కార్ల స్టాక్ క్లియరెన్స్ సేల్
ABN , Publish Date - Jul 14 , 2024 | 03:43 AM
దేశీయ కార్ల కంపెనీలు జోరుగా డిస్కౌంట్లు కల్పిస్తున్నాయి. ఎందుకంటే, గడిచిన కొన్ని నెలల్లో వాహన విక్రయాల జోరు తగ్గింది. లోక్‌సభ ఎన్నికలు, ఎండల జోరుతో ఈ వేసవి సీజన్ ప్యాసింజర్ వాహన మార్కెట్‌కు అంతగా...
డీలర్ల వద్ద పేరుకుపోయిన రూ.60,000 కోట్ల వాహన నిల్వలు.. ఇప్పటివరకిదే అత్యధిక ఇన్వెంటరీ
విక్రయాలు మందగించడం వల్లే..
కస్టమర్లకు భారీ రాయితీలతో గాలం
న్యూఢిల్లీ: దేశీయ కార్ల కంపెనీలు జోరుగా డిస్కౌంట్లు కల్పిస్తున్నాయి. ఎందుకంటే, గడిచిన కొన్ని నెలల్లో వాహన విక్రయాల జోరు తగ్గింది. లోక్‌సభ ఎన్నికలు, ఎండల జోరుతో ఈ వేసవి సీజన్ ప్యాసింజర్ వాహన మార్కెట్‌కు అంతగా కలిసిరాలేదు. ఎన్నికల తర్వాత విక్రయాలు మళ్లీ జోరందుకోవచ్చని కంపెనీలు భావించినప్పటికీ, ఉత్తరాదిలో భారీ ఎండల కారణంగా కార్ల షోరూమ్‌లను సందర్శించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దాంతో గత నెల కార్ల విక్రయాల్లో కేవలం 3 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పుడేమో వర్షాకాలం.
సాధారణంగానే ఈ సీజన్‌లో వాహన మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉంటుంది. మళ్లీ పండగ సీజన్ ప్రారంభమైతే తప్ప విక్రయాలు పుంజుకునే అవకాశాల్లేవు. దాంతో కంపెనీలు కస్టమర్లను ఆకర్షించే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి. ప్రస్తుత స్టాక్‌ను క్లియర్ చేయడంతో పాటు విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీలు పలు మోడళ్ల కార్ల ధరలను తగ్గించడంతో పాటు భారీగా డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి.
ప్రస్తుతం కార్ల కంపెనీలు, డీలర్ల వద్ద మరో రెండు నెలలకు సరిపోయే రూ.60,000 కోట్ల విలువైన వాహన నిల్వలు పేరుకుపోయాయి. దేశీయ కార్ల పరిశ్రమ చరిత్రలో ఇప్పటివరకిదే అత్యధిక ఇన్వెంటరీ. ‘‘ప్రస్తుతం డీలర్ల వద్ద అమ్ముడుపోకుండా ఉన్న కార్ల నిల్వలు 6-6.5 లక్షల యూనిట్ల వరకు ఉంటాయి. గడిచిన రెండు నెలల్లోనే నిల్వలు 77,000 యూనిట్ల మేర పెరిగాయి. ప్రస్తుతం ఇన్వెంటరీలోని కార్ల సగటు ధర రూ.9.5 లక్షల స్థాయిలో ఉంటుంది. ఈ లెక్కన కార్ల నిల్వల విలువ రూ.60,000 కోట్ల వరకు ఉంటుంద’’ని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు.
జూన్ నెలలో కార్ల కంపెనీల టోకు విక్రయాలు (డీలర్లకు సరఫరా చేసినవి) 3.41 లక్షల యూనిట్లుగా ఉండగా.. డీలర్లు మాత్రం 2,81,600 యూనిట్ల వాహనాలను విక్రయించగలిగారు. కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా.. రిటైల్ విక్రయాలకు మధ్య అంతరం భారీగా ఉందనడానికిదే నిదర్శనం. అయితే, అధిక నిల్వలపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గిరాకీ, సరఫరా మధ్య సమతుల్యం సాధించడం కంపెనీలకు బాగా తెలుసునని భారత వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్) ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ అన్నారు.
తగ్గిన రుణ లభ్యత
గడిచిన కొన్ని నెలలుగా బ్యాంకులు సైతం కార్ల కొనుగోలుకు రుణాలిచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని డీలర్లు అంటున్నారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి తప్ప మిగతా వారికి వాహన రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావట్లేదని, ఇందుకు తోడు అధిక వడ్డీ రేట్లు కూడా కార్ల విక్రయాలపై ప్రభావం చూపాయని వారన్నారు.
