Share News

Andhra Cabinet : కేబినెట్‌లోకి నాగబాబు!

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:06 AM

జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కె.నాగేంద్రబాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు.

Andhra Cabinet : కేబినెట్‌లోకి నాగబాబు!

  • రాజ్యసభ సీటుకు బదులుగా మంత్రి పదవి

  • కూటమి పార్టీల నడుమ అంగీకారం.. సీఎం చంద్రబాబు ప్రకటన

  • ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాల్లో ఒకటి తన అన్నకివ్వాలన్న పవన్‌

  • కృష్ణయ్య, బీదాకు ముందే హామీ ఇచ్చామన్న బీజేపీ, టీడీపీ

  • మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవాలని నిర్ణయం

  • ఎమ్మెల్సీని చేసి ఇస్తారా.. ముందే ఇస్తారా?

అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కె.నాగేంద్రబాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. రాజ్యసభ సీటు వదులుకున్నందుకు ప్రతిగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నిక జరుగనుండగా.. ఒకటి తన అన్న నాగేంద్రబాబుకు ఇవ్వాలని పవన్‌ కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్‌.కృష్ణయ్యకు తాము ముందే హామీ ఇచ్చామని, ఆ సీటు ఇవ్వలేమని బీజేపీ నాయకత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. తెలంగాణలో బీసీ వర్గాలను దరిచేర్చుకోవడానికి కృష్ణయ్య అవసరం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీ కూడా తన కోటా కింద వచ్చిన రెండు రాజ్యసభ సీట్లలో ఒకదానిని.. వైసీపీకి, రాజ్యసభకు రాజీనామా చేసి వచ్చిన బీద మస్తాన్‌రావుకు ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చామని.. రెండోది కాకినాడ జిల్లాకు చెందిన పార్టీ నేత సానా సతీశ్‌కు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. ఈ నేపథ్యంలో నాగబాబుకు రాజ్యసభ సీటు అవకాశం దక్కలేదు.


లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి సీటు జనసేన కోటా కిందకు వచ్చిందని.. అక్కడ నాగబాబును నిలిపాలనుకున్నామని.. కానీ బీజేపీ కోసం త్యాగం చేశామని పవన్‌ కూటమి పార్టీలకు గుర్తుచేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా నాగబాబును రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని కూటమి నిర్ణయించింది. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది. నాగబాబు ప్రస్తుతం శాసనసభలో గానీ, శాసన మండలిలో గానీ సభ్యుడు కాదు. ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రిగా తీసుకోవచ్చు. కానీ ఆరు నెలల్లోపు ఆయన ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాలి. కూటమి సర్కారు వచ్చాక వైౖసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వాటిని మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు ఇంకా ఆమోదించలేదు. అవి ఖాళీ అయితే.. అందులో ఒకటి నాగబాబుకు ఇస్తారు. లేదంటే వచ్చే మార్చిలో మండలిలో కొన్ని ఖాళీలు రానున్నాయి. అప్పుడైనా ఇచ్చే అవకాశం ఉంది. అయితే అంతకుముందే నాగబాబును మంత్రిగా తీసుకుంటారా.. లేక ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

Updated Date - Dec 10 , 2024 | 04:06 AM