Janasena Leaders: పుంగనూరులో నిరసన సెగ పెద్దిరెడ్డీ ‘గోబ్యాక్’
ABN , Publish Date - Jun 16 , 2024 | 05:23 AM
వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం దద్దరిల్లింది. వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి ఆయన వ స్తున్నారన్న సమాచారంతో టీడీపీ, జనసేన శ్రేణులు పెద్దఎత్తున నిరసనకు దిగాయి.
పుంగనూరు, జూన్ 15: వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం దద్దరిల్లింది. వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి ఆయన వ స్తున్నారన్న సమాచారంతో టీడీపీ, జనసేన శ్రేణులు పెద్దఎత్తున నిరసనకు దిగాయి. గత ఐదేళ్లలో ఆయన చేసిన అరాచకాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. ‘పెద్దిరెడ్డీ గో బ్యాక్’ అంటూ కార్యకర్తలు నినదించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పుంగనూరుకు వస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రోడ్డుపై బైఠాయుంచి ధర్నా చేశారు. ర్యాలీ చేశారు. ఆ సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు గోపి యాదవ్‌కు దేహశుద్ధి చేశారు. ర్యాలీ వైసీపీ నాయకుడు వెంకటరెడ్డి యాదవ్ ఇంటివద్దకు రాగానే కేకలు వేస్తూ రాళ్లు విసిరారు. కొందరు నేతలు శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఆవేశంతో ఉన్న కార్యకర్తలు... ‘వైసీపీ ప్రభుత్వంలో మాపై తప్పుడు కేసులు బనాయించారు.
కుటుంబాలను రోడ్డున పడేశారు’ అంటూ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈడిగపల్లె వద్ద ఎదురుపడ్డ మాజీ ఎంపీపీ నరసింహులుపై టీడీపీ శ్రేణులు దాడి చేయబోగా పార్టీ నేత మాధవరెడ్డి వారించారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా బూతులు మాట్లాడటంతో నిరసనకు దిగాల్సి వచ్చిందని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘మా ఎమ్మెల్యే వస్తున్నారు, ధైర్యం ఉంటే రోడ్డుపైకి రావాలి’ అంటూ వారు బహిరంగ సవాలు విసరడంతో రావాల్సి వ చ్చిందని తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసుల సూచనమేరకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నారు. అలాగే పుంగనూరు, మదనపల్లెకు రావాల్సిన ఎంపీ మిథున్‌రెడ్డి తిరుపతి నుంచి నేరుగా మదనపల్లె వెళ్లారు.