ఫోక్స్‌వేగన్
జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వేగన్ తన ఎస్‌యూవీ టైగున్‌పై రూ.1.78 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.73,000 ఉచిత యాక్సెసరీలు, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి రూ. 2.9 లక్షల వరకు ప్రయోజనాలందిస్తున్నట్లు తెలిసింది. అలాగే, తన అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ మోడల్ టిగ్వాన్‌పై రూ.3.4 లక్షల డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
స్కోడా
చెక్ రిపబ్లిక్ ఆటో కంపెనీ స్కోడా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ కుషాక్‌పై ఏకంగా రూ.2.5 డిస్కౌంట్ అందిస్తోంది. తెలిసింది. అలాగే, 3ఏళ్ల కార్ మెయింటెనెన్స్ ప్యాకేజీతో పాటు 5 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ సైతం కల్పిస్తోంది. కంపెనీ తన ఎస్‌యూవీ కొడియాక్‌పైనా రూ.2.5లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
హ్యుండయ్
హ్యుండయ్ మోటార్ గ్రాండ్ ఐ10 నియో్‌సపై వేరియంట్‌ను బట్టి రూ.15,000-35,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐ20పై రూ.20,000 -35,000, వెర్నాపై రూ.15,000, అల్కజార్‌పై రూ.55,000, టూసన్‌పై రూ.50,000-2 లక్షల వరకు రాయితీ అందిస్తోంది. అలాగే, ఎక్స్‌టర్‌పై రూ.10,000, వెన్యూపై రూ.35,000 -45,000 నగదు ప్రయోజనాలను కల్పిస్తోంది. ఇందుకు తోడు, రూ.10,000-30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.3,000 కార్పొరేట్ బోనస్ కూడా అందిస్తోంది. కంపెనీ హైయెస్ట్ సెల్లింగ్ మోడల్ క్రెటాపైన మాత్రం ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్ చేయడం లేదు.
టాటా మోటార్స్
టాటా మోటార్స్ తన హ్యాచ్‌బ్యాక్ కారు టియాగోపై రూ.25,000- 30,000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. టిగోర్‌పై రూ.25,000-30,000, ఆలో్ట్రజ్ పై రూ.15,000-25,000, నెక్సాన్‌పై రూ.20,000 రాయితీ ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ డీలర్లు వెల్లడించారు. టియాగో, టిగోర్ ఎలక్ట్రిక్ వేరియంట్లపైనేతే రూ.75,000- 85,000 నగదు ప్రయోజనాలందిస్తోంది. నెక్సాన్ ఈవీపై రూ.1.1 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే, రూ.10,000-30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.3,000-8,000 కార్పొరేట్ డిస్కౌంట్ సైతం అందిస్తున్నట్లు వారు తెలిపారు.
మారుతి సుజుకీ
దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తన కాంపాక్ట్ కార్ల ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లపై క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. బ్రెజ్జా ఆటోమెటిక్‌పై రూ.10,000, ఆల్టో కే 10పై రూ.30,000-45,000 వరకు, ఎస్-ప్రెస్సోపై రూ.35,000-40,000 వరకు, వ్యాగన్ ఆర్‌పై రూ.30,000-40,000 వరకు, ఈకోపై రూ.10,000-20,000 వరకు, డిజైర్‌పై రూ.10,000-15,000 వరకు రాయితీ అందిస్తున్నట్లు తెలిసింది. దీనికి అదనంగా రూ.10,000 -20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2000-5000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
నెక్సా షోరూమ్ మోడళ్ల విషయానికొస్తే, ఇగ్నిస్ మరియు బాలెనోపై రూ.35,000-40,000, ఫ్రాంక్స్‌పై రూ.22,500-35,000 వరకు, సియాజ్, ఎక్స్‌ఎల్ 6పై రూ.20,000, గ్రాండ్ విటారాపై రూ.30,000-50,000 వరకు, జిమ్నీపై రూ.3.3 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు డీలర్ వర్గాలు తెలిపాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా
ఎక్స్‌యూవీ 700 ధరను రూ.2.2 లక్షల వరకు తగ్గించిన మహీంద్రా అండ్ మహీంద్రా.. బొలెరో నియోపై ఎక్స్ఛేంజ్ బోన్‌సతో కలిపి రూ.90,000 క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌యూవీ 300పై రూ.1.5 లక్షల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే, కొన్ని నగరాల్లో కంపెనీ థార్, స్కార్పియో ఎన్‌పై పరిమిత ఆఫర్లను సైతం అందిస్తున్నట్లు డీలర్లు వెల్లడించారు.ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ పై మాత్రం ఎలాంటి రాయితీలు లేవు.
ఎంజీ మోటార్
బ్రిటన్ మోటార్ బ్రాండ్ ఎంజీ తన ఎస్‌యూవీ గ్లోస్టర్‌పై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్‌ను కల్పిస్తోంది. జెడ్‌ఎస్ ఈవీపై రూ.1.5 లక్షల వరకు రాయితీ అందిస్తున్నట్లు తెలిసింది.