టార్చర్ కుట్ర వెనుక ఎవరున్నారో త్వరలో బయటపడుతుంది: రఘురామరాజు
ABN , Publish Date - Nov 29 , 2024 | 05:22 AM
తనను టార్చర్ చేసిన కుట్ర వెనుక ఎవరున్నారనేది త్వరలో బయటపడుతుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.
రేణిగుంట, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): తనను టార్చర్ చేసిన కుట్ర వెనుక ఎవరున్నారనేది త్వరలో బయటపడుతుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలకు హాజరయ్యేందుకు గురువారం వచ్చిన ఆయన తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు దుబాయిలో వ్యాపారాలున్నాయని, ఆయన కుల ధ్రువీకరణ పత్రంపైనా అనుమానం ఉందని తెలిపారు. తనను టార్చర్ చేసిన విషయంలో మరికొంత మంది అధికారులు కూడా అరెస్టయ్యే అవకాశముందని చెప్పారు. తన రిమాండ్ రిపోర్టులో సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. తనను చిత్ర హింసలకు గురి చేసిన సందర్భంలో సునీల్ కుమార్ కాకుండా ఆయన కలెక్షన్ ఏజెంట్లు ముఖానికి ముసుగులు తొడుకున్నారని, ప్రభుత్వం మారాక వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా ఆయన తన కలెక్షన్ ఏజెంట్లను వాడుకున్నారని రఘురామ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు విచారణ పట్ల సంతృప్తిగా ఉందన్నారు.