పన్ను పోటు తగ్గించరూ..!
ABN , Publish Date - Jul 21 , 2024 | 02:03 AM
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అంతటా నెలకొని ఉంది. ముఖ్యంగా వేతన జీవులు ఈ నెల 23న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పన్ను శ్లాబుల్లో మార్పులతో పాటు...
బడ్జెట్‌పై వేతన జీవుల ఆశలు
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అంతటా నెలకొని ఉంది. ముఖ్యంగా వేతన జీవులు ఈ నెల 23న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పన్ను శ్లాబుల్లో మార్పులతో పాటు మరికొన్ని విషయాల్లో ప్రభుత్వం తమపై కనికరం చూపిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. పాత ట్యాక్స్ విధానం కింద వేతన జీవులు వచ్చే కేంద్ర బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారంటే..
ట్యాక్స్ శ్లాబుల్లో మార్పు
గత ఏడాది బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులపై కొద్దిగా దయ చూపారనే చెప్పాలి. పన్ను మినహాయింపు వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. అలాగే వార్షిక ఆదాయం రూ.5 కోట్లకు మించి ఉన్న వారిపై విధించే సర్‌చార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి కుదించారు. కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎంచుకునే వారికి ఇవి ఆకర్షించే అంశాలే. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి మాత్రం పెద్దగా ఊరట లభించలేదనే చెప్పాలి. ప్రస్తుతం జీవన వ్యయం పెరిగిపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి వచ్చే బడ్జెట్లో అందరికీ పన్ను మినహాయింపు వార్షిక ఆదాయ పరిమితిని ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. అలాగే ప్రామాణిక మినహాయింపునీ ప్రస్తుత రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
హెచ్ఆర్ఏ రేట్లు
కొవిడ్ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అద్దెలు పెరిగిపోయాయి. గత ఏడాదైతే 30 శాతం పెరిగాయి. ఆర్థికాభివృద్ధి కారణంగా ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, పుణె, నోయిడా వంటి చోట్లా ఇళ్ల అద్దెలు చుక్కలంటుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగుల మొత్తం జీతంలో 20 నుంచి 30 శాతాన్నే హౌస్ రెంట్ అలవెన్స్ (హెర్ఆర్ఏ)గా అనుమతిస్తున్నారు. ప్రధాన మెట్రో నగరాల్లో అయితే బేసిక్ జీతంలో 50 శాతం, ఇతర ప్రధాన నగరాల్లో 40 శాతాన్ని అనుమతిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాల్లోని ఉద్యోగులకీ తమ బేసిక్ జీతంలో 50 శాతాన్ని హెచ్ఆర్ఏగా అనుమతించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఈవీలకు ప్రోత్సాహం
ప్రస్తుతం మన దేశంలోనూ విద్యుత్ వాహనాల (ఈవీ) హవా నడుస్తోంది. 2019 బడ్జెట్లో ఈవీ కార్లు కొని వినియోగించే ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఏటా రూ.1.5 లక్షల వరకు ఆదాయ మినహాయింపుని అనుమతించేవారు. ఏ కారణంతోనే గత ఏడాది నుంచి ఈ మినహాయింపును నిలిపివేశారు. కనీసం వచ్చే బడ్జెట్లో అయినా దీన్ని పునరుద్ధరించి, మినహాయింపు పరిమితినీ రూ.2 లక్షలకు పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు.
గృహ రుణాలు
అందరికీ సొంతిల్లు ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా 2019లో ఆదాయ పన్ను చట్టంలో 80ఈఈఏ తీసుకొచ్చారు. ఈ సెక్షన్ కింద తొలిసారిగా గృహ రుణంతో అందుబాటు ధరల కేటగిరీలో ఇల్లు కొనుక్కున్న వ్యక్తులకు, ఆ రుణంపై ఏటా చెల్లించే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. గత ఏడాది నుంచి దీన్ని తీసివేశారు. కనీసం వచ్చే బడ్జెట్లో అయినా ఆర్థిక మంత్రి దీన్ని పునరుద్ధరించి.. మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వేతన జీవుల కాంక్ష.