Share News

Nara Bhuvaneswari : సీఎం భార్యగా కాదు.. టీడీపీ కార్యకర్తగా కుప్పం వచ్చా!

ABN , Publish Date - Dec 23 , 2024 | 04:01 AM

సీఎం చంద్రబాబు భార్యగా తాను కుప్పం నియోజకవర్గంలో పర్యటించలేదని, టీడీపీ కార్యకర్తగా పార్టీ శ్రేణులతో పాటు..

Nara Bhuvaneswari : సీఎం భార్యగా కాదు.. టీడీపీ కార్యకర్తగా కుప్పం వచ్చా!

  • ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు

  • పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ: భువనేశ్వరి

రామకుప్పం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు భార్యగా తాను కుప్పం నియోజకవర్గంలో పర్యటించలేదని, టీడీపీ కార్యకర్తగా పార్టీ శ్రేణులతో పాటు ప్రజల బాగోగులు తెలుసుకునేందుకే వచ్చానని నారా భువనేశ్వరి చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో ఆమె నాలుగు రోజుల పర్యటన ఆదివారం ముగిసింది. చివరిరోజు రామకుప్పం మండలం చెల్దిగానిపల్లెలో మహిళలు, రైతులతో ఆమె ముఖాముఖి పాల్గొన్నారు. తన కుమారుడు నారా లోకేశ్‌ మంగళగిరి అభివృద్ధిపై దృష్టి సారిస్తుంటే తాను కుప్పం అభివృద్ధికి కట్టుబడ్డానని చెప్పారు. కుప్పంలో జరుగుతున్న అభివృద్ధిని చంద్రబాబు రోజూ తెలుసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడమే కాకుండా, అవసరమైన వారికి ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఆసరా అందిస్తున్నామని ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ అయిన భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా కుట్టు శిక్షణ ఇవ్వడం ఇక్కడి నుంచే ప్రారంభించామని, డీఎస్సీ శిక్షణ కూడా ఇస్తున్నామని, భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షలకూ ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. కుప్పం పర్యటనలో ఆమెకు అడుగడుగునా మహిళలు ఘనస్వాగతం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాలూ ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 23 , 2024 | 04:01 AM