Share News

Air India: ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా విధించిన డీజీసీఏ.. కారణమదే

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:44 PM

అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకుగానూ ఎయిరిండియాకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది.

Air India: ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా విధించిన డీజీసీఏ.. కారణమదే

ఢిల్లీ: అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకుగానూ ఎయిరిండియాకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా రోస్టరింగ్‌ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపింది. దీంతో సదరు సంస్థకు రూ.90 లక్షల జరిమానా విధించింది. దీనికితోడు ఎయిర్‌ఇండియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌కు రూ.6 లక్షలు, ట్రైనింగ్‌ డైరెక్టర్‌కు రూ.3 లక్షల చొప్పున ఫైన్ విధించింది. లోపాలపై సంస్థ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.


అసలేమైందంటే..

ముంబయి నుంచి రియాద్‌కు జులై 9న ఎయిర్‌ఇండియా ఓ విమానం నడిపింది. ట్రైనింగ్ కెప్టెన్‌తో కలిసి పైలట్‌ డ్యూటీలో ఉండాలి. కానీ ట్రైనింగ్‌ కెప్టెన్‌‌కి ఆరోగ్య సమస్యలు రావడంతో.. రోస్టరింగ్ విధానంలో నార్మల్‌ లైన్‌ కెప్టెన్‌ విధుల్లోకి వెళ్లారు. ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇచ్చే అర్హత ఆయనకు ఉండదు. నిర్వహణలో లోపాల కారణంగానే ఈ ఘటన జరిగింది.

దీంతో ట్రైనీ పైలట్‌, కెప్టెన్‌ బేస్‌ మేనేజర్‌కు రిపోర్ట్‌ చేశారు. తరువాత ఈ వివాదంపై డీజీసీఏకు నివేదిక అందింది. డీజీసీఐ పరిశీలించి ఎయిర్‌ఇండియాకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సిబ్బంది వైఫల్యం కారణంగా పేర్కొంటూ.. డీసీజీఏ తీవ్రమైన భద్రతా లోపంగా పరిగణించింది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఎయిర్ ఇండియాకు సూచించి.. భారీ మొత్తంలో ఫైన్ విధించింది.


ఏడాదిలో రెండో ఫైన్..

ఈ ఏడాది ఎయిర్ ఇండియాకు ఫైన్ పడటం ఇది రెండో సారి. మార్చిలోనూ సంస్థకు డీజీసీఏ రూ.80 లక్షల ఫైన్‌ని విధించింది. సంస్థలో 60 ఏళ్లు పైబడిన వారికి సంస్థ పనులు అప్పగించిందని.. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని డీజీసీఏ తెలిపింది. వారానికి ఒకసారి కూడా విశ్రాంతి ఇవ్వకుండా నిరంతరం పనులు చేయిస్తూ నిబంధనల అతిక్రమణ యథేచ్ఛగా కొనసాగిస్తోందని ఆరోపించింది. రికార్డులను సైతం తప్పుగా చూపిస్తోందనే కారణంతో అప్పట్లోనే రూ.80 లక్షల ఫైన్ విధించింది.

Updated Date - Aug 23 , 2024 | 04:05 PM