Minister Nimmala: వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Jul 30 , 2024 | 02:12 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో రాష్ట్రాన్ని కూడా ప్రకృతి అదే విధంగా దీవిస్తోందని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఏపీలో జలకళ సంతరించుకుందని ఆయన చెప్పారు.
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో రాష్ట్రాన్ని కూడా ప్రకృతి అదే విధంగా దీవిస్తోందని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఏపీలో జలకళ సంతరించుకుందని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులు, జలాశయాలు నిండుకుండలా మారాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.."భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో శ్రీశైలం డ్యాం ఐదు గేట్లు ఎత్తి 1.35లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నాం. నాగార్జునసాగర్ పూర్తి సామర్థ్యం 312క్యూసెక్కులకు గాను 140క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరింది. రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీరు అవసరాలు తీర్చే విధంగా పోతిరెడ్డి, వెలుగోడు, ఆల్మట్టి డ్యాంలు నిండాయి.
హంద్రీనీవా, తుంగభద్రా నుంచి పెద్దఎత్తున వర్షపు నీరు జలాశయాలకు చేరుతోంది. హంద్రీనీవా ప్రాజెక్టు నిర్వాహక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారం రోజుల క్రితమే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వారు స్పందించలేదు. ఆ అధికారుల్లో గత వైసీపీ ప్రభుత్వ పాలన వాసన పోలేదు. వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.