Share News

‘సరస్వతి’కి ‘భూ’కంపం!

ABN , Publish Date - Oct 28 , 2024 | 05:13 AM

సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కోసం వైఎస్‌ కుటుంబం రైతులు, ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్న భూముల వ్యవహారం వివాదంగా మారింది.

‘సరస్వతి’కి ‘భూ’కంపం!

కంపెనీ కోసం వైఎస్‌ కుటుంబం తీసుకున్న

భూములు తిరిగి ఇచ్చేయాలని రైతుల పట్టు

లేదా.. ఎకరాకు రూ.18 లక్షలివ్వాలని డిమాండ్‌

మాకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు

మా భూములు ఇచ్చేస్తే సాగు చేసుకుంటాం

కాకుంటే పరిశ్రమ నిర్మించి ఉపాధి కల్పించాలి

మీడియాతో సరస్వతి భూ బాధితుల ఆవేదన

మాచవరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కోసం వైఎస్‌ కుటుంబం రైతులు, ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్న భూముల వ్యవహారం వివాదంగా మారింది. 15 ఏళ్ల కిందట తమ నుంచి కొనుగోలు చేసిన భూముల్లో సిమెంటు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారని, అదేవిధంగా తమకు ఉపాధి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారని ‘సరస్వతి’ కోసం భూములు ఇచ్చిన పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన చెబుతున్నారు. కానీ, ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు చేయకపోగా, తమకు ఉపాధి కూడా కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ భూములు తమకు ఇచ్చేయాలని వారు పట్టుబడుతున్నారు. లేకపోతే.. ప్రస్తుత ధర ప్రకారం ఎకరానికి రూ.18 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఉంటే తక్షణమే పరిశ్రమ ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆదివారం భూములు ఇచ్చిన రైతులు, స్థానికులు మీడియాతో మాట్లాడారు. ‘‘మీ గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తాం. అర్హతలు ఉన్న వారికి పరిశ్రమలో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అని అనేక హామీలు ఇచ్చారు. 15 ఏళ్ల కిందట అతి తక్కువ ధరలకే మా నుంచి భూములు కొనుగోలు చేశారు. కానీ, ఇప్పటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు’’ అని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ భూములు తిరిగి తమకు అప్పగించాలని కోరారు. భూములు కొని సుమారు 15 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్నారు. కానీ, అప్పట్లో రెండు మూడేళ్లలోనే నిర్మాణం చేపడతామని నమ్మబలికారని తెలిపారు. పరిశ్రమను నిర్మిస్తే తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు వస్తాయని, తమకు ఉపాధి దొరుకుతుందని, గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశపడి తక్కువ ధరలకే భూములు ఇచ్చినట్టు చెప్పారు. పరిశ్రమ నిర్మాణం గురించి అడిగితే చూస్తాం, చేస్తాం అని చెప్పటమే కానీ.. నిర్మించింది లేదన్నారు. పరిశ్రమను నిర్మించే వరకు ఎవరి భూములు వారు సాగు చేసుకుంటామని, నిర్మాణం మొదలు పెట్టగానే ఇచ్చేస్తామని తాము చెప్పినా యాజమాన్యం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


పొలాల విధ్వంసం

పరిశ్రమను నిర్మించకపోవడంతో కొంత మంది రైతులు ఉపాధి అవకాశాలు దొరక్క ‘సరస్వతి’కి ఇచ్చిన భూముల్లో పంటలు సాగు చేశారు. ఇది గమనించిన వైసీపీ నాయకుడు, అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో కడప గూండాలు సుమారు ఐదు వందల మంది ట్రాక్టర్లతో వచ్చి పచ్చని పంట పొలాలను దున్నేసి విధ్వంసం సృష్టించినట్టు రైతులు తెలిపారు. అడ్డు వచ్చిన మహిళా రైతులను విచక్షణా రహితంగా కొట్టి గాయ పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలుసుకున్న టీడీపీ నేత, గురజాల ప్రస్తుత ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను, జిల్లా అధికారులను పిలిపించి నష్టపోయిన రైతులను గుర్తించారు. ఒక్కొక్క ఎకరానికి రూ.16 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అయితే, రెండు మూడు రోజులుగా వైసీపీ అధినేత జగన్‌, ఆయన చెల్లెలు వైఎస్‌ షర్మిల మధ్య సరస్వతి భూముల వ్యవహారంలో విభేదాలు బట్టబయలు కావటంతో ఇక పరిశ్రమ నిర్మాణం చేపట్టరని తేలిపోయినట్టు బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో తమకు ఆ భూములను తిరిగి ఇస్తే సాగు చేసుకుంటామని చెబుతున్నారు. లేని పక్షంలో ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.

సాగు చేసుకుంటాం.. అవకాశం ఇవ్వండి

సరస్వతి పరిశ్రమ నిర్మాణం చేపట్టే వరకు మా భూములు సాగు చేసుకొనే అవకాశం కల్పించాలి. భూములు కొనుగోలు చేసి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం చేపట్టలేదు. భూములన్నీ బీడుగా మారాయి. సరస్వతి యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి గ్రామస్తులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి.

- బొగ్గవరపు అంజయ్య, మాజీ సర్పంచ్‌

ఆస్తుల కోసమే భూములు కొన్నారు

పరిశ్రమ నిర్మించి మమ్మల్ని ఉద్ధరిస్తామని నమ్మబలికిన యాజమాన్యం.. ఆస్తులు కూడ బెట్టుకునేందుకే భూములు కొనుగోలు చేశారని అర్ధమవుతోంది. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గత వైసీపీ ప్రభుత్వంలో నన్ను అర్ధరాత్రి కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. పరిశ్రమ నిర్మించ కుంటే జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.

- యలమంద నాయక్‌, మార్కెట్‌ యార్డు మాజీ డైరెక్టర్‌

Updated Date - Oct 28 , 2024 | 05:13 AM