రెండో రోజు కోలాహలం
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:18 AM
జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజైన శుక్రవారం 15 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.
పలుచోట్ల టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు
కొండపి, ఎర్రగొండపాలెంలో భారీ ర్యాలీలు, సభలు
సంతనూతలపాడు, గిద్దలూరు, దర్శిలలో సాధారణంగా దాఖలు
మరోసారి భారీ సభలకు ఏర్పాట్లు
ఏడు అసెంబ్లీ స్థానాలకు 15 సెట్లు
ఒంగోలు పార్లమెంట్, కనిగిరి అసెంబ్లీ స్థానాలకు నిల్
జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజైన శుక్రవారం 15 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కువగా పడ్డాయి. ఎర్రగొండపాలెం, కొండపిలలో పార్టీ అభ్యర్థులు ఎరిక్షన్‌బాబు, స్వామిలు వేలాది మంది జనంతో భారీ ర్యాలీలు నిర్వహించి కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సభలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా అటు ఎర్రగొండపాలెం, ఇటు కొండపి జనసంద్రాన్ని తలపించాయి. తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం వెల్లివిరిసింది. అలాగే గిద్దలూరు, దర్శి, ఎస్‌ఎన్‌పాడు అభ్యర్థులు కూడా సాధారణంగా వేశారు. వారు మరోసారి భారీ కార్యక్రమాలతో నామినేషన్ వేయనున్నారు.
ఒంగోలు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజైన శుక్రవారం జిల్లాలో కోలాహలంగా సాగింది. పలుచోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కొండపిలో టీడీపీ కూటమి అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనే యస్వామి, డమ్మీ అభ్యర్థిగా ఆయన సతీమణి రాజేశ్వరిలు నామినేషన్ వేశారు. సంతనూతలపాడు టీడీపీ కూటమి అభ్యర్థి బి.ఎన్.విజయ్‌కుమార్ తరఫున ఆయన సోదరుడు బి.అనిల్‌కుమార్ చీమకుర్తిలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. గిద్దలూరు టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి అక్కడి రిటర్నింగ్ అధికారి వద్ద నామినే షన్ దాఖలు చేశారు. ఎర్రగొండపాలెం టీడీపీ కూటమి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు నామినేషన్‌ను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి అక్కడి రిటర్నింగ్ అధికారికి అందజేశారు. దర్శిలో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తరఫున మాజీ ఎమ్మెల్యే పాపారావు నామినేషన్ దాఖలు చేశారు. సాధారణంగా నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్థులు మరోరోజు భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ర్యాలీలు, సభలు
కొండపి, ఎర్రగొండపాలెంలలో టీడీపీ కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీలు, సభలు నిర్వహించాయి. కొండపి అభ్యర్థి డాక్టర్ స్వామి తొలుత వల్లూరమ్మ దేవస్థానంలో పార్టీ యువనేత దామచర్ల సత్య, సీనియర్ నాయకుడు దామచర్ల పూర్ణచంద్రరావు, ఎంపీ మాగుంట కుమారుడు రాఘవరెడ్డితో కలిసి పూజలు చేశారు. అనంతరం అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కొండపి చేరుకొని అక్కడికి నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది పార్టీ శ్రేణులుతో కలిసి ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. యర్రగొండపాలెంలో ఎరిక్షన్‌బాబు నామినేషన్ కోలాహలంగా సాగింది. నియోజకవర్గంలోని గ్రామగ్రామం నుంచి వేలాదిగా టీడీపీ శ్రేణులు తరలిరాగా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర, ఇతర ముఖ్యనేతలతో కలిసి ఎరిక్షన్‌బాబు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం అందజేశారు. ఆతర్వాత సభ నిర్వహించారు.
వైసీపీ నుంచి ఇద్దరు
కొండపి వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్, గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా కుందురు నాగార్జునరెడ్డి తదితరులు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రెండోరోజు ఒంగోలు పార్లమెంట్‌తోపాటు కనిగిరి అసెంబ్లీ స్థానానికి ఎవరూ నామినేషన్ వేయలేదు. మిగిలిన ఏడు అసెంబ్లీ స్థానాలకు 15మంది 15 సెట్లు దాఖలు చేశారు. అందులో ఒంగోలులో మూడు, గిద్దలూరులో నలుగురు అభ్యర్థులు ఐదు సెట్లు, వైపాలెంలో ఒక అభ్యర్థి రెండు సెట్లు, సంత నూతలపాడు, దర్శి, మార్కాపురంలో ఒక్కొక్కటి, కొండపిలో మూడు ఉన్నాయి.