మాజీమంత్రికి లీజు రూపంలో రూ.కోటిన్నర వరకు ఆదాయం వస్తుండటం గమనార్హం. పడతడిక, నిడమర్రు గ్రామాల పరిధిలో పోడు రోడ్డు నుంచి లక్ష్మీపురం సబ్ చానల్ వరకు మధ్యలో సుమారు 120 ఎకరాలను కూడా ఈ మాదిరిగానే రైతుల నుంచి తక్కువకు లీజుకు తీసుకుని, సబ్ లీజుకు ఇచ్చి ఏటా రూ.60 లక్షల వరకు జేబులో వేసుకుంటున్నారు.