ఏం చేశారని ఓటు వేయాలి?
ABN , Publish Date - Feb 04 , 2024 | 12:07 AM
ఐదేళ్లలో ఏం చేశారని ప్రజలు ఓట్లు వేయాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మండిపడ్డారు.

ఆత్మకూరు, ఫిబ్రవరి 3: ఐదేళ్లలో ఏం చేశారని ప్రజలు ఓట్లు వేయాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మండిపడ్డారు. ఆత్మకూరులోని వెంగళరెడ్డి నగర్‌లో శనివారం ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుడ్డా మాట్లాడుతూ ఎక్కడి నుంచో వలస వచ్చి ఆత్మకూరు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే శిల్పా ఐదేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. 35 ఏళ్లలో జరగని అభివృద్ధి తానే చేశానని ప్రచారం చేసుకునే శిల్పా అసలు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పమంటే నోరు మెదపడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో జగన్ 40హామీలు ఇస్తే.. చక్రపాణిరెడ్డి 400 హామీలు ఇచ్చి ఇక్కడి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వర్ధన్ బ్యాంకును ప్రారంభించి మూడు నెలల్లోనే రూ.30కోట్లను కాజేసిన ఘనుడని అన్నారు. ఆత్మకూరులో ఇళ్ల స్థలాల పంపిణీ బుడ్డా కుటుంబ చలువేనని గుర్తు చేశారు. ఆనాడు తన సోదరుడు బుడ్డా సీతారామిరెడ్డి హయాంలో 130 ఎకరాలను కొనుగోలు చేయించి పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తే వాటిని రద్దు చేసి పేదప్రజలకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి శిల్పా అని మండిపడ్డారు. తనది పక్కనే ఉన్న వేల్పనూరు ఇక్కడి ప్రజలకు ఏకష్టమొచ్చినా ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. వలసొచ్చిన ఎమ్మెల్యే శిల్పాకు ఇక్కడి ప్రజల కష్టాలు తెలియవని, ఎన్నికల్లో ఓడిపోతే ఊరు వదిలివెళ్తారన్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని సూచించారు. ఇదిలావుంటే అనేక మార్లు తన టిక్కెట్ గురించి ఎమ్మెల్యే శిల్పా ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు సూటికేసులిచ్చి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం తమ కుటుంబానిది కాదని, తామేంటో తమ అధినాయకుడు చంద్రబాబుకు తెలసని అన్నారు. జగన్ పాలనతో రాష్ట్రం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు సముచితస్థానం కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడింది టీడీపీనేనని గుర్తుచేశారు. అంతకుముందు సంగమేశ్వరం సర్కిల్‌లో జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ తిరుపాలుబాబు, బీసీ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, వేణుగోపాల్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు కలిముల్లా, రాష్ట్ర కార్యదర్శి నాగూర్‌ఖాన్, నాయకులు అబ్దుల్లాపురం బాషా, ఆర్టీసీ రామకృష్ణ, ఇరగదిండ్ల మురళీ, దగ్గుపాటి శ్రీనివాసులు, హరిగౌడ్, మాయలూరి రమణ, రమేష్‌గౌడ్, నగేష్ యాదవ్, మేడం శ్రీనివాసులు, ఎం.శివ, పాల శివ, బంగారయ్య, బోయ మల్లికార్జున, నాగేశ్వరగౌడ్ తదితరులు ఉన్నారు.