Share News

AP Politics: పిఠాపురం మనదే.. ఆ రెండే మిగిలాయి..!

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:08 AM

‘పిఠాపురం మనదే. ఈ సీటు గెలిచి చూపించాలి. మూలాలు ఇక్క డే ఉన్నాయి. పిఠాపురం మొదలుకుని అన్నీ గెలుద్దాం. 21 ఎమ్మెల్యే సీట్లతో పాటు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలు గెలిచి తీరాలి

AP Politics: పిఠాపురం మనదే.. ఆ రెండే మిగిలాయి..!
Pawankalyan

  • ఓటేయడం.. ప్రమాణ స్వీకారమే మిగిలింది

  • భీమవరం, గాజువాక, పిఠాపురం.. మూడు కళ్లు

  • నా లాంటి గొంతుక ఉండకూడదని వాళ్లు భావిస్తున్నారు

  • రూ.100-150 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు

  • ఓటుకి రూ.లక్ష ఇచ్చయినా కొనాలని చూస్తున్నారు

  • మీ ఆశీస్సులుంటే మనిషికి లక్ష పంచినా నేనే గెలుస్తా

  • పిఠాపురం నేతలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

  • కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్‌ పేరు ప్రకటన

అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ‘‘పిఠాపురం(Pithapuram) మనదే. ఈ సీటు గెలిచి చూపించాలి. మూలాలు ఇక్క డే ఉన్నాయి. పిఠాపురం మొదలుకుని అన్నీ గెలుద్దాం. 21 ఎమ్మెల్యే సీట్లతో పాటు కాకినాడ(Kakinada), మచిలీపట్నం(Machilipatnam) ఎంపీ స్థానాలు గెలిచి తీరాలి’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawankalyan) అన్నారు. ‘‘మన వరకు పిఠాపురంలో ఎన్నికలు అయిపోయాయి. ఓటు వేయడం, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలింది’’ అని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పిఠాపురం నాయకులతో పవన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పిఠాపురం నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం తనకు ప్రత్యేకమైన నియోజకవర్గమని, రాజకీయం కంటే కూడా నియోజకవర్గంలోని శ్రీపాద శ్రీవల్లభ భక్తుడినని చెప్పారు. ‘‘2009 నుంచి పిఠాపురంలో పోటీ చేయమని చెబుతుండేవారు. అప్పట్లోనే పోటీ చేయాలని ఆలోచించా. ఇప్పుడైనా నా గెలుపు కోసం పిఠాపురం తీసుకోలేదు. కులాల మధ్య ఐక్యత ఉండాలని, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, కులాలన్నింటినీ కలుపుకొని వెళ్లాలని భావించా. ఈ రోజు అది సఫలీకృతం అవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. పిఠాపురం, భీమవరం, గాజువాక నియోజకవర్గాలు తనకు మూడు కళ్లలాంటివని పవన్‌ చెప్పారు.

ఆ భావనే నా హృదయాన్ని తాకింది

‘‘నేను రాష్ట్రం కోసం పని చేస్తుంటే.. నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలని అనుకున్నప్పుడు పిఠాపురం నుంచి వచ్చి మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాదని కొందరు చెప్పారు. ఈ భావనే నా హృదయాన్ని తాకిం ది. పిఠాపురాన్ని వాడుకుని వెళ్లిపోయేలా కాకుండా, నియోజకవర్గాన్ని నేను స్వస్థలం చేసుకుంటా’’ అని పవన్‌ చెప్పారు. ఇంకా పవన్‌ ఏమనానరంటే...

