Share News

Vijayawada: శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం

ABN , Publish Date - Oct 03 , 2024 | 08:23 AM

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వంసిద్ధమైంది. పది రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు గురువారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిని విద్యుత్‌ వెలుగులతో అందంగా ముస్తాబు చేశారు.

Vijayawada: శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం

విజయవాడ: ఇంద్రకీలాద్రి (Indrakiladri) అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు (Dussehra Sharannavaratri celebrations) ప్రారంభమయ్యాయి. తొలిరోజు గురువారం అమ్మవారికి అర్చకులు స్నాపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం 9 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. అమ్మవారి దర్శనం కోసం గురువారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వినాయకుని గుడి వద్ద నుండి క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకోక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు. తొలి రోజు గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి (Sri Bala Tripura Sundari Devi)గా అమ్మవారి దర్శనం ఇస్తారు.


దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్బంగా ఇంద్రకీలాద్రిని విద్యుత్ దీపాలతో మిరిమిట్లు గొలిపేలా అలంకరించారు. 9 గంటలకు అమ్మవారు భక్తులకు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. దసరా మహోత్సవాల నిర్వహణకు మొత్తం 6వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి ప్రాశస్త్యం తెలియజేసేలా లేజర్ షోను ఏర్పాటు చేస్తున్నారు. దుర్గా ఘాట్ వద్ద నవ హారతులను ప్రారంభించారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఈ హారతులు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. ఈసారి ఉత్సవాల్లో పోలీసులు సరికొత్త ప్రయోగం చేయనున్నారు. సైబర్ నేరాలు.. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ నేరాల నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనే అంశాలను కూడా వివరించనున్నారు. 10 రోజులపాటు జరిగే మహోత్సవాలకు సుమారు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వంసిద్ధమైంది. పది రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిని విద్యుత్‌ వెలుగులతో మరింత అందంగా ముస్తాబు చేశారు. ప్రధానాలయం పరిసర ప్రదేశాలను వివిధ రకాల పూలతో అలంకరించారు. తొలిరోజు అమ్మవారు శ్రీబాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని తొలిరోజు ఎక్కువగా దర్శించుకుంటారు. సాధారణ భక్తులు వినాయకుడి ఆలయం నుంచి ఉన్న మూడు క్యూల్లో ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి వెళ్లాలి. ఓం మలుపు వద్ద ఈ మూడు క్యూలు ఐదుగా మారతాయి. వాటిలో ఒకటి రూ.500, వీఐపీ కోటాలో వచ్చిన వారికి, మరొకటి రూ.300, ఇంకొకటి రూ.100 భక్తులకు కేటాయించారు. మిగిలిన రెండు క్యూల్లో ఉచిత దర్శనం భక్తులు వెళ్లాల్సి ఉంటుంది.


ఆరుసార్లు దర్శనానికి బ్రేక్‌

తొలిరోజు మినహా మిగతా రోజుల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. కాగా, రోజూ ఆరు వేర్వేరు సమయాల్లో దర్శనానికి బ్రేక్‌లు పడతాయి. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే సమయాల్లో దర్శనానికి అనుమతించరు. ప్రతి నైవేద్యానికి 10-15 నిమిషాల సమయం పడుతుంది. మొత్తంగా అరగంట వరకు దర్శనం నిలుపుదల చేస్తారు. ఇక రోజూ సాయంత్రం అమ్మవారికి సమర్పించే మహానివేదన సందర్భంగా గంటపాటు దర్శనానికి బ్రేక్‌ ఇస్తారు.

నివేదనలు ఇలా..

రోజూ తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచాక అమ్మవారిని మేల్కొలుపుతారు. స్నపన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం అభిషేకం చేస్తారు. నివేదనగా అమ్మవారికి పాలను సమర్పిస్తారు. తర్వాత పరిమిత సంఖ్యలో ఉన్న అర్చకులు అమ్మవారిని అలంకరిస్తారు. ఈ కార్యక్రమాలు 6 గంటల వరకు సాగుతాయి. 7 గంటల వరకు అర్చన జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి పులిహోర, లడ్డూ, చక్రపొంగలి, బెల్లపు పొంగలి, శెనగలు నివేదనగా ఇస్తారు. దీని బాలభోగం అని వ్యవహరిస్తారు. దీనిని అమ్మవారికి సమర్పించే సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు. తర్వాత 9 గంటలకు రాజభోగం సమర్పిస్తారు. అమ్మవారికి లడ్డూ, పులిహోర, రవ్వకేసరి, చక్రపొంగలిని నైవేద్యంగా పెడతారు. మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో ప్రత్యేక నివేదన సమర్పిస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు ప్రసాదాన్ని నివేదనగా పెడతారు. ఆయా సమయాల్లో 15 నిమిషాల పాటు దర్శనం ఆపుతారు. సాయంత్రం 6-7 గంటల మధ్య అమ్మవారికి మహానివేదన ఇస్తారు. ఇతర రోజుల్లో దీన్ని మధ్యాహ్నం 12 గంటలకు సమర్పిస్తారు. ఇది సమర్పించడానికి ముందు ప్రధాన ఆలయం పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తారు. మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి గంట సమయం పడుతుంది. అప్పటి వరకు దర్శనానికి భక్తులను అనుమతించరు. మహానివేదన అనంతరం పంచహారతులు ఇస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించునున్న సీఎం

నాగచైతన్య, సమంత విడాకులు.. కేటీఆర్‌ వల్లే..

ఆరేళ్ల అస్పియాను చంపేశారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 03 , 2024 | 08:23 AM