Posani : ఇకపై రాజకీయాల మాట్లాడను
ABN , Publish Date - Nov 22 , 2024 | 03:18 AM
ఇకపై రాజకీయాలు మాట్లాడనని, ఏ పార్టీని పొగడనని, విమర్శించనని, ఏ పార్టీకి మద్దతివ్వనని సినీనటుడు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.
ఏ పార్టీనీ పొగడను.. విమర్శించను.. మద్దతివ్వను
రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై
చివరి శ్వాస వరకూ కుటుంబంకోసమే బతుకుతా: పోసాని
అందరికంటే చంద్రబాబునే ఎక్కువగా పొగిడానని వెల్లడి
హైదరాబాద్ సిటీ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఇకపై రాజకీయాలు మాట్లాడనని, ఏ పార్టీని పొగడనని, విమర్శించనని, ఏ పార్టీకి మద్దతివ్వనని సినీనటుడు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెబుతున్నట్లు గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని చెప్పారు. ‘నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్న సమయంలో అందరినీ విమర్శిస్తుంటానని అనుకుంటారు. నాయకుల నీతి, నిజాయితీ, నడవడికను బట్టి కామెంట్స్ చేస్తా తప్ప.. మంచి నాయకుడిని విమర్శించలేదు’ అని పోసాని పేర్కొన్నారు. ‘నాకు ప్రధాని నరేంద్ర మోదీ 35 ఏళ్లుగా తెలుసు. ఆయనను ఎప్పుడూ విమర్శించలేదు. ఆయన జీవితంలో అవినీతి లేదు.. మంత్రి స్థాయి నుంచి ఎదిగి దేశ ప్రధాని అయ్యారు. ఆయన రూ.కోట్ల ఆస్తులు కూడగట్టారని ఎవరైనా అన్నారా? కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి విమర్శలు చేయలేదు. ఇందిరాగాంధీ, నవీన్ పట్నాయక్... ఇలా ఎవరినీ నేను విమర్శించలేదు. చంద్రబాబు, జగన్, రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్.. ఇలా అందరినీ వారి గుణగణాలను చూసి సపోర్ట్ చేశా. తప్పులు చేసిన ప్రతి ఒక్కరినీ విమర్శించా. 1983నుంచి రాజకీయాలపై మాట్లాడుతున్నా.. ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ.. మరో పార్టీని తిట్టను.. ఆయా పార్టీల్లో ఉన్నవాళ్లు తప్పు చేస్తేనే తిట్టాను. ఇకనుంచి నా జీవితకాలం రాజకీయాల గురించి మాట్లాడను. దీనికి కారణం నాపై కేసు పెడుతున్నారని కాదు. 16ఏళ్ల పిల్లల నుంచి 70ఏళ్ల వృద్ధురాలి వరకూ అసభ్య పదజాలంతో తిడుతున్నారు. పదవి కావాలని ఏ పార్టీనీ అడగలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చాలామంది అన్నారు. నేనే వద్దని చెప్పా’ అని పోసాని తెలిపారు.
‘రాజకీయాల్లో నేను ఎక్కువగా పొగిడింది చంద్రబాబునే. ఆ విషయం ఆయననే అడగండి. ఆయన ఓడిపోయిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని ఇంటికి వెళ్లి కలిశా. ‘శ్రావణమాసం’ సినిమా సమయంలో ఆయనకు 100 అడుగుల కటౌట్ కట్టించా. ఆయన చేత్తో రిబ్బన్ కట్‌చేయించా. నన్ను, నా కుమారులను దీవించారు. ఆయన చేసిన మంచి పనులపై లిస్టు రాశా. ఆయన తప్పులను విమర్శించా.. అప్పుడు తంటా వచ్చింది’ అని పోసానితెలిపారు. ‘రాజకీయ నేతలందరికీ నమస్కారం చేస్తున్నా.. ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు.. ఇక ఈ రోజు నుంచి చనిపోయే వరకూ నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే బతుకుతా’ అని చెప్పారు. ‘దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి మాట్లాడను.. చనిపోయేవరకు జగన్‌ను అభిమానిస్తా. ఆయన నన్ను అంతగా ప్రేమించారు. నేను ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకోలేదు. నేను ఓటరులాగే స్పందిస్తా. ఆయన బాగుంటే ఆయనకు, ఈయన బాగుంటే.. ఈయనకు సపోర్ట్ చేస్తా..’ అని పోసాని పేర్కొన్నారు.