Share News

నేవీలోకి ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌

ABN , Publish Date - Aug 30 , 2024 | 03:00 AM

భారత నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఏ దేశమైనా అణ్వస్ర్తాలతో దాడి చేస్తే మూడో కంటికి తెలియకుండా వారిపై విరుచుకుపడే శక్తి కలిగిన అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌’ నౌకాదళంలో చేరింది.

నేవీలోకి ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌

  • నౌకాదళానికి అప్పగించిన

  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

  • రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు

  • అణ్వస్ర్తాల దాడుల నుంచి భారత్‌కు రక్షణ

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): భారత నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఏ దేశమైనా అణ్వస్ర్తాలతో దాడి చేస్తే మూడో కంటికి తెలియకుండా వారిపై విరుచుకుపడే శక్తి కలిగిన అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌’ నౌకాదళంలో చేరింది. విశాఖపట్నం నేవల్‌ బేస్‌లో గురువారం అత్యంత రహస్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాస్తవానికి దీన్ని సెప్టెంబరులో ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా జాతికి అంకితం చేస్తారనే ప్రచారం జరిగింది. దానికి భిన్నంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్వదేశీయంగా రూపొందించిన రెండో అణు జలాంతర్గామి ఇది. దీన్నే నేవీ ‘సెకండ్‌ స్ట్రయక్‌’ సామర్థ్యంగా అభివర్ణిస్తోంది. అయితే ఎవరిపైనా ముందుగా అణ్వాయుధం ప్రయోగించకూడదనేది భారత్‌ పెట్టుకున్న నిబంధన.


  • రెండు అందుబాటులోకి..

  • మరో రెండు నిర్మాణంలో..

రెండు దశాబ్దాల క్రితమే నేవీ అణు జలాంతర్గాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విశాఖపట్నంలోని నేవీ షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో డీఆర్‌డీవో సాయంతో వీటి నిర్మాణం ప్రారంభమైంది. తొలుత రూపుదిద్దుకున్న ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ 2016లో నేవీలో చేరింది. ఆ మరుసటి ఏడాదే రెండోదైన అరిఘాత్‌ పరీక్షలకు సిద్ధమైంది. అన్నీ పూర్తయిన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతులు మీదుగా గురువారం దీన్ని నౌకాదళానికి అప్పగించారు. ఎస్‌ఎ్‌సబీఎన్‌ ప్రాజెక్టు పేరుతో నాలుగు అణు జలాంతర్గాముల నిర్మాణానికి నేవీ నడుం కట్టగా.. ఇప్పటికి రెండు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. యుద్ధ నౌకలు, విమానాలు, విమాన వాహక నౌకలు ఏదో ఒక నౌకాదళం కేంద్ర ంగా చేసుకొని పనిచేస్తాయి. ఈ అణు జలాంతర్గాములు మాత్రం ప్రధాని ఆధ్వర్యంలో నడిచే ‘స్పెషల్‌ స్ట్రాటజిక్‌ ఫోర్స్‌’ నేతృత్వంలో పనిచేస్తాయి. ఇవి ఎప్పుడు... ఎక్కడ ఉంటాయో ఎవరికీ తెలియదు. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో పహారా కాస్తుందని విశ్వసనీయ సమాచారం.


  • అరిహంత్‌ కంటే అరిఘాత్‌ మెరుగైనది: రాజ్‌నాథ్‌

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ కంటే అరిఘాత్‌ మరింత శక్తివంతమైనదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అణ్వాయుధాల విషయంలో అగ్రరాజ్యాలతో భారత్‌ సమానంగా నిలుస్తుందని, శాంతి స్థాపనకు, వ్యూహాత్మక ప్రయోజనాలకు ఇది దోహదపడుతుందని అన్నారు. అరిఘాత్‌ నిర్మాణంలో భారత నౌకాదళం, డీఆర్‌డీవో సమన్వయంతో పనిచేశాయని ప్రశంసించారు. దీని ద్వారా దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం లభించిందన్నారు. కార్యక్రమంలో నేవీ ఉన్నతాధికారులు, డీఆర్‌డీజడ, ఎన్‌ఎ్‌సటీఎల్‌ అధికారులు పాల్గొన్నారు.


  • ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ విశేషాలు

బరువు : 6వేల టన్నులు

పొడవు : 111.6 మీటర్లు

వెడల్పు : 11 మీటర్లు

డ్రాఫ్ట్‌ (లోతు): 9.5 మీటర్లు

వేగం : సముద్ర ఉపరితలంలో గంటకు 22 నుంచి 28 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. సముద్ర గర్భంలో గంటకు 44 కి.మీ. వేగంతో వెళ్తుంది.

ఇతర ప్రత్యేకతలు : దీనిలోని కె-15 బాలిస్టిక్‌ క్షిపణులు 750 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలవు. ఇలాంటివి ఒకేసారి 12 మిస్సైళ్లను మోసుకుపోగల సామర్థ్యం అరిఘాత్‌కు ఉంది. దీనిలో కె-4 క్షిపణులు కూడా నాలుగు ఉంటాయి.

Updated Date - Aug 30 , 2024 | 07:20 AM