Free Sand Policy: ఇసుకలో ఎందుకీ గందరగోళం?
ABN , Publish Date - Aug 01 , 2024 | 04:29 AM
‘ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమలులో గందరగోళం ఎందుకు వచ్చింది?
తవ్వకం, రవాణా చార్జీలు ఎందుకు పెరిగాయి?
ప్రజలే రవాణా చేసుకునేలా వెసులుబాటు
గ్రామ సచివాలయాల ద్వారా ఆన్‌లైన్ పర్మిట్లు
గనుల్లో నాటి వైసీపీ అక్రమాలు తవ్వితీయండి
గనుల శాఖ సమీక్షలో సీఎం ఆదేశాలు
‘‘రవాణా చార్జీలు భారంగా మారాయని ఇసుక వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఆ చార్జీలు ప్రభుత్వం వసూలు చేయడం ఏమిటి? రాష్ట్రమంతా ఆన్‌లైన్ పర్మిట్ విధానం తీసుకురండి. గ్రామ సచివాలయాల్లో ప్రజలు ఆన్‌లైన్ పర్మిట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేయండి. ఇసుక బుక్ చేసుకున్నవారే, ఇసుక రవాణాకు వాహనాలు రీచ్‌కు లేదా డిపోకు తీసుకొని వెళ్లేలా అనుమతి ఇవ్వండి. దీని వల్ల రవాణా చార్జీలు ఏ మేరకు ఉంటాయో స్వయంగా వారికే తెలుస్తుంది. అలాగని, వాహనదారులు అడ్డగోలుగా రవాణా చార్జీలు వసూలు చేయకుండా నియంత్రించండి’’
- అధికారులకు చంద్రబాబు ఆదేశాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘‘ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమలులో గందరగోళం ఎందుకు వచ్చింది? గతంలో కన్నా ఇప్పుడే ధరలు పెరిగాయన్న విమర్శలు, ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? తవ్వకం, రవాణా చార్జీలు ప్రభుత్వం తీసుకుంటుందా? ప్రజలు అలాగే భావిస్తున్నారా? ఈ సమస్య పరిష్కారంపై మీరు ఏ ఆలోచనలతో వచ్చారు?’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు... గనుల శాఖ అధికారులను ప్రశ్నించారు. చంద్రబాబు బుధవారం గనులశాఖపై సమీక్ష జరిపారు. ఇసుక తవ్వకం, రవాణా చార్జీల రూపంలో ప్రజలపై భారం పడకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ విషయంలో ప్రజలతో కూడా మాట్లాడి వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉచిత ఇసుకపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇంకా మేలైన చర్యలకోసం వారితో మాట్లాడాలని సీఎం నిర్దేశించారు. ఇసుక ఇస్తున్నందుకు ప్రభుత్వం ఎలాంటి ఫీజులు వసూలుచేయడం లేదు. అయినా, ఇసుక తవ్వినందుకు లేబర్ చార్జీలు, రీచ్ నుంచి డిపోకు, అక్కడి నుంచి వినియోగదారునికి చేరడానికి రవాణా చార్జీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కంటే ఎక్కువగా ధరలు వసూలు చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నారు. సమీక్షలో ఈ అంశాలనే ప్రస్తావించి ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని అధికారులను ప్రశ్నించారు. అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో....’’ మీరు కూడా రొటీన్‌గా వస్తే ఎలా? అధ్యయనం చేసి పరిష్కారం కనిపెట్టండి’’ అని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. తవ్వకం చార్జీలు అన్ని రీచ్‌ల్లో ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని బాబు సూచించారు. రవాణా చార్జీల విషయంలో ఏకరీతి విధానం తీసుకురాలేమా? అని ఆయన ప్రశ్నించారు. రవాణా భారం తగ్గించే విషయంలో అధికారులు ప్రజలతో మాట్లాడి వారి సూచనలు, సలహాలను తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలాఉంటే , పట్టా భూముల్లో ఉన్న ఇసుకకు సీనరేజీ కట్టించుకొని అమ్ముకునే అవకాశం కల్పించాలన్న అధికారుల ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు.
అక్రమాలను తవ్వితీయండి
సిలికాసాండ్, క్వార్ట్జ్ తవ్వకాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులున్నాయని, వాటిపై దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. అక్రమాలను నిరూపించేందుకు పక్కా ఆధారాలు సేకరించాలన్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో జరిగిన అక్రమాలను తవ్వితీయాలని ఆదేశించారు. కాగా, మంగంపేటలోని బెరైటీస్ టెండర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని గనులశాఖ ముఖ్యకార్యదర్శి మీనా నివేదించారు. ధరలపై నిర్ణయం తీసుకున్నాకే టెండర్లపై స్పష్టత ఇస్తామన్నారు. సీనరేజీ, బొగ్గు కాంట్రాక్టులపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. కాగా, డీసిల్టింగ్ పాయింట్ల ఏర్పాటుకు 15 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు కోరారు.