YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్
ABN , Publish Date - Jul 27 , 2024 | 03:47 AM
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీపై అలకబూనారు!
ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదాకా రాను
బయట మీడియాతోనే మాట్లాడతా!
పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మంచోళ్లు
వాళ్లను అభాసుపాలు చేస్తున్నారు
మీడియాతో వైఎస్ జగన్
‘మదనపల్లె’ది ప్రమాదమే అని సూత్రీకరణ
అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీపై అలకబూనారు! ‘నాకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదాకా సభకు వచ్చేది లేదు’ అని స్పష్టం చేశారు. అసెంబ్లీ జరిగినన్ని రోజులు... అదే సమయంలో బయట మీడియాతో మాట్లాడతానని తెలిపారు. శుక్రవారం ఆయన తాడేపల్లి ప్యాలె్‌సలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ముఖ్యమంత్రి ఎంత సమయం మాట్లాడితే.. అంతే సమయం నాకూ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతిపక్షనేతగా నేను చేయి ఎత్తితే వెంటనే స్పీకర్ మైక్ ఇవ్వాలి. అందుకే.. నాకు ఆ హోదా ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో విడుదల చేసిన శ్వేత పత్రాలకు దీటుగా సమాధానం చెప్పేవాడిని. కాని.. నాకు ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదు. అందుకే.. తాడేపల్లి నివాసంలో జర్నలిస్టులతో మాట్లాడుతున్నాను’’ అని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 52 రోజులుగా రాక్షసపాలన సాగుతోందని ఆక్రోశించారు. ‘‘8 మందిపై అత్యాచారం జరిగింది. నలుగురు హత్యకు గురయ్యారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై హత్య చేశారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండ వెళ్లాను. ప్రభుత్వాన్ని నిలదీశాను. దానిని డైవర్ట్ చేయడానికి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని హైలెట్ చేస్తున్నారు’’ అని జగన్ పేర్కొన్నారు.
వాళ్లిద్దరూ మంచోళ్లు...
మదనపల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిఽథున్‌రెడ్డి ఏదో చేశారంటూ ప్రచారం చేస్తున్నారని... వాళ్లిద్దరూ మంచోళ్లని జగన్ కితాబిచ్చారు. అందుకే... పెద్దిరెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మిథున్ రెడ్డి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. వాళ్లను అభాసుపాలు చేయాలనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. దాడికి గురైనవారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో రివర్స్ పాలనసాగుతోంది ’’ అని జగన్ ఆక్రోశించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదని సమర్థించారు.
అబద్ధాలపై గవర్నర్‌కు లేఖ రాస్తా
శాసనసభలో గవర్నర్ ప్రసంగ సమయంలో అప్పులకు సంబంధించి చెప్పిన గణాంకాలన్నీ తప్పులేనని జగన్ పేర్కొన్నారు. తన హయాంలో మొత్తంగా నాలుగు లక్షల కోట్లమేర మాత్రమే అప్పులు చేశామని.. ప్రభుత్వ గ్యారెంటీలను, ఇతర అప్పులను కలిపితే ఏడు లక్షల కోట్లు అని తెలిపారు. కానీ... గవర్నర్ ప్రసంగంలో దీనిని పది లక్షల కోట్ల రూపాయలుగా పేర్కొన్నారని అన్నారు. వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ గవర్నర్‌కు లేఖ రాస్తానని తెలిపారు.