Share News

APPTD: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: పలిశెట్టి దామోదరరావు

ABN , Publish Date - Jul 14 , 2024 | 07:45 PM

ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

APPTD: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: పలిశెట్టి దామోదరరావు

నెల్లూరు: ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. ఏపీలో మెజార్టీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వమే నేడు అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని కోరారు. ఈరోజు(ఆదివారం) నెల్లూరులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ కార్యాలయంలో జిల్లా కమిటీ నిర్మాణ సభ జరిగింది.


ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పలిశెట్టి దామోదరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనంతరం ఈహెచ్‌ఎస్ ప్రవేశపెట్టే వరకు ఆర్టీసీ సంస్థ ద్వారా పొందే రిఫరల్ ఆస్పత్రుల వైద్య సౌకర్యాలను వైసీపీ ప్రభుత్వం అమానుషంగా తొలగించిందని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రతి ఉద్యోగి నుంచి ప్రతినెలా రూ. 225 నుంచి రూ. 300 ల వరకు జీతాల నుంచి రికవరీ చేసిందని తెలిపారు. ఈహెచ్‌ఎస్ (హెల్త్‌స్కీమ్) ద్వారా ఏ ఒక్క ఉద్యోగికి సరైన వైద్య సౌకర్యాలు అందలేదని, దీంతో ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అలాగే విలీనం పేరుతో ఆర్టీసీ ఉద్యోగులకు దశాబ్దాలుగా ఉన్న అలవెన్సులు, ఇన్సెంటివ్ స్కీమ్‌లను జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందని ధ్వజమెత్తారు.


అలాగే ఈ ఐదేళ్లలో కారుణ్య నియామకాలు తప్ప అసలు నియామకాలే జరగలేదని అన్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటనెన్సు సిబ్బంది పోస్టులకు వేలసంఖ్యలో ఖాళీలు ఉన్నాయని ప్రకటించారు. ఈ ఖాళీలను భర్తీచేసి ఆర్టీసీని బలోపేతం చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తారన్న నమ్మకం ఆర్టీసీ ఉద్యోగులకు ఉందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి ముందున్న సౌకర్యాలు అన్ని కల్పించి న్యాయం చేయాలని పలిశెట్టి దామోదరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

palishetti-2.jpg


కొత్త బస్సులు కొనుగోలు చేయాలి: నారాయణరావు

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని విజయవంతం చేసేందుకు ఎంప్లాయీస్ యూనియన్‌ కృషిచేస్తుందని ఈయూ రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి జి.నారాయణరావు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడతో ఆర్టీసీ లాభపడుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ విజయవంతం కావాలంటే ఇప్పుడున్న అరకొర బస్సులతో సాధ్యపడదని కావున కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని నారాయణరావు అన్నారు.


పెండింగ్‌ పదోన్నతలు ఇవ్వాలి: వాకా రమేష్ , దాసరి బాబూసామ్యూల్

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఎప్పటికప్పుడు ఈయూ రాష్ట్ర కమిటీని కలుస్తూ ఉద్యోగులకు రావలసిన 2017 పీఆర్సీ అరియర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా అందరికీ ఇప్పిస్తున్నామని, ఇంకా మిగిలిన చెల్లింపుల కోసం కృషిచేస్తున్నామని నెల్లూరు జోన్ జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు వాకా రమేష్ , దాసరి బాబూసామ్యూల్ అన్నారు. పూర్తిగా చెల్లింపులు జరపాలని, రిటైర్ అయిన ఉద్యోగులకు ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్‌ను, ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నవారికి కూడా వర్తింప జేయాలని కోరారు.

విలీనానికి ముందున్న విద్యార్హతలు, రూల్స్ ప్రకారం అర్హులైన 1940 మందికి పెండింగ్‌లో ఉంచిన పదోన్నతలు ఇవ్వాలని, క్యాడర్ స్ట్రింగ్‌తో హెచ్.ఆర్.ఏలు తగ్గి ఆ ర్థికంగా నష్టపోతున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న 46వ రోజు ఓటీ కోసం, నైట్ హాల్ట్ అలవెన్సులు ఇప్పించడానికి నిరంతరం ఆర్టీసీ హౌస్‌లోఈయూ రాష్ట్రనాయకత్వం అందుబాటులో ఉండి కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఈయూ జిల్లా అధ్యక్షులు వి.ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఓ.వి.ప్రసాద్‌తోపాటు జోన్, జిల్లా నాయకులు జిల్లాలో ఉన్న 6 డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తలు, మహిళలు భారీగా హాజరయ్యారు.


నెల్లూరు జిల్లా ఆర్టీసీ ఈయూ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏపీపీటీడీ(ఆర్టీసీ)ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా వై.యుగంధర్ (రీజనల్ మేనేజర్ ఆఫీసు) జిల్లా కార్యదర్శిగా ఓ.వి.ప్రసాద్ (నెల్లూరు 1 డిపో) వీరితోపాటు మరో 18 మంది సభ్యులను వివిధ హోదాల్లో రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు ఆధ్వర్యంలో ఈరోజు (ఆదివారం) జరిగిన జిల్లా మహాసభలో వీరిని ఎన్నుకున్నారు

Updated Date - Jul 14 , 2024 | 07:53 PM