Rainfall Prediction : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
ABN , Publish Date - Dec 09 , 2024 | 05:25 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి స్థిరంగా కొనసాగుతోంది.
11న రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి స్థిరంగా కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండగా, ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. తరువాత కూడా పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈనెల 11వ తేదీనాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో 11వ తేదీన రాయలసీమలో విస్తారంగా, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఆదివారం కోస్తా, రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అన్నదాతలను అప్రమత్తం చేయాలి: కలెక్టర్లకు సీఎం ఆదేశాలు
అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కల్లాల్లో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరి కోతలు వాయిదా వేసుకునేలా అన్నదాతలను అప్రమత్తం చేయాలని ఆదివారం రాత్రి కలెక్టర్లు, జేసీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రైతులు నూర్చిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వరికుప్పలు, ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాల పంపి ణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు రైతులు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని వ్యవసాయశాఖను ఆదేశించారు.