Diaphragm Wall : డయాఫ్రం వాల్ నిర్మాణానికి అంతా రెడీ!
ABN , Publish Date - Dec 25 , 2024 | 05:22 AM
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మెయిన్ డ్యాం పనుల నిర్మాణానికి సర్వం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల రెండో తేదీన నూతన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది.

జర్మనీ నుంచి యంత్రసామగ్రిని పోలవరం క్షేత్రానికి రప్పిస్తున్న బావర్
అన్నీ సవ్యంగా జరిగితే 2న పనులకు శ్రీకారం
11న పోలవరానికి పార్లమెంటరీ కమిటీ
అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మెయిన్ డ్యాం పనుల నిర్మాణానికి సర్వం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల రెండో తేదీన నూతన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ఈ సమాచారాన్ని ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర జల సంఘానికి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి తెలియజేసింది. వాల్ నిర్మాణ బాధ్యత జర్మన్ సంస్థ బావర్ చేపడుతోంది. దానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్ తదితర అంశాల్లో బావర్ కోరినంత మేరకే సహకరించాలని ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్‌కు జల సంఘం స్పష్టం చేసింది. బావర్ యంత్రసామగ్రిని జర్మనీ నుంచి ప్రాజెక్టు క్షేత్రానికి తరలిస్తోంది. వాల్ నిర్మాణంలో అత్యంత కీలకమైన ట్రెంచ్ కట్టర్లను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. మంగళవారానికే క్రేన్లు కూడా సిద్ధమయ్యాయి. 28వ తేదీ నాటికి డీ-శాండింగ్ ప్లాంట్, పంపులు, కాంక్రీట్ సామగ్రిని కూడా సమకూర్చుకోనుంది. 30వ తేదీకల్లా లేబొరేటరీని కూడా సంసిద్ధం చేయనుంది. అంతకుముందు రోజే సమగ్ర కార్యాచరణ సమాచారాన్ని జలశక్తి శాఖ, జల సంఘం, పీపీఏలకు జల వనరుల శాఖ అందిస్తుంది. ఈ నివేదికను సంబంధిత కేంద్ర సంస్థలు పురిశీలించి.. 30న డయాఫ్రం వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాయని ఆశిస్తోంది. అన్నీ అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జనవరి 2న వాల్ నిర్మాణ పనులను బావర్ ప్రారంభిస్తుంది. నిర్మాణం 600 మీటర్లకు చేరువ కాగానే.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనులను మేఘా మొదలుపెడుతుంది.
పార్లమెంటరీ కమిటీ పరిశీలన..
డయాఫ్రం వాల్ పనులు జరుగుతున్న సమయంలోనే వచ్చే నెల 11న కేంద్ర జలశక్తి శాఖపై ఏర్పాటై న పార్లమెంటరీ స్థాయీసంఘం ప్రాజెక్టు క్షేత్రానికి రానుంది. ఈ కమిటీలో 25 మంది పార్టమెంటు సభ్యులు, లోక్‌సభ సెక్రటేరియేట్ అధికారులు ఉం టారు. 2021 నుంచి ఈ ప్రాజెక్టు కోసం చేసిన వ్యయాలను, ప్రస్తుతం జరుగుతున్న పనులను కమిటీ పరిశీలిస్తుంది. 2019 నాటికి ప్రాజెక్టు స్థితిగతులు.. జగన్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలు.. భూసేకరణ, సహాయ పునరావాసం కోసం చేసిన ఖర్చు, హెడ్‌వర్క్స్ తదితరాలపై 11, 12 తేదీల్లో సమగ్రంగా అధ్యయనం చేస్తుంది.