Share News

సీపీడీసీఎల్‌లో పదవుల పందేరం

ABN , Publish Date - Jul 17 , 2024 | 01:20 AM

వైసీపీ హయాంలో అన్ని శాఖల్లోనూ ఆ పార్టీ రంగు పూసుకున్న కాంట్రాక్టర్లు వాలిపోయారు. వారు చెప్పిన మాటలకు తల ఊపిన అధికారులను నియమించుకున్నారు. కుదరదని సమాధానం చెప్పిన అధికారుల కుర్చీలు కదిపేశారు. ఇలాంటి వ్యవహరాలు సాగిన శాఖల్లో సీపీడీసీఎల్‌ (సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌) ఒకటి. ప్రభుత్వం ఒకపక్క ప్రక్షాళన చేస్తుంటే మరోపక్క నుంచి కాంట్రాక్టర్లు కూటమి నేతల వద్ద తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న అధికారులను తిరిగి తీసుకొచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టే వ్యవహారాలను చాపకింద నీరులా సాగిస్తున్నారు.

సీపీడీసీఎల్‌లో పదవుల పందేరం

కీలక పోస్టుల్లో తమవారి కోసం కాంట్రాక్టర్ల ప్రయత్నాలు

పదవుల్లో చేరడానికి పాత డైరెక్టర్ల ప్రయత్నాలు

వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల కోసం ఆరాటం

వైసీపీ హయాంలో అన్ని శాఖల్లోనూ ఆ పార్టీ రంగు పూసుకున్న కాంట్రాక్టర్లు వాలిపోయారు. వారు చెప్పిన మాటలకు తల ఊపిన అధికారులను నియమించుకున్నారు. కుదరదని సమాధానం చెప్పిన అధికారుల కుర్చీలు కదిపేశారు. ఇలాంటి వ్యవహరాలు సాగిన శాఖల్లో సీపీడీసీఎల్‌ (సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌) ఒకటి. ప్రభుత్వం ఒకపక్క ప్రక్షాళన చేస్తుంటే మరోపక్క నుంచి కాంట్రాక్టర్లు కూటమి నేతల వద్ద తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న అధికారులను తిరిగి తీసుకొచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టే వ్యవహారాలను చాపకింద నీరులా సాగిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : సీపీడీసీఎల్‌కు కొద్దిరోజుల క్రితం వరకు సంతోషరావు ఇన్‌చార్జి సీఎండీగా వ్యవహరించేవారు. ఆయన ఎస్పీడీసీఎల్‌కు రెగ్యులర్‌ సీఎండీ సీపీడీసీఎల్‌ ఇన్‌చార్జి బాధ్యతలను ఆయనకు అప్పగించారు. కొద్దిరోజుల క్రితం సంతోషరావుకు ఇన్‌చార్జి బాధ్యతలను ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో చక్రధరబాబుకు బాధ్యతలను అప్పగించింది. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ విశ్రాంత అధికారి సీపీడీసీఎల్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీనామా చేయకుండా కుర్చీని అతుక్కుని కూర్చున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారితో రాజీనామాలు చేయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆ డైరెక్టర్‌ రాజీనామా చేశారు. సీపీడీసీఎల్‌కు సీఎండీగా ఎవరు ఉన్నా తమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ, కాంట్రాక్టర్లకు మేలు చేసిన ఈ డైరెక్టర్‌కు సీపీడీసీఎల్‌పై ప్రేమ చావలేదు. తిరిగి సీపీడీసీఎల్‌లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో అడ్డగోలుగా కాంట్రాక్టులు

జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు సీపీడీసీఎల్‌లో అడ్డగోలుగా కాంట్రాక్ట్‌లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న అధికారులను, డైరెక్టర్లను నియమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క సంతోషరావును తిరిగి సీపీడీసీఎల్‌కు రావడానికి పావులు కదుపుతున్నట్టు విద్యుత్‌ ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. సీపీడీసీఎల్‌ ఏర్పాటు చేసిన తర్వాత అవుట్‌ సోర్సింగ్‌ల్లో తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకున్నారు. కార్యాలయంలో ఏ ఫైలులో ఏ సారాంశం ఉందన్న విషయాలను వారి ద్వారా తెలుసుకుంటున్నట్టు సమాచారం.

ఎస్‌ఈ పోస్టుకు మరో రూటు

సీపీడీసీఎల్‌ ఎస్‌ఈగా ఉన్న మురళీమోహనరావు తన పదవిని కాపాడుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా ఎస్‌ఈగా ఉన్న ఆయనను వైసీపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి బదిలీ చేసింది. నెల నిండకుండానే తిరిగి ఎస్‌ఈగా వచ్చారు. ఇప్పుడు ఆయన తనకు పదోన్నతి వచ్చే వరకు సీపీడీసీఎల్‌ ఎస్‌ఈగా కొనసాగాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అడ్డంకులు లేకుండా చేస్తున్నారు. మురళీమోహనరావు సీఈ పదోన్నతి జాబితాలో ఉన్నారు. ఈ పదోన్నతి ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటి వరకు ఆయన ఇక్కడే ఎస్‌ఈగా కొనసాగాలని భావిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాస్థాయి అధికారుల్లోనూ మార్పు ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. దీంతో మురళీమోహనరావు తన సీటును కాపాడుకునే ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి నుంచి లేఖ తీసుకున్నట్టు సమాచారం. ఎస్‌ఈకి సీఈ పదోన్నతి వచ్చే వరకు ఇక్కడి నుంచి బదిలీ చేయవద్దని లేఖ ఇవ్వడం విద్యుత్‌ శాఖలో చర్చనీయాంశమవుతోంది. మురళీమోహనరావు చేస్తున్న ప్రయత్నాలకు విద్యుత్‌ ఉద్యోగుల సంఘంలోని ఒక కీలకనేత సహాయ సహకారాలు అందిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Jul 17 , 2024 | 01:20 AM