Home Minister Anita : విశాఖ జైల్లో గంజాయి మొక్క
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:47 AM
విశాఖపట్నంలోని కేంద్ర కారాగారం లోపల గంజాయి మొక్క కనిపించడం ఆందోళనకు దారితీసింది. హోం మంత్రి అనిత ఆదివారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.
జైలు సందర్శనలో గుర్తించిన హోం మంత్రి వంగలపూడి అనిత
వైసీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే జైల్లో వరుస ఘటనలని విమర్శ
విశాఖపట్నం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని కేంద్ర కారాగారం లోపల గంజాయి మొక్క కనిపించడం ఆందోళనకు దారితీసింది. హోం మంత్రి అనిత ఆదివారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. జైలు లోపల ఆమె కలియ తిరుగుతుండగా నర్మద బ్లాక్ వద్ద గంజాయి మొక్కను చూసి అవాక్కయ్యారు. జైలు ఆవరణలో గంజాయి మొక్క ఎలా పెరిగిందని అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఖైదీలు ఎవరో గంజాయి వినియోగించినప్పుడు గింజలు పడి, మొక్క మొలిచి ఉంటుందని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ వివరించినట్టు సమాచారం. జైలులోని అన్ని బ్లాక్‌లతోపాటు ఆవరణను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం, జైలు బయట మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాల కారణంగానే జైలులో పరిస్థితి ఇలా తయారైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జైలులో పరిస్థితులను గాడిలో పెట్టడంతోపాటు ఖైదీల రక్షణకు చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. ఖైదీల వద్ద 10 రోజుల కిందట ఒకసారి, 4 రోజుల కిందట మరోసారి సెల్‌ఫోన్లు బయట పడ్డాయని, వీటిపై దర్యాప్తు ప్రారంభించామని, 15 రోజుల్లో నివేదిక వస్తుందని వివరించారు. ‘‘ఫోన్లు ఎవరు వినియోగించారు? ఎవరితో మాట్లాడారు? వారికి వాటిని ఎవరు సరఫరా చేశారు వంటి వివరాలన్నీ బయటపడతాయి’’ అని చెప్పారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు.
జైలు ఆవరణలో గంజాయి మొక్క కనిపించిందని, సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించకపోవడమే దీనికి కారణమని, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదన్నారు. జైలులో వరుస ఘటనల నేపఽథ్యంలో బాధ్యులైన జైలు సూపరింటెండెంట్‌తోపాటు అదనపు సూపరింటెండెంట్‌లను ఇటీవల సస్పెండ్ చేశామని తెలిపారు. జైలులో ప్రక్షాళన ప్రారంభించారని, సిబ్బందిని సైతం తనిఖీ చేస్తూ జైలులోకి గంజాయి, సెల్‌ఫోన్‌లు వంటివి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. యూనిఫాం సర్వీసులో ఉన్నవారు ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొనకూడదని తెలిపారు. పది రోజుల్లో జైలు ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా విశాఖ జైలు నుంచి కొంతమంది ఖైదీలను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తామని తెలిపారు.