ఓటు అడిగే హక్కు సంపాయించా

2019లో నాకు ఓటేయండని ధాటిగా అడగలేదు. కానీ, ఈ రోజు నాకు ఓట్లేయమని అడిగే హక్కు సంపాదించుకున్నా. దశాబ్ద కాలం పాటు పోరాటాలు చేసి, అందరి కోసం నిలబడి, నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీకి వెన్నంటే ఉన్నా. నేను పిఠాపురంలో ఎవరినో దెబ్బతీయడానికి రాలేదు. నిలబడడానికి వస్తున్నా. ఆ క్రమంలో నన్ను శత్రువుగా భావిస్తే తప్పక యుద్ధం చేస్తా. పిఠాపురాన్ని మోడల్‌ నియోజకవర్గంగా మారుస్తాం. దేశంలో ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉందంటే అది పిఠాపురం అనేలా చేస్తా. నా అభిమాన బలాన్ని పిఠాపురానికి తీసుకువచ్చి కూర్చోబెడతా. జాబ్‌ మెళా, జాబ్‌ క్యాలెండర్స్‌ కోసం ప్రభుత్వంతో పని లేదు. ప్రభుత్వ నిధుల కోసం ఆలోచించకుండా నేనే సొంతగా పనిచేస్తా. పిఠాపురంలో రైతులను కన్నీరు పెట్టనివ్వను. దశాబ్ద కాలం నుంచి నన్ను చూస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించుకుందాం. గెలుపు నా కోసం కాదు. నా పోరాటానికి బలం చేకూర్చేందుకే. ఉపాధి, విద్య, వైద్యంతో పాటు అభివృద్ధి ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తా.

డబ్బు పేరుకుపోయి ఏం చేయాలో తెలీక

నేను ఒక్కసారి పనిచేయడం చూస్తే.. మీరు ఎప్పటికీ నన్ను వదలరు. అందరినీ కలుపుకొని వెళ్లే వ్యక్తిని. సమస్యలను తగ్గించే వ్యక్తినే కానీ, పెంచే వ్యక్తిని కాదు. సమాజాన్ని కలిపే వ్యక్తినే కానీ, విడదీసే వ్యక్తిని కాదు. మీ అందరి సహకారం, దీవెన కావాలి. నోటా ఓట్లు కూడా జనసేనకే పడాలి. సహజ వనరులను దోచుకోకుండా చూస్తా. ఎవరో వచ్చి పిఠాపురాన్ని భయపెడతానంటే అడ్డుపడతా. నన్ను నిలవరించే బాధ్యతను వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తీసుకున్నారని అంటున్నారు. జగన్‌, మిథున్‌పై నాకు వ్యక్తిగత కోపాలు లేవు. నాలాంటి గొంతుక ఉండకూడదనే ఉద్దేశంతో రూ.100 నుంచి రూ.150 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మీ అందరి ఆశీస్సులుంటే మనిషికి లక్ష పంచినా అది పని చేయదు. జనసేన, పవన్‌ కల్యాణ్‌ గెలుస్తారు.

ఆమె మా పార్టీలోకి రావాలని..

ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగ గీత.. 2009లో మన ద్వారానే(ప్రజారాజ్యం) రాజకీయాల్లోకి వచ్చారు. భవిష్యత్తులో ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా. ఎన్డీఏ కూటమిలో అన్ని విషయాలు మాట్లాడతా. ఏ విషయం మాట్లాడినా సాధ్యమైనంత వరకు పని చేస్తా. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే అందరూ నవ్వారు. ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎందుకు సాధ్యపడుతుందో.. ఎలా సాధ్యపడుతుందో అనే వ్యూహం నాకు వదిలేయని చెప్పా. ఈ రోజు చేసి చూపించా. ప్రధానితో సభ కూడా నిర్వహించాం. కేంద్రంలోని పెద్దలు నన్ను ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలని అడిగారు. నాకైతే ఎమ్మెల్యేగానే పని చేయాలని ఉంది. ముందు రాష్ట్రానికి పని చేసి, తర్వాత దేశం కోసం ఆలోచిస్తా.

కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్‌

జనసేనకు కాకినాడ పార్లమెంటు సీటు దక్కిన నేపథ్యంలో ఇక్కడ నుంచి ‘టీ టైమ్‌’ వ్యాపారవేత్త ఉదయ్‌ను బరిలో నిలుపుతున్నామని పవన్‌ చెప్పారు. ‘‘ఉదయ్‌ నా కోసం ఎంతో చేశాడు. అందుకే ఉదయ్‌ని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నా. కాకినాడ పార్లమెంట్‌లో భారీ మెజార్టీతో గెలవాలి. కాకినాడ గంజాయి ప్యారడైజ్‌గా మారిపోయింది. వీటన్నింటినీ నిలువరిచాలంటే ఎంపీగా ఉదయ్‌, ఎమ్మెల్యేగా నేను ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 08:53 AM