Share News

జగన్‌ చేష్టలతోనే ఇంతటి విపత్తు

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:20 AM

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ చేష్టల వల్లే విజయవాడ నగరం ఇప్పుడు ఇంత విపత్తు ఎదుర్కొంటోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జగన్‌ చేష్టలతోనే ఇంతటి విపత్తు

  • సొంత పేపర్లో బుద్ధిలేని రాతలు నాడే బుడమేరు గండ్లు పూడిస్తే సమస్య వచ్చేది కాదు

  • ఐదేళ్లూ నిద్రపోయి ఇప్పుడు మాపై విమర్శలా?

  • బురదలో మేం పనిచేస్తుంటే.. ఒడ్డున ఉండి రాళ్లేస్తారా?

  • బాధితుల కోసం పనిచేయాలా.. దుష్ప్రచారాలు తిప్పికొట్టాలా?

  • కట్టలు తవ్వి మట్టి అమ్ముకున్నవాళ్లను వదలం: ముఖ్యమంత్రి

  • 32కు చేరిన వరద మృతులు

అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): బుడమేరుకు పడిన గండ్లను చూసి వదిలేయకుండా గత వైసీపీ ప్రభుత్వం పూడ్చి ఉండి ఉంటే విజయవాడలో ఇప్పుడు ఇంత ముంపు ఉండేది కాదని, అప్పుడు పడుకొని నిద్రపోయి ఇప్పుడు లేచివచ్చి రాళ్లు విసురుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పత్రికలో బుద్ధిలేని రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. బుధవారం విజయవాడ కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మారుమూలన ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా సాయం అందాలని మేం నిద్రాహారాలు మాని తిప్పలు పడుతున్నాం. సీఎస్‌ సహా ఉన్నతాధికారులంతా బురదలో దిగి పనిచేస్తున్నారు. వీళ్లు మాత్రం ప్రజలను రెచ్చగొట్టడానికి సమస్త మార్గాలు వెతుకుతున్నారు. సొంత పత్రికలో జగన్‌ అడ్డగోలుగా రాయిస్తున్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశారు? గాడిదలు కాశారా? మేంవచ్చి కేవలం 80రోజులైంది. బుడమేరుకు ఎప్పుడో గండ్లు పడి ఉన్నా పట్టించుకోలేదు. అడ్డగోలుగా కట్టలను ఆక్రమించేశారు. ప్లాట్లు చేసి అమ్ముకొన్నారు. మేం పడుతున్న కష్టాన్ని ప్రజలంతా గుర్తిస్తున్నారు. ఒకరిద్దరు దుర్మార్గులు మాత్రమే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

అమరావతిలోకి చుక్కనీరు రాలేదు

‘‘అధికారంలో ఉండి తప్పులు చేసిన వారు మౌనంగా ఉంటే అదొక పద్ధతి. కానీ ఎదురుదాడికి దిగితే సహించబోం. అహంభావం ప్రదర్శిస్తే ఏం చేయాలో అది చేస్తాం. ఒక వ్యక్తి అసమర్థతకు ఇన్ని లక్షలమంది బాధపడాల్సి రావడం దారుణం. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈ రాక్షస మూక నానారకాల ప్రచారాలతో ప్రజలను ఆందోళనకు గురిచేయాలని చూస్తోంది. నా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు గేట్లు ఎత్తానని మాట్లాడుతున్నారు. నా ఇల్లు ఎక్కడ ఉంది? బుడమేరు ఎక్కడ ఉంది? ఏమిటీ పైశాచిక ఆనందం? దీనిపై క్షమాపణ చెప్పేవరకూ వదిలిపెట్టను. అమరావతిలోకి చుక్క నీరు రాలేదు. వస్తే ఫొటోలు చూపించండి. కరకట్ట పక్కన అందరి ఇళ్లలోకి నీళ్లు వస్తే నా ఇంట్లోకి కూడా వస్తాయి. అదేమీ నా సొంత ఇల్లు కాదు. అద్దె ఇల్లు. నాకేమీ ప్యాలె్‌సలు లేవు. నేను నా ఇంటి విషయం వదిలేసి ప్రజల విషయం చూసుకొంటున్నాను. ఇక్కడ ఏడు లక్షల మందికి మేం సర్వీసు చేస్తున్నాం. అమరావతి ప్రాంతాన్ని శ్మశానం అంటూ శాపనార్థాలు పెట్టారు. ఆ శ్మశానంలోనే వీరిని పూడ్చాలి. ఈ తరహా ప్రచారాలు చేసే రాక్షసులను సంఘ బహిష్కరణ చేయాలి. మేం ప్రజల కోసం పనిచేయాలో లేక వీరి ప్రచారాలు తిప్పికొడుతూ కూర్చోవాలో అర్థం కావడం లేదు’’

jl..jpg

‘‘కృష్ణా వరదల కన్నా బుడమేరు వరదల వల్లే విజయవాడ నగరానికి ఎక్కువ నష్టం వాటిల్లింది. బుడమేరు....విజయవాడకు పెద్ద సమస్య. అక్కడ 11వేల క్యూసెక్కులు వెళ్లడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు 70 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రవాహ మార్గం కూడా ఆక్రమణలతో కుంచించుకొని పోయింది’’ అని చంద్రబాబు వివరించారు.

‘‘ఒక వ్యక్తి చేష్టలకు విజయవాడ నగరం మొత్తం గజగజ వణకాల్సివచ్చింది. బుడమేరుకు వచ్చిన వరదలో కొంత భాగం పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోకి వెళ్లాలి. పోలవరం కాల్వ గట్లకు ఉన్న మట్టిని కూడా ఈ పెద్ద మనుషులు తవ్వుకొని అమ్ముకొన్నారు. కట్టలను తవ్వి మట్టి అమ్ముకొంటే కాల్వలు నిలుస్తాయా? వరదల సమయంలో తట్టుకొంటాయా? ఈ పని చేసిన దుర్మార్గులను వదిలిపెట్టం. మట్టిని తవ్వుకొన్నవారిని గుర్తించి చట్టం ముందు నిలబెడతాం’’

- సీఎం చంద్రబాబు

Updated Date - Sep 05 , 2024 | 07:02 AM