నిధులు మంజూరయ్యేనా? | Will funds be sanctioned?
Share News

నిధులు మంజూరయ్యేనా?

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:25 AM

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడిమాంబ సిరిమానోత్సవానికి సమయం ఆసన్నమైంది. వచ్చే నెలలో జరిగే ఈ ఉత్సవాన్ని రాష్ట్రస్థాయి ఉత్సవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

 నిధులు మంజూరయ్యేనా?
పైడితల్లమ్మ ఆలయానికి రంగులు వేస్తున్న దృశ్యం

- పైడిమాంబ సిరిమాను, విజయనగరం ఉత్సవాలకు రూ.2కోట్లతో ప్రతిపాదనలు

- గత ఐదేళ్లూ రూపాయి విదల్చని వైసీపీ సర్కారు

- కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న అధికారులు

- సిరిమానోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు

విజయనగరం (ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడిమాంబ సిరిమానోత్సవానికి సమయం ఆసన్నమైంది. వచ్చే నెలలో జరిగే ఈ ఉత్సవాన్ని రాష్ట్రస్థాయి ఉత్సవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమ్మవారి సిరిమానోత్సవంతో పాటు విజయనగరం ఉత్సవాలు నిర్వహించేందుకు రూ.2 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే, గత ఐదేళ్లూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు రూపాయి కూడా విదల్చలేదు. కూటమి ప్రభుత్వమైనా నిధులు మంజూరు చేస్తుందనే ఆశతో అధికారులు ఉన్నారు. పైడిమాంబ సిరిమానోత్సవాన్ని రాష్ట్రస్థాయి పండగగా నిర్వహించేందుకు 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగింది. 2018లో సిరిమానోత్సవం నిర్వహించేందుకు దేవదాయశాఖ అధికారులు కోటి రూపాయలతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వివిధ కారణాలతో నిధులు మంజూరు కాలేదు. ఆ తరువాత ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఐదేళ్లూ సిరిమానోత్సవం కోసం కోటి రూపాయలతో ప్రతిపాదనలు పంపించడం.. నిధులు మంజూరు చేయకపోవడం జరిగింది. ఒక్క ఏడాది కూడా నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. ఈ పర్యాయం అధికారులు మరో అడుగు ముందుకేశారు. విజయనగరం ఉత్సవాలు, పైడిమాంబ పండగ రెండింటికి కలిపి రూ.2 కోట్ల వ్యయం అవుతుందని అంచనావేశారు. శనివారం కలెక్టరేట్‌లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో జరిగిన సమావేశంలో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గట్టిగా ప్రయత్నిస్తే ఈ రెండు ఉత్సవాలకు నిధులు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

సీఎం, డిప్యూటీ సీఎంకు ఆహ్వానాలు

విజయవాడలో సీఎం చంద్రబాబును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలసి పైడిమాంబ సిరిమానోత్సవానికి రావాలని ఆహ్వానం అందించారు. అలాగే, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆహ్వానించేందుకు దేవదాయశాఖ సిద్ధమవుతోంది. అదే విధంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నా యుడు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు అందించనున్నారు. పందిరి రాట వేసిన అనంతరం దేవదాయశాఖ అధికారులు ఆహ్వాన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

శరవేగంగా ఏర్పాట్లు

పైడిమాంబ సిరిమానోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ ప్రభుత్వశాఖల అధికారులకు కలెక్టర్‌ అంబేడ్కర్‌ పనుల బాధ్యతను అప్పగించారు.. మరోవైపు దేవదాయశాఖ పైడిమాంబ చదురుగుడికి రంగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చదురుగుడి ముందు ఉన్న కాలువ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో విద్యుత్‌ దీపాల ఏర్పాటు ప్రక్రియ కూడా కొలిక్కి రానుంది. ఈ నెల 20న పైడిమాంబ వనంగుడి, చదురుగుడి వద్ద పందిరి రాట వేసే కార్యక్రమం జరగనుంది. అదే రోజు సిరిమానోత్సవానికి ఉపయోగించే చెట్టు ఎక్కడున్నది పూజారి చెప్పనున్నారు. ఇప్పటికే పైడిమాంబ దీక్షాదారుల మండల దీక్ష ప్రారంభమైంది. అర్ధమండల దీక్షలు త్వరలో ప్రారంభంకానున్నాయి.

ఇరుకుగా సిరిమాను దారులు

ప్రతి ఏటా హుకుంపేట నుంచి సిరిమాను బయలు దేరుతుంది. పుచ్చలు వీధి దాటుకుని, నాగవంశపు వీధి, ఉల్లి వీధి మీదుగా ఎంజీ రోడ్డు చేరుకుని పెడితల్లమ్మ గుడికి చేరుకుంటుంది. అయితే, నాగవంశపు వీధి, కాళ్లనాయుడు మందిరం, ఉల్లివీధి మార్గాలు చాలా చిన్నవిగా ఉండటంతో ఒక్కోసారి స్వల్ప తొక్కిసలాట జరుగుతుంటుంది. సిరిమానును తాకేందుకు పోటీపడే ప్రయత్నంలో భక్తులు కిందపడిన సందర్భాలు ఉన్నాయి. సిరిమాను వచ్చే మార్గలన్నీ చిన్నవి కావడం, రోడ్డు కూడా గుంతమయంగా మారటంతో పూజారి, రథాన్ని లాగేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది అయినా ఉల్లివీధి, నాగవంశపు వీధి మార్గాల్లో విస్తరణ పనులు చేపట్టి, గుంతలు పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, గత ఏడాది సిరిమాను ఉత్సవంలో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల అమ్మవారి వీఐపీ క్యూలైన్‌ గేట్‌కు తాళం వేసి తన జేబులో పెట్టుకోవడంతో అనేక విమర్శలు వెల్తువెత్తాయి. ఇలాంటి పనులు టీడీపీ నేతలు చేయకుండా ఎమ్మెల్యే అదితి కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Sep 16 , 2024 | 12:25 AM