Share News

కోతలే కోతలు

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:26 AM

మళ్లీ అవే అబద్ధాలు. అభూత కల్పనలు. మాటల గారడీలు. పరదాలు దాటి ఎన్నికల ముందు జనం మధ్యకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ తానొక్కడే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ‘మే 13 కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం.. మీరు

కోతలే కోతలు

ఎమ్మిగనూరు సభలో జగన్‌ అవే అబద్ధాలు

చేయనివీ చేసినట్లుగా కలరింగ్‌

చంద్రబాబు ప్రభుత్వంపై అసత్యాలు

ప్రసంగం మధ్యలోనే జనం బయటకు

కర్నూలు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మళ్లీ అవే అబద్ధాలు. అభూత కల్పనలు. మాటల గారడీలు. పరదాలు దాటి ఎన్నికల ముందు జనం మధ్యకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ తానొక్కడే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ‘మే 13 కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా..?’ అంటూ బస్సుయాత్ర చేపట్టిన జగన్‌.. సంక్షేమ పథకాలపైనా అసత్యాలు చెప్పారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ మైదానంలో జరిగిన ‘సిద్ధం’ సభ జనం లేక వెలవెలబోయింది. జగన్‌ సభా వేదికకు చేరుకోకముందే కొందరు.. ప్రసంగం మొదలవగానే ఇంకొందరు వెళ్లిపోయారు. దాదాపుగా సగానికి పైగా సభా మైదానం ఖాళీగా కనిపించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 21 రోజుల బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు కర్నూలు జిల్లాలో సాగింది. గూడూరు మండలం పెంచికలపాడు నుంచి ఉదయం 11 గంటలకు బస్సు యాత్ర ప్రారంభించారు. జగన్‌ బస్సు యాత్ర ఏ పల్లెకు వెళ్లినా సమస్యలతో జనం ఏకరువు పెట్టారు. మళ్లీ జగన్‌ను సీఎంగా చేసేందుకు తాము సిద్ధంగా లేమంటూ సంకేతాలు ఇచ్చారు.

ప్రసంగమంతా అబద్ధాలే

రైతు భరోసా కింద ఐదేళ్లలో ప్రతి రైతుకు రూ.67,500 ఇచ్చానని జగన్‌ గొప్పగా చెప్పారు. అందులో దాదాపు రూ.30 వేలు కేంద్రం ఇస్తున్న విషయాన్ని దాచిపెట్టారు. చంద్రబాబు సీఎంగా తొలి సంతకం రుణమాఫీ ఫైల్‌ మీద పెడతానని చెప్పి మోసం చేశారని జగన్‌ అన్నారు. అయితే ఒకే విడతలో రూ.50వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేసిన విషయం, విడతల వారీగా రూ.1.50 లక్షలలోపు రుణాలు చంద్రబాబు మాఫీ చేసిన విషయాన్ని దాచిపెట్టారు. సోలార్‌, విండ్‌ పవర్‌ ఉత్పత్తి పెంచి చంద్రబాబు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తే.. అప్పుడు కరెంట్‌ కష్టాలు ఉన్నాయని, తాను వచ్చాకే పగటి పూట కరెంట్‌ ఇస్తున్నానని పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చారు. అవ్వాతాతలకు పెన్షన్‌ చంద్రబాబు రూ.2 వేలకు పెంచితే.. జగన్‌ వచ్చాక విడతల వారీగా రూ.3 వేలకు పెంచిన విషయాన్ని చెప్పకుండా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నానని గొప్పగా చెప్పారు. అందులో రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చే వలంటీర్లను సైతం ఉద్యోగులుగా చిత్రీకరించడం జగన్‌కే చెల్లిందంటూ సభలోని యువత వాపోయారు.

చేనేతల మాటే ఎత్తని జగన్‌

ఎమ్మిగనూరు చేనేతలకు పెట్టని కోట. ఇక్కడ చేనేత సహకార వ్యవస్థను స్థాపించి దివంగత పద్మశ్రీ మాచాని సోమప్ప చేనేత రంగానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చారు. అదే చేనేతలు ఉండే వీవర్స్‌ కాలనీ మైదానంలోనే జగన్‌ ‘మేము సిద్ధం’ సభ పెట్టారు. కానీ చేనేతల అభివృద్ధి, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పలేదు. ఏమి చేయబోతున్నామో హామీ కూడా ఇవ్వలేదు. దీంతో చేనేత కార్మికులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక మాట్లాడుతూ.. ‘చేనేతలకు ఉపాధి కల్పించేందుకు టెక్స్‌టైల్‌ పార్కు ఇవ్వాలి అన్నా’ అని విన్నవిస్తే జగన్‌ కనీసం స్పందించలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో టెక్స్‌టైల్‌ పార్కు కోసం వంద ఎకరాలు కేటాయించగా, జగన్‌ ప్రభుత్వం వచ్చాక రద్దు చేయడమేగాక జగనన్న స్మార్ట్‌సిటీ పేరుతో భూ వ్యాపారానికి తెరతీశారు.

సభ వెలవెల

ఎమ్మిగనూరు ‘సిద్ధం’ సభ ఫ్లాప్‌ షోగా మారింది. లక్ష మందికి పైగా ప్రజలు ఈ సభకు వస్తారని వైసీపీ నాయకులు గొప్పగా చెప్పారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి 1200లకు పైగా ఆర్టీసీ బస్సులను తరలించారు. సభకు వచ్చే వారికి రూ.300, పురుషులకు అదనంగా మందు, బిర్యానీ ఇచ్చారు. అయితే.. మైదానంలో పాతిక వేల మంది కూడా లేరని ప్రభుత్వ నిఘా వర్గాలే వెల్లడించాయి. జగన్‌ ప్రసంగం మొదలు పెట్టేసరికి వెనుకవైపు ఉన్న గ్యాలరీలు ముప్పాతిక శాతం ఖాళీ అయ్యాయి. 6.35 గంటల సమయంలో వేదిక ముందు గ్యాలరీలలో తప్ప వెనుకవైపు ఉన్న గ్యాలరీలు మొత్తం ఖాళీగా కనిపించాయి. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి సిద్ధం సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు.

Updated Date - Mar 30 , 2024 | 06:26 AM