Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
ABN , Publish Date - Nov 09 , 2024 | 08:16 AM
అందరినీ అసభ్య పదజాలంతో దూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా,.. రిమాండ్ విధించింది.
కర్నూలు: వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌ను కర్నూలుకు పోలీసులు తీసుకువచ్చారు. పీటీ వారెంట్‌పై త్రీ టౌన్ పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చినట్లు సమాచారం. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును చంపుతానని అనిల్ బెదిరించాడు. దీనిపై బోరుగడ్డ అనిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు త్రీ టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
గుంటూరులో అనిల్‌పై హత్యాయత్నం కేసు..
మరోవైపు బోరుగడ్డ అనిల్ కుమార్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చి 31వ తేదీన బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఏ1గా, బోరుగడ్డ అనిల్ ఏ2 ఉన్నారు.
రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా సత్యకుమార్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఆ దాడిలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. సురేష్, అనిల్‌తో సహా 25 మందిని నిందితులుగా ఈ కేసులో చేర్చారు. రాజమండ్రి జైలులో ఉన్న అనిల్‌పై కేసు నమోదు చేశారు. కస్టడీకి తీసుకుని, వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ ఆస్పత్రికి అనిల్‌ను తరలించారు. అరండల్ పేట పోలీసులు మూడురోజుల పాటు అనిల్‌ను ప్రశ్నించారు.
వెలగపూడిలో జరిగిన మహిళ హత్య కేసులో నందిగం సురేష్ గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. డబ్బుల కోసం బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతోపాటు ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసు కూడా అనిల్ మీద ఉంది.
ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్..
కాగా.. అందరినీ అసభ్య పదజాలంతో ధూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. కాగా, ఈ కేసును విచారిస్తున్న పోలీసుల వద్ద అనిల్ కన్నీరు మున్నీరైనట్లు తెలిసింది. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పోలీసు అధికారులు ఏది అడిగినా అనిల్ దాచుకోకుండా సమాధానమిచ్చారు. ‘‘నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. దానికితోడు వైసీపీ నాయకులు.. నన్ను ముందుకు నెట్టి వారు వెనుక ఉన్నారు. నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన సోదరుడితో పాటు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు అప్పిరెడ్డి ఆదేశానుసారమే నాటి విపక్ష నేతలను దూషించాను. బెదిరింపులకు పాల్పడ్డాను’’ అని అనిల్ కుమార్ పోలీసుల విచారణలో తెలిపారు. ఇన్నాళ్లు ఢిల్లీలో కేంద్రమంత్రి రాందాస్ అథావాలే వద్ద ఉన్నానని, తన తల్లికి సర్జరీ చేయించడం కోసం గుంటూరుకు వచ్చానని అనిల్ పేర్కొన్నారు.
ఆధారాలతో ఫిర్యాదు చేస్తే అనిల్‌పై చర్యలు
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ‘‘అనిల్ కుమార్ తనకు తాను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకొంటున్నారు. దీనిపై చాలా వివాదాలు ఉన్నాయి. వర్డ్ అకాడమీ(యూకే) పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. 2018లో అనంతపురం టౌన్‌లో ఐఏఎస్ అధికారినని చెప్పి మోసం చేసిన కేసులో అనిల్ జైలుకెళ్లారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అనిల్ రెచ్చిపోవడం మొదలుపెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించేవారు. ఆయనపై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అనిల్‌ను పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక అదృశ్య శక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారో గుర్తించాల్సి ఉంది’’ అని ఎస్పీ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ వార్నింగ్
Supreme Court: పుణ్య క్షేత్రాలను ప్రత్యేక రాష్ట్రాలు చేయాలా?
Read Latest AP News And Telugu News