Share News

మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతి కంపు

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:51 AM

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ శానిటరీ విభాగంలో అవినీతి కంపు కొడుతోంది. శానిటరీ విభాగంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ప్రతిపనికీ ఒక రేటు నిర్ణయించి నగదు వసూళ్లకు పాల్పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్ల హోదాలో పనిచేస్తున్న వీరు, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ పెద్దల సహకారంతో అనధికారికంగా శానిటరీ అఽధికారులుగా చలామణి అవుతూ వచ్చారు. కొంతకాలంగా వీరు తమదైన శైలిలో తెరవెనుక చక్రం తిప్పుతూ వస్తున్నారు.

మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతి కంపు

శానిటరీ విభాగంలో ఉద్యోగుల విచ్చలవిడి అవినీతి

ఆ ఇద్దరు ఉద్యోగులు చెప్పినట్టే నడుస్తున్న పరిపాలన

విధులకు హాజరుకాని కార్మికుల మస్తర్లలోనూ చేతివాటం

డీజిల్‌ పేరుతో లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్న వైనం

పదోన్నతి ఇచ్చిన ఉద్యోగులకు వేతనాలు పెంచకుండా ఆరు నెలలుగా జాప్యం

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ శానిటరీ విభాగంలో అవినీతి కంపు కొడుతోంది. శానిటరీ విభాగంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ప్రతిపనికీ ఒక రేటు నిర్ణయించి నగదు వసూళ్లకు పాల్పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్ల హోదాలో పనిచేస్తున్న వీరు, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ పెద్దల సహకారంతో అనధికారికంగా శానిటరీ అఽధికారులుగా చలామణి అవుతూ వచ్చారు. కొంతకాలంగా వీరు తమదైన శైలిలో తెరవెనుక చక్రం తిప్పుతూ వస్తున్నారు.

వీరి ఆగడాలు అధికం కావడంతో పనితీరు మార్చుకోమని చెప్పిన ఒక పై అధికారి ఇంటికి అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెళ్లి సదరు అధికారిని, ఆయన కుటుంబసభ్యులను బెదిరించారు. ఈ ఘటనతో కొద్ది రోజులపాటు సంబంధిత ఉద్యోగిని పక్కనపెట్టిన అధికారులు మళ్లీ అదేపోస్టును అతనికి కేటాయించడం గమనించ దగ్గ అంశం.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ శానిటరీ విభాగంలో 450 మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్‌లలో కార్మికుల విధులకు సంబంధించి హాజరును సచివాలయాల్లో పనిచేసే శానిటరీ విభాగం సెక్రటరీలు ప్రతినెలా తయారు చేసి మునిసిపల్‌ కార్యాలయానికి పంపుతారు. వీటి ఆధారంగా కార్మికులకు జీతాల చెల్లింపు చేసే పనిని ఈ ఇద్దరు అసిస్టెంట్‌ శానిటరీ ఇనస్టెక్లర్లు చేస్తుంటారు. కార్మికులు వివిధ కారణాలతో విధులకు హాజరుకాకున్నా హాజరైనట్లుగా చూపి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించడంలో ఈ ఇద్దరు ఉద్యోగులు గుట్టుచప్పుడు కాకుండా తమపని చేసుకుపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికులు నెలలో పదిరోజుల పాటు విధులకు హాజరుకాకున్నా హజరైనట్లుగా చూపుతామని, ఈ పది రోజుల జీతంలో ఐదురోజుల జీతాన్ని మాకు ఇవ్వాలని ఇద్దరు అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కార్మికుల నుంచి బేరం కుదుర్చుకుని వసూలు చేసుకుంటున్నారని, ఈ అంశం బహిరంగ రహస్యమని కార్యాలయ ఉద్యోగుల బాహాటంగానే చెప్పుకుంటున్నారు. 450 మందికిపైగా కార్మికుల జీతాల చెల్లింపులో తిమ్మినిబమ్మిని చేసి ఈ తరహాలో కనీసంగా నెలకు రెండు లక్షల రూపాయలను వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇంతా జరుగుతున్నా కార్యాలయ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించడంలేదని, దీంతో ప్రజాధనం పక్కదారి పడుతోందని కార్పొరేషన్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు అంటున్నారు.

డీజిల్‌ వినియోగంలోనూ ఇదే తంతు

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా చెత్తసేకరణ కోసం ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వాహనాలకు వాటి సామర్థానికి అనుగుణంగా రోజుకు 10 నుంచి 15 లీటర్ల డీ జిల్‌ కూపన్లను శానిటరీ విభాగం నుంచి ఇస్తారు. కానీ బంకుల్లో ఏడు లేదా ఎనిమిది లీటర్ల డీజిల్‌ మాత్రమే కొడుతున్నారని, మిగిలిన డీజిల్‌ను రోజుకు ఎన్ని వాహనాలకు కూపన్లు ఇస్తే ఆ లెక్కన డీజిల్‌ సొమ్మును పెట్రోల్‌ బంకుల నుంచి ఈ ఇద్దరు అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వసూలు చేసుకుని ఎవరి వాటాలు వారికి ఇస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరులోనూ నగదు వసూళ్లకు పాల్పడటం గమనార్హం. గత 14 సంవత్సరాలుగా వీరు ఈ సీట్లను వదలకుండా తిష్టవేసి పనిచేయడం వీరికే చెల్లుబాటు అవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌లో గతేడాది చెత్తసేకరణకు సంబంధించిన ఐషర్‌ వాహనంతో పాటు, రెండు ట్రాక్టర్లు మాయమయ్యాయి. వీటిని మాయం చేసిన ఘటనపై విచార ణను పక్కనపెట్టేశారు. ఈ వ్యవహారంలో బాధ్యుడైన అధికారికి ఇటీవల పదోన్నతి ఇచ్చి మరీ కార్యాలయంలో పనిచేయించుకోవడం గమనించదగ్గ అంశం. శానిటరీ విభాగంలో ఉపయోగించే వాహనాలకు చిన్నపాటి మరమ్మతులు చేసినా వెయ్యి రూపాయలు ఖర్చయ్యే పనులకు ఐదువేల రూపాయల వరకు బిల్లులు పెట్టడం గమనించదగ్గ అంశం.

పదోన్నతి ఇచ్చినా సీట్లు కేటాయించరు?

ఈ ఏడాది జనవరి నెలలో మునిసిపల్‌ కార్పొరేషన్‌ శానిటరీ విభాగంలో పనిచేసే ఐదుగురు ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చారు. వీరికి గత ఐదునెలలుగా పదోన్నతికి అనుగుణంగా సీట్ల కేటాయించలేదు. పదోన్నతులు ఇచ్చిన ఉద్యోగులకు సీట్లు కేటాయిస్తే తమ అక్రమ రాబడికి గండిపడుతుందనే కారణంతో అధికారులను అసిస్టెంట్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పక్కదారి పట్టించి ఏవేవో కారణాలు చూపి కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పదోన్నతి ద్వారా పెరిగే జీతాన్ని కలపకుండా గత ఐదునెలలుగా వీరు తెరవెనుక చక్రం తిప్పుతుండటంతో సదరు ఉద్యోగులు పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కౌంటింగ్‌ సందర్భంగా కృష్ణా యూనివర్సిటీలో పారిశుధ్య పనులను మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు. అక్కడ పారిశుధ్య చర్యల నిమిత్తం బిల్లులు చేసి పెద్దమొత్తంలో నగదు మిగుల్చుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

Updated Date - Jun 17 , 2024 | 01:51 AM