Share News

Vizag Drugs Case: ఢిల్లీ నుంచే ‘ఆపరేషన్‌ గరుడ’!

ABN , Publish Date - Apr 11 , 2024 | 09:41 AM

Vizag Drugs Case: విశాఖ తీరంలో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసులో సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. బ్రెజిల్‌ నుంచి షిప్‌ కంటెయినర్‌ ద్వారా విశాఖపట్నం పోర్టుకు దిగుమతి అయిన డ్రగ్స్‌ మూలాలు తెలుసుకోవడానికి ఒక బృందాన్ని బ్రెజిల్‌కు పంపినట్టు సమాచారం. విశాఖకు చెందిన ‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ’ 25 వేల కిలోల ఇన్‌యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌ను ఆర్డర్‌ పెట్టగా... అది బ్రెజిల్‌ నుంచి మార్చి 16న విశాఖ పోర్టుకు చేరుకుంది.

Vizag Drugs Case: ఢిల్లీ నుంచే ‘ఆపరేషన్‌ గరుడ’!

  • విశాఖ డ్రగ్స్‌ కేసుపై చురుగ్గా సీబీఐ దర్యాప్తు

  • ఒక బృందాన్ని బ్రెజిల్‌కు పంపి విచారణ


విశాఖపట్నం–ఆంధ్రజ్యోతి :

విశాఖ తీరంలో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసులో సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. బ్రెజిల్‌ నుంచి షిప్‌ కంటెయినర్‌ ద్వారా విశాఖపట్నం పోర్టుకు దిగుమతి అయిన డ్రగ్స్‌ మూలాలు తెలుసుకోవడానికి ఒక బృందాన్ని బ్రెజిల్‌కు పంపినట్టు సమాచారం. విశాఖకు చెందిన ‘సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ’ 25 వేల కిలోల ఇన్‌యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌ను ఆర్డర్‌ పెట్టగా.. అది బ్రెజిల్‌ నుంచి మార్చి 16న విశాఖ పోర్టుకు చేరుకుంది. ఇంటర్‌పోల్‌ సమాచారంతో ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు కంటెయినర్‌ను తెరిచి అందులోని సరకును పరిశీలించారు. ఈ క్రమంలో వాటిలో కొన్ని సంచుల్లోని నమూనాలను పరీక్షించగా అందులో కొకైన్‌ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. దాంతో అధికారులు మరుసటిరోజు మళ్లీ అదే ప్రాంగణానికి వెళ్లి మిగిలిన సంచుల నుంచి కూడా నమూనాలు సేకరించి సెంట్రల్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ లేబొరేటరీకి పంపించారు. తర్వాత ఆ వెయ్యి బ్యాగులను వేరే కంటెయినర్‌లోకి మార్చి, దానికి సీల్‌ వేసి వీసీటీపీఎల్‌లోనే పక్కన పెట్టారు.

ఆ కంటెయినర్‌, అందులోని 25 వేల కిలోల ఇన్‌యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌ ఇప్పటికీ అక్కడే ఉంది. సుమారు నాలుగు రోజులు నమూనాలు, సాక్ష్యాల సేకరణ, దిగుమతిదారుల నుంచి వాంగ్మూలం నమోదు వంటి ప్రక్రియలు చేపట్టిన సీబీఐ అధికారులు ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ కేసుని అక్కడి నుంచే దర్యాప్తు చేస్తున్నారు. సంధ్యా ఆక్వా సంస్థ ప్రతినిధులను విచారణకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వారి కాల్‌డేటాతోపాటు వీసీటీపీఎల్‌ నుంచి ఇన్‌యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌ దిగుమతిదారుల డేటాను కూడా తీసుకున్నారు. సంధ్యా ఆక్వా సంస్థ.. బ్రెజిల్‌ నుంచి ఆ సరుకును దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారని పోర్టు అధికారుల ద్వారా ధ్రువీకరించుకున్నారు. అయితే డ్రై ఈస్ట్‌లో ఈ డ్రగ్స్‌ను ఎక్కడ కలిపారు..?, ఎంత మొత్తంలో కలిపారు..?, ఇందులో అంతర్జాతీయ క్రిమినల్‌ ముఠాల ప్రమేయం ఉందా...? ఏపీలో ఎవరికి సంబంధాలు ఉన్నాయి..? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. లేబొరేటరీకి పంపిన నమూనాల ఫలితాలు వచ్చాక అందులో ఎంత మొత్తంలో డ్రగ్స్‌ ఉన్నదీ తేలితే కేసు మరింత ముందుకెళ్తుందని భావిస్తున్నారు.

Updated Date - Apr 11 , 2024 | 11:58 AM