Share News

సీక్రెట్‌ ఆపరేషన్‌.. సీక్రెట్‌ ఫండ్‌

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:43 AM

‘ఎంత కరుడుగట్టిన, తెలివైన నేరస్తుడైనా ఎక్కడో చిన్న తప్పు చేస్తాడు. మాకు దొరికిపోతాడు’.. ఇది పోలీసులు చెప్పే కొటేషన్‌. ‘

సీక్రెట్‌ ఆపరేషన్‌.. సీక్రెట్‌ ఫండ్‌

  • అడ్డంగా బుక్కైన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు

  • విశాల్‌ గున్నీ స్టేట్‌మెంట్‌తో మెడకు ఉచ్చు

  • జెత్వానీపై విద్యాసాగర్‌ ఫిర్యాదుకు ముందే అరెస్ట్‌ చేయడానికి విమాన టికెట్లు బుక్‌

  • ఇంటెలిజెన్స్‌ సీక్రెట్‌ ఫండ్‌ నుంచి ఖర్చు

  • డీజీపీ అనుమతి లేకుండానే ముంబైకి

  • చిక్కుల్లో పీఎస్‌ఆర్‌, గున్నీ, కాంతిరాణా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఎంత కరుడుగట్టిన, తెలివైన నేరస్తుడైనా ఎక్కడో చిన్న తప్పు చేస్తాడు. మాకు దొరికిపోతాడు’.. ఇది పోలీసులు చెప్పే కొటేషన్‌. ‘ఎంత రాటుదేలిన పోలీసైనా ఆరాటం ఎక్కువై ఎక్కడో ఏదో పొరపాటు చేస్తాడు. అడ్డంగా దొరికి పోతాడు’.. ఇది ఇప్పటి సీన్‌. ఒక సినీ నటిని అక్రమంగా నిర్బంధించారనే అభియోగాలతో ఒక డీజీ ర్యాంకు అధికారి, మరో ఐజీ ర్యాంకు అధికారి, డీఐజీ స్థాయి అధికారి సస్పెండయ్యారు. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు చేతికి మట్టి అంటకుండా చేయడంలో పోలీసుల్ని మించిన వారెవ్వరూ ఉండరు. అందులోనూ ఇలాంటి విషయాల్లో పీహెచ్‌డీ చేసిన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు లాంటి వ్యక్తి ఎలా అడ్డంగా దొరికిపోయారో? ఇది పోలీసు అధికారుల్ని వేధిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం చాలా సింపుల్‌.

ఎంతటి తెలివైన పీఎస్‌ర్‌ అయినా ఎక్కడో తప్పు చేయకపోరు. ఆ తప్పే ఈ ముగ్గురినీ కాటేసింది. ముంబై నటి జెత్వానీపై వైసీపీ నేత విద్యాసాగర్‌ ఫిర్యాదు ఇవ్వడానికి కొన్ని గంటల ముందే ఆమెను పట్టుకురావడానికి విశాల్‌ గున్నీ మరో ముగ్గురు పోలీసులు ముంబైకి విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే.. ‘దీన్ని మేం ఎగ్జామిన్‌ చేయాలి.. ఆరోపణలు నిర్ధారించుకోవాలి.. నోటీసులు ఇవ్వాలి’ అంటూ సతాయించే పోలీసులు ఫిర్యాదుకు ముందే ముంబైకి వెళ్లేందుకు ఎలా సిద్ధమయ్యారు? రేపు ఫిర్యాదు ఇస్తారని ఇవాళే ఎలా పసిగట్టారు? అనే ప్రశ్న దగ్గరే కీలక వ్యవహరమంతా ముడిపడింది.


విశాల్‌ గున్నీ తన అధికార విధుల్లో భాగంగా ముంబైకి వెళితే ముందుగా డీజీపీ అనుమతి తీసుకోవాలి. తిరిగి వచ్చాక టీఏ, డీఏ క్లెయిమ్‌ చేయాలి. కానీ ఇంతవరకూ ఆయన బిల్లు పెట్టలేదు. ఆరా తీస్తే తెలిసిందేంటంటే.. ఆ టికెట్‌ అధికారికంగా బుక్‌ కాలేదు. ఒక ఐపీఎస్‌ బయటి ప్రాంతాలకు వెళ్లాలంటే ముందుగా ఉన్నతాధికారులు ఆయనకు అనుమతి పత్రం జారీ చేయాలి. దాన్ని పోలీసు పరిభాషలో పాస్‌పోర్టు అంటారు. ఈయన విషయంలో అది కూడా లేదు. రానూ పోనూ ప్రయాణ టికెట్లను తన సొంత డబ్బు నుంచి ఖర్చు చేసినప్పటికీ తిరిగి వచ్చాక బిల్లు క్లెయిమ్‌ చేయాలి. కానీ ఆయన వైపు నుంచి ఇలాంటివి ఏమీ జరగలేదు. దానికి కారణమే పీఎస్‌ఆర్‌ను దోషిగా నిలబెట్టింది. సాధారణంగా జిల్లా ఎస్పీ, నగర సీపీ స్థాయి యూనిట్‌ అధికారుల వద్ద రహస్య ఫండ్‌ ఉంటుంది.ఇలాంటిదే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వద్ద కూడా ఉంటుంది.


నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని అందించిన వారికి ఈ ఫండ్‌ నుంచే డబ్బులు చెల్లిస్తారు. దీనికి ఎవ్వరూ లెక్క అడగరు. బిల్లులు ఉండవు. విశాల్‌ గున్నీ టికెట్‌ సీపీ కార్యాలయం నిధుల నుంచి బుక్‌ కాలేదు. అది పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చీఫ్‌గా ఉన్న ఇంటెలిజెన్స్‌ సీక్రెట్‌ ఫండ్‌ నుంచి ఖర్చు చేశారు. ఒక అధికారి తన అధికార విధుల్లో భాగంగా వెళుతున్నప్పుడు సీక్రెట్‌ ఫండ్‌ ఎందుకు వినియోగించారు? అంటే.. ఇదంతా సీక్రెట్‌ ఆపరేషనేనా అనే కోణంలో ఆరా తీస్తే మొత్తం డొంక కదిలింది.


‘అసలు నిన్ను ముంబై ఎవరు వెళ్లమన్నారు.. టికెట్‌కు డబ్బులు ఎవరిచ్చారు.. నువ్వెందుకు క్లెయిమ్‌ చేయలేదు’ అని ఉన్నతాధికారులు విచారిస్తే జరిగిన కథంతా గున్నీ విడమరిచి చెప్పారని తెలిసింది. దీంతోపాటు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు జనవరి 31నుంచి తనను ఎలా ఉపయోగించుకున్నదీ లిఖిత పూర్వకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇదే ఇప్పుడు పీఎస్‌ఆర్‌ మెడకు చుట్టుకుంది. ఆయన ప్రియ శిష్యుడు, ఈ ఎపిసోడ్‌లో కీలక పాత్రధారి అయిన కాంతి రాణా తాతా కూడా చిక్కుల్లో పడ్డారు.

Updated Date - Sep 16 , 2024 | 08:05 